IPL 2021: అవకాశాన్ని అందిపుచ్చుకొని.. సంచలనం సృష్టించాడు

తాజా వార్తలు

Published : 11/10/2021 02:05 IST

IPL 2021: అవకాశాన్ని అందిపుచ్చుకొని.. సంచలనం సృష్టించాడు

ఒక్క మ్యాచ్‌తో హీరోగా మారిన కేఎస్‌ భరత్‌

(Photo: KS Bharat Instagram)

జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ, ఐపీఎల్‌ చాలా మందికి చాలా అవకాశాలిచ్చింది. సద్వినియోగం చేసుకున్నవాళ్లు హీరోలయ్యారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. అలాంటి కోవలోకే వస్తాడు మన తెలుగు తేజం కేఎస్‌ భరత్‌. విశాఖపట్నంలో టీమ్‌ఇండియా మ్యాచ్‌లకు బాల్‌బాయ్‌గా సేవలందించిన అతడు.. ఇప్పుడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో కీలక ఆటగాడిగా మారాడు. తాజాగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకొని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు..

అతడేం టీ20 క్రికెటర్‌ కాదు..

(Photo: KS Bharat Instagram)

భరత్‌ ఈ ఐపీఎల్‌కు ముందు అసలు టీ20 క్రికెటర్‌గా కనిపించలేదు. అందుకు కారణం అతడి గణాంకాలే. ఈ సీజన్‌కు ముందు మొత్తం 48 పొట్టి మ్యాచ్‌లు ఆడిన భరత్‌ 106.10 స్ట్రైక్‌రేట్‌తో 17.80 సగటుతో 730 పరుగులే చేశాడు. ఒక టీ20 క్రికెటర్‌కు ఈ గణాంకాలు అసలు సరితూగవు. కానీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిపై నమ్మకం ఉంచింది. గత రెండేళ్లలో అతడి ఆటతీరులోని మార్పులు గమనించింది. ఈ సీజన్‌ వేలంలో రూ.20లక్షల కనీస ధరకు కొనుగోలు చేసి యూఏఈలో అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా భరత్‌ అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నాడు. జట్టు విజయాల్లో తనవంతు పాత్ర పోషించాడు. దిల్లీతో ఆడిన మ్యాచ్‌లో చివరి బంతికి సిక్సర్‌ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా ఒక్కసారిగా హీరో అయిపోయాడు. ఇక ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడి.. 45.50 సగటుతో 182 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్‌లో దిల్లీపై 78 పరుగుల సంచలన ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు.

అడిగి తెలుసుకోడు.. చూసే నేర్చుకుంటాడు..

(Photo: KS Bharat Instagram)

భరత్‌ ఏదైనా నేర్చుకోవాలంటే సీనియర్లను అడిగి తెలుసుకోడు. వాళ్లెలా ఆడుతున్నారో దగ్గరుండి గమనిస్తాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. దిల్లీతో మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన భరత్‌.. ఏదైనా తాను నేర్చుకోవాలంటే మైదానంలో ఇతరులు ఏం చేస్తున్నారు, ఎలా ఆడుతున్నారు, ఎలా సాధన చేస్తున్నారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తానని చెప్పాడు. ‘నేను పరిస్థితులకు తగ్గట్టు ఆడతా. జట్టును విజయతీరాలకు చేర్చడమే నా లక్ష్యం. ఎక్కడ ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తున్నానని ఆలోచించను. నా స్ట్రైక్‌రేట్‌ ఎలా ఉందనే గణాంకాలు కూడా పట్టించుకోను. కొన్నిసార్లు నా స్ట్రైక్‌రేట్‌ ఆశించినంత మేర ఉండదు. కానీ, బ్యాటింగ్‌ చేసేటప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని ఆడతా. జట్టును విజయతీరాలకు చేర్చడమే నాకు ముఖ్యం. అలా విజయాలు సాధిస్తున్నన్ని రోజులు ఈ గణాంకాలు, బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏవీ నాకు ప్రాధాన్యం కావు. నేను టీమ్‌ఇండియాతోనూ కలిసి ప్రయాణం చేశా. సీనియర్లు మైదానంలో ఎలా ఆడుతున్నారు. ఎలాంటి దృక్పథంతో ఉన్నారనే విషయాలు దగ్గరుండి చూశా. ఏదైనా అలాగే నేర్చుకుంటా’ అని ఈ యువ సంచలనం వివరించాడు.

బాల్‌బాయ్‌గా ఆరంభించి.. బెంగళూరు ఆటగాడిగా ఎదిగి..

(Photo: KS Bharat Instagram)

భరత్‌ పుట్టి పెరిగింది విశాఖపట్నంలో. చిన్నప్పుడే తండ్రి శ్రీనివాసరావు స్థానిక క్రికెట్‌ అసోసియేషన్‌లో బాల్‌బాయ్‌గా చేర్పించారు. అక్కడ కృష్ణారావు అనే కోచ్‌ భరత్‌లోని ప్రతిభను గుర్తించి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దాడు. దీంతో అండర్‌-13, అండర్‌-19 స్థాయిలో ఆంధ్రా  క్రికెట్‌ జట్టులో పాల్గొన్నాడు. అలా 2012లో కేరళపై ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ అరంగేట్రం చేసిన అతడు తర్వాత లిస్ట్‌-ఏ క్రికెటర్‌గా మారాడు. ఈ క్రమంలోనే 2015 రంజీ ట్రోఫీలో ఒక మ్యాచ్‌లో ట్రిపుల్‌ సెంచరీ బాది.. ఈ ఘనత సాధించిన తొలి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా రికార్డలకెక్కాడు. దీంతో అదే ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌ (ప్రస్తుత దిల్లీ క్యాపిటల్స్‌) భరత్‌ను రూ.10లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అవకాశం ఇవ్వలేదు. ఆపై మళ్లీ ఇన్నాళ్లకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిలోని ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చింది. దీన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకున్న భరత్‌ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా ఎదిగాడు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని