
తాజా వార్తలు
రోజుల కోసం కాదు.. గెలవడానికి ఆడతాం: విరాట్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా మ్యాచ్‌లు గెలవడానికి ఆడుతుందని, ఎన్ని రోజులు ఆడామని లెక్కపెట్టడానికి కాదని కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. నాలుగో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశాడు. పిచ్‌పై వస్తున్న విమర్శల నేపథ్యంలో విరాట్ ఘాటుగా స్పందించాడు. ఇప్పుడు క్రికెట్ బాల్, పిచ్‌పై ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థంకావడం లేదన్నాడు. మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడానికి.. ఆ వికెట్‌పై బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడకపోవడమే కారణమని చెప్పాడు. స్పిన్‌కు అనుకూలించే ఆ పిచ్ మీద బ్యాట్స్‌మెన్ ఆడటానికి తగినంత నైపుణ్యం లేదని ఎందుకు అనుకోరని ప్రశ్నించాడు. ఇరు జట్ల ఆటగాళ్లూ అక్కడ సరిగ్గా ఆడలేకపోయారని గుర్తు చేశాడు.
‘మేం ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు జనాలు హోమ్ అడ్వాంటేజ్ గురించి అడిగితే సంతోషిస్తా. కానీ ఇలా మ్యాచ్‌లు రెండు స్పిన్‌కు అనుకూలించే వికెట్లపై ఆడటం చూసి మాట్లాడితే నచ్చదు. మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. మీరు మ్యాచ్‌లు గెలవడానికి ఆడతారా? లేక ఎన్ని రోజులు ఆడామని చెప్పుకోవడానికి ఆడతారా? మేమైతే విజయం సాధించడానికే ఆడతాం. ప్రతి ఒక్కరూ పరుగులు చేయాలని ఆడం. టీమ్ఇండియా గెలిచినప్పుడు ప్రజలు సంతోషించాలి. అదెన్ని రోజుల్లో గెలిచామనే విషయం చర్చకు రావొద్దు. ఇంతకుముందు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు కూడా వచ్చాయి. కానీ, ఇలా ఒక్క మ్యాచే చూసి విమర్శలు చేయడం సరికాదు’ అని విరాట్ పేర్కొన్నాడు. అలాగే గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ఓ టెస్టులో టీమ్ఇండియా మూడో రోజు 36 ఓవర్లకే కుప్పకూలిందని, సీమ్‌కు అనుకూలించే ఆ పరిస్థితుల్లో ఎవరూ పిచ్ గురించి మాట్లాడలేదని కోహ్లీ గుర్తుచేశాడు. అక్కడ తాము పిచ్ గురించి ఆలోచించకుండా, బ్యాటింగ్ నైపుణ్యాన్ని మెరుగు పర్చుకునే విషయంపైనే దృష్టిసారించామని చెప్పాడు. అక్కడ పిచ్‌లు ఎలా ఉన్నాయి? బంతి ఎలా స్పందింస్తుందనే విషయాలు ఎవరూ పట్టించుకోలేదని కెప్టెన్ వివరించాడు.