
తాజా వార్తలు
కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
ఇంటర్నెట్‌డెస్క్: బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా బదులిస్తోంది. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ అర్ధశతకాలతో సత్తాచాటారు. కాగా, అరంగేట్రంలోనే బంతితో పాటు బ్యాటుతో సుందర్ అలరిస్తున్నాడు. మూడు వికెట్లు తీయడంతో పాటు 62 పరుగులు చేసి జట్టుకు విలువైన ఆటగాడిగా మారుతున్నాడు.
అయితే మూడో రోజు ఆటలో సుందర్ బాదిన సిక్సర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. లైయన్ వేసిన బంతిని లాంగ్ఆన్ మీదగా అతడు స్టాండ్స్‌కు తరలించాడు. అయితే దీనిలో ప్రత్యేకత ఏముంది? ఎందుకు వైరల్ అవుతుందని అనుకుంటున్నారా? అతడు షాట్ ఆడిన తర్వాత బంతిని చూడకపోవడమే ప్రత్యేకత! లెగ్‌స్టంప్ వైపుగా లైయన్ వేసిన బంతిని మోకాలుపై కూర్చొని సుందర్ భారీషాట్ ఆడాడు. అయితే బంతి ఎక్కడ పడింది?ఫీల్డర్ చేతిలో పడిందా అనే విషయాల్ని కూడా సుందర్ గమనించలేదు. ఎందుకంటే తన సామర్థ్యంపై ఉన్న నమ్మకమే దానికి కారణం.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి.. ‘చూడలేదు..కానీ, భారీ సిక్సర్’ అని దానికి వ్యాఖ్య జత చేశారు. అద్భుతమైన షాట్, నీ ఆత్మవిశ్వాసానికి హ్యాట్సాఫ్ అని సుందర్‌ను కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు.. కాస్త బంతి ఎక్కడ పడిందో చూడవ్వయా సుందర్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అయితే గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఇదే తరహాలో సిక్సర్ బాదాడు. న్యూజిలాండ్‌పై ధోనీ ఆడిన ఆ షాట్‌ను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి
ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్