RCB - Kohli: అయ్యో... ఆల్‌రౌండర్ లేక ఆగిపోయారే!

తాజా వార్తలు

Updated : 12/10/2021 14:58 IST

RCB - Kohli: అయ్యో... ఆల్‌రౌండర్ లేక ఆగిపోయారే!

ఈ సాలా కప్‌ నమదే...

ఈ స్లోగన్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 14 ఏళ్లుగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులు ఈ సాలా కప్‌ నమదే (ఈ సారి కప్‌ మాదే) దీనిని మంత్రంలా జపిస్తున్నారు. ఈ ఏడాది కోట్లాది మంది అభిమానుల ఆశ నెరవేరేలా కనిపించినా...  కోహ్లీ సేన ట్రోఫీ పోటీలో రెండు మెట్ల ముందు బోల్తా పడింది. ట్రోఫీ సాధించి కెప్టెన్సీ నుంచి దిగిపోతాడు అనుకున్న కోహ్లీ... అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు!

విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాడు... టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం కప్‌లు సాధించలేకపోతున్నాడు. ఈ విషయంలో టీమిండియా అభిమానులు నిరాశగానే ఉన్నారు. దానిని కొనసాగిస్తున్నాడా... అన్నట్లుగా ఐపీఎల్‌లోనూ ట్రోఫీలు గెలవలేకపోతున్నాడు. ఆర్సీబీ పగ్గాలు అందుకున్నాక నాలుగు సార్లు ప్లేఆఫ్స్‌కు (అందులో ఒక్కటే రన్నరప్‌) వచ్చినా కప్‌ మాత్రం కలగానే మిగిలిపోయింది. దీంతో ఏటా టోర్నీ ముగిసిన వెంటనే కోహ్లీ అండ్‌ కో... అంతర్మథనం చేసుకుంటూ ఉంటారు.

రన్‌రేట్ల లెక్క లేకుండా...

ఒక్కసారి చిన్నగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే... 2019లో కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండిపోయింది. దీంతో ఎప్పటిలాగే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో  మైనస్‌లు ఎక్కడా.. అనేది ఆలోచించి... దానికి తగ్గట్టుగా వర్క్‌ చేసి 2020 ఐపీఎల్‌లో  అడుగుపెట్టింది కోహ్లీ సేన. ఈసారి ప్లే ఆఫ్స్‌కు వచ్చి నాలుగో స్థానంలో ఉండిపోయింది. ఇప్పుడు ప్రజెంట్‌కి వస్తే... 2021 ఆద్యంతం మెరుగైన ప్రదర్శనే ఇస్తూ వచ్చింది. ఎలాంటి రన్‌రేట్ల గొడవ లేకుండా ప్లే ఆఫ్స్‌కి చేరిపోయింది.

ఐదింట నాలుగు విజయాలతో...

2021లో బెంగళూరు ఫామ్‌ చూసి... ఈసారి కప్‌ పక్కా అనుకున్నారంతా. ‘ఈ సాలా కప్‌ నమదే’ నినాదం నిజమవుతుందీ అని కూడా లెక్కలేసేశారు. మీమర్స్‌ కొత్త కాన్సెప్ట్‌లతో రెడీ అయిపోయారు. తీరా ప్లేఆఫ్స్‌ ఎలిమినేటర్‌లో బోల్తా పడ్డారు కోహ్లీ కుర్రాళ్లు. లీగ్‌ ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచింది అంటేనే... బెంగళూరు ఫామ్‌ ఎలా ఉందో చెప్పేయొచ్చు. ఈ ఫ్లోలో కోహ్లీ టీమ్‌... ఫైనల్స్‌కు పక్కా అని తేల్చేశారు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌... నైట్‌మేర్స్‌లా వచ్చి బెంగళూరు అభిమానుల కలను చిన్నాభిన్నం చేసేశారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో బెంగళూరు ఆట తీరు, ఎలిమినేటర్‌లో బెంగళూరు ఆట తీరు చూస్తే... దాదాపు ఒకేలా కనిపిస్తోంది. ఒకటి, రెండు మ్యాచ్‌ల్లో దారుణ ప్రదర్శనను వదిలేయొచ్చు. ఎందుకంటే వాటిని సమం చేస్తూ... వికెట్‌ నష్టోకుండా ఛేదించిన మ్యాచ్‌లూ ఉన్నాయి. బెంగళూరు ప్రదర్శనను ఇంకాస్త నిశితంగా పరిశీలిస్తే కొన్ని అంశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా బ్యాటింగ్‌లో  ‘ఆ నలుగురు’ కాన్సెప్ట్‌ రన్‌ అయ్యింది. అంటే దేవదత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌... సెకండాఫ్‌లో శ్రీకర్‌ భరత్‌ వారికి యాడ్‌ అయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ 513 పరుగులతో సిరీస్‌లో జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో పడిక్కల్‌ (411), కోహ్లీ (405) డివిలియర్స్‌ (313), భరత్‌ (191) ఉన్నారు. 

అదే తొలి కారణం...

ఈ నలుగురితోనే బెంగళూరు బండి ప్లే ఆఫ్స్‌ వరకూ వచ్చిందని చెప్పొచ్చు. మధ్యలో ఒకరిద్దరు అడినా... ఒక మ్యాచ్‌కే పరిమితమయ్యారు. కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఈ నలుగురిని కోల్‌కతా బౌలర్లు నిలువరించారు. నైట్‌రైడర్స్‌ విజయానికి ఇదే తొలి కారణం అని చెప్పొచ్చు. బెంగళూరు బ్యాటింగ్‌లో ఏబీ డివిలియర్స్‌ కీలకంగా నిలుస్తూ వచ్చాడు. గతేడాది ఈ మిస్టర్‌ 360 మెరుపులు ఇంకా కళ్ల ముందే కదలాడుతున్నాయి కూడా. ఈసారి 300కుపైగా పరుగులు చేసినా... కీలక మ్యాచ్‌ల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్‌ ఫేజ్‌ సిరీస్‌ దుబాయికి మారాక... ఏబీడీ జోరు అస్సలు కనిపించలేదనే చెప్పాలి. దీంతో బెంగళూరు బ్యాటింగ్‌ డెప్త్‌ తగ్గిపోయింది అనిపించింది.

ఏ జట్టు విజయానికైనా ఆల్‌రౌండర్లు ముఖ్యం అని క్రికెట్‌ పెద్దలు చెబుతూ ఉంటారు. ఆల్‌రౌండర్ల వల్ల బ్యాటింగ్‌ లోతు పెరుగుతుంది. ఐపీఎల్‌లో ఒక్కో టీమ్‌ ముగ్గురేసి ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగన సందర్బాలూ ఉన్నాయి. ఇక టీమిండియా కూర్పు విషయంలోనూ కోహ్లీ ఈ మాట ఒక్కోసారి సరిగా పట్టించుకోడు అనే అపవాదు ఉంది. ఆల్‌రౌండర్లుగా తీసుకున్నవాళ్లు ఏదో ఒక పనే చేస్తుంటారు. ఇప్పుడు ఆర్సీబీ విషయంలోనూ ఇదే జరిగింది. బెంగళూరు ఫైనల్‌ XIలో నాణ్యమైన ఆల్‌రౌండర్‌ కొరత కనిపించింది. సోమవారం మ్యాచ్‌లో ఓటమికి దానినీ ఓ కారణంగా చెప్పొచ్చు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ లాంటి ఆల్‌రౌండర్‌ ఉన్నాడు కదా... అని అనొచ్చు. అయితే సిరీస్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్స్‌వెల్‌ ఎక్కువ పరుగులు చేసినా, తీసింది మూడు వికెట్లే. దీంతో ఆ లోటు పోగై పోగై ఎలిమినేటర్‌లో దెబ్బకొట్టింది.

ఏదో ఒకటే చేస్తే ఎలా...

బెంగళూరు బౌలింగ్‌ను వేలెత్తి చూపడానికి లేదు. ఎందుకంటే ఎవరికి వారు, తమ పని చక్కగా చేసుకుంటూ వచ్చారు. ఈ టోర్నీలో పర్పల్‌ క్యాప్‌ విజేత హర్షల్‌ పటేల్‌ (32 వికెట్లు) బెంగళూరు సభ్యుడే. యుజ్వేంద్ర చాహల్‌ 18 వికెట్లతోను, మహ్మద్‌ సిరాజ్‌ 11 వికెట్లతోను రాణించారు. ఇక్కడ కూడా అదే పాత మాట వస్తుంది... అదే ఆల్‌రౌండర్‌. జట్టులో ఆల్‌రౌండర్‌గా వచ్చి తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన డేనియల్‌ క్రిస్టియన్‌ 9 మ్యాచ్‌లాడి కేవలం 4 వికెట్లే తీశాడు. ఇక మ్యాక్స్‌వెల్‌లాగా పరుగులైనా చేశాడా అంటే... అదీ లేదు. మొత్తంగా ఈ సిరీస్‌లో  కొట్టిన పరుగులు 14 మాత్రమే. వాషింగ్టన్‌ సుందర్‌ ఆడతాడేమో అనుకుంటే... గాయపడి సెకండాఫ్‌లో దూరమయ్యాడు. 

ఆఖరిగా... ఈ సారి కప్‌ సాధించి కెప్టెన్‌గా తన ఐపీఎల్‌ కెరీర్‌ను ముగిద్దాం అనుకున్న కోహ్లీకి... జట్టు కూర్పు దెబ్బకొట్టింది అని చెప్పొచ్చు. ఇదే కూర్పుతో గతంలో గెలిచినా... నైట్‌రైడర్స్‌ ఉచ్చులో ‘ఆల్‌రౌండర్‌’ లేక అయ్యో అనాల్సి వచ్చింది. ఆటలో కింగ్‌ అనిపించుకున్న కోహ్లీ... తమ జట్టుకు ట్రోఫీలు తేవడంలో మాత్రం ఆ స్థాయి చూపించలేదు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని