INDvsSL: పృథ్వీకి తగినన్ని అవకాశాలివ్వాలి

తాజా వార్తలు

Updated : 17/07/2021 18:29 IST

INDvsSL: పృథ్వీకి తగినన్ని అవకాశాలివ్వాలి

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షాకు తగినన్ని అవకాశాలివ్వాలని టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో ఆదివారం నుంచి జరగబోయే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ధావన్‌కు అతడే సరిజోడి అని అంచనా వేశారు. పృథ్వీ ఇంతకుముందే టీమ్‌ఇండియాకు ఆడాడన్నారు. అందుకే అతడు మరో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉందని చెప్పారు. కాగా, గతేడాది న్యూజిలాండ్‌ పర్యటనతో పాటు ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనూ ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో జట్టు యాజమాన్యం అతడిని పక్కనపెట్టింది. ఈ క్రమంలోనే తన తప్పులు సరిదిద్దుకున్న అతడు తర్వాత దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌లో అదరగొట్టాడు. దాంతో చివరికి శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలోనే పీటీఐతో మాట్లాడిన రామన్‌ పృథ్వీతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌పై స్పందించారు.

‘ఈ పర్యటనలో ధావన్‌ కచ్చితంగా ఓపెనింగ్‌ చేస్తాడని అనుకుంటున్నా. అందుకు రెండు కారణాలు. ఒకటి అతడు కెప్టెన్‌గా ఉండటం. రెండోది పృథ్వీషా మరో ఓపెనర్‌గా ఆడటం. ఈ యువ బ్యాట్స్‌మన్‌ ఇంతకుముందే టీమ్‌ఇండియాలో ఆడాడు. అతడు తిరిగి ఫామ్‌లోకి రావాలంటే తగినన్ని అవకాశాలివ్వాలి. ఎందుకంటే అతడెంతో నైపుణ్యం కలిగిన ఆటగాడు. జట్టులో పడిక్కల్‌, రుతురాజ్‌ లాంటి ఇతర యువకులు తమ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నా పృథ్వీనే మరో ఓపెనర్‌గా తీసుకోవాలి. ఆ స్థానంలో అతడేంటో నిరూపించుకున్నాడు. జట్టు కూడా ఇతరులను కాకుండా అతడినే ఎంపిక చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఇదే జరుగుతోంది. అనుభవజ్ఞులకే తొలి ప్రాధాన్యం ఇస్తారు’ అని రామన్‌ పేర్కొన్నారు.

అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌పై స్పందించిన రామన్‌‌.. 2014 ఐపీఎల్‌లోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)లో అతడిని తొలిసారి చూశానన్నారు. అప్పుడు తాను ఆ జట్టుతో పనిచేశానని, అదే సమయంలో సూర్యకుమార్‌ తొలిసారి ఐపీఎల్‌లో పాల్గొన్నాడని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచీ ఈ ముంబయి బ్యాట్స్‌మన్‌ బాగా మెరుగయ్యాడని చెప్పారు. మరోవైపు కొన్నేళ్లుగా అతడు బాగా రాణిస్తున్నా సరైనా గుర్తింపు రాలేదని, అలాంటి పరిస్థితుల్లోనూ నిరుత్సాహ పడకుండా అవకాశం కోసం ఎదురుచూశాడన్నారు. ఆ విషయంలో సూర్యని అభినందించాలని మెచ్చుకున్నారు. చివరగా రాహుల్‌ ద్రవిడ్‌పై స్పందించిన రామన్‌.. టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంతో అనుభవజ్ఞుడని, అతడి నేతృత్వంలో యువ ఆటగాళ్లు బాగా ఆడతారని పేర్కొన్నారు. ద్రవిడ్‌ ప్రశాంతమైన వ్యక్తి అని, అలాగే ఒక కోచ్‌కి ఉండే ఒత్తిడి ఆటగాళ్లపై రుద్దడని అన్నారు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపి సరైన ఫలితాలు రాబడతాడని రామన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని