
తాజా వార్తలు
అంపైర్ నిర్ణయాలతో అసహనం..!
ఇంగ్లాండ్ ఓపెనర్ క్రాలే
ఫొటో సోర్స్(బీసీసీఐ ట్విటర్)
ఇంటర్నెట్‌డెస్క్: మొతేరా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు (డే/నైట్)లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు భారత్‌కు అనుకూలంగా వెళ్లడం అసహనం తెప్పిస్తుందని ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలే అభిప్రాయపడ్డాడు. బుధవారం ప్రారంభమైన పింక్‌బాల్ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆట నిలిచిపోయే సమయానికి 99/3తో నిలిచింది. రోహిత్(57*), అజింక్య రహానె(1*) క్రీజులో ఉన్నారు. అంతకుముందు శుభ్‌మన్ గిల్(11), పుజారా(0), కోహ్లీ(27) ఔటయ్యారు. అయితే.. గిల్, రోహిత్ విషయాల్లో థర్డ్ అంపైర్ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా వచ్చాయని క్రాలే వ్యాఖ్యానించాడు.
తొలుత స్టువర్ట్‌బ్రాడ్ బౌలింగ్‌లో గిల్ ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ అందుకున్నప్పటికీ బంతి కొద్దిగా నేలకు తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ఇచ్చాడు. ఇక 31వ ఓవర్లో లీచ్ బౌలింగ్‌లో రోహిత్ స్టంపౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రెండు విషయాలపై ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో కాసేపు వాగ్వాదానికి దిగాడు. రోహిత్ విషయంలో మూడో అంపైర్ రీప్లేను అన్ని కోణాల్లో చూడలేదని, అలా చూసి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదన్నాడు. ఈ నేపథ్యంలోనే అసహనం వ్యక్తం చేసిన క్రాలే.. ఆ నిర్ణయాలు తమకు అనుకూలంగా రావాల్సిందని చెప్పాడు. అవి తమకెంతో విలువైనవని అభిప్రాయపడ్డాడు.
‘మేం ఆటలో వెనుకబడ్డాం. ఇలాంటి నిర్ణయాలు విసుగు తెప్పిస్తున్నాయి. ఇలా అటు-ఇటు ఉన్న ఫలితాలు మాకు అనుకూలంగా రావాల్సి ఉంది. కానీ, పరిస్థితులు చూస్తుంటే ఒక్కటి కూడా మాకు లాభించలేదు. కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి నిర్ణయాలు మాకు అనుకూలంగా రాకపోతే మేం మ్యాచ్ గెలవలేం. కానీ, అవి మా చేతుల్లో లేవు. రానున్న రోజుల్లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం’ అని ఇంగ్లాండ్ ఓపెనర్ వివరించాడు. అలాగే ఈ మ్యాచ్ గెలవడానికి తమకు అవకాశలున్నాయని, అది జరగాలంటే అద్భుతాలు జరగాల్సిన అవసరం లేదని చెప్పాడు. రెండోరోజు ఇంకాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి టీమ్ఇండియా లీడ్‌ను వీలైనంత తగ్గిస్తామని పేర్కొన్నాడు.