ప్రపంచకప్‌ గెలిచి పదమూడేళ్లు
Array ( ) 1

కథనాలు

Published : 24/09/2020 15:32 IST

ప్రపంచకప్‌ గెలిచి పదమూడేళ్లు

పాకిస్థాన్‌తో బౌలౌట్‌.. యువరాజ్‌ ఆరు సిక్సర్లు.. గంభీర్‌ వీరోచిత బ్యాటింగ్‌.. ఆఖర్లో శ్రీశాంత్‌ క్యాచ్‌.. కట్‌ చేస్తే.. ఓ అనామక కెప్టెన్‌ సారథ్యంలో.. కనీసం కోచ్‌ అయినా లేకుండానే బరిలోకి దిగిన జట్టు హేమాహేమీలను మట్టికరిపించి జగజ్జేతగా అవతరిచింది. అదే టీమ్‌ఇండియా. జులపాల ధోనీ నేతృత్వంలోని యువభారత్‌ 2007 టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడి నేటికి సరిగ్గా పదమూడేళ్లు.

ధోనీకి ఎంతో ప్రత్యేకం..

అనుభవం లేని ఆటగాళ్లు.. కోచ్‌ లేని జట్టు.. కెప్టెన్‌గా కొత్త బాధ్యతలు.. ఇలా అన్నింటినీ అధిగమిస్తూ మహేంద్ర సింగ్‌ ధోని జట్టును విజేతగా నిలబెడతాడని ఎవరూ కనీసం ఊహించి ఉండరు. అప్పటి నుంచి ధోని దశ తిరిగింది. నిజానికి బౌలౌట్‌ నుంచే ధోనీ ప్రయోగాల పర్వం మొదలైంది. పట్టిందల్లా బంగారమే అయ్యింది. భారత క్రికెట్‌ చరిత్రలోనే తనకంటూ చెరిగిపోని ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నాడు. అందుకే... ధోనీకి ఈ ప్రపంచకప్‌ ఎంతో ప్రత్యేకం.

యూవీ.. చెలరేగి..

ప్రపంచకప్‌కు కొన్నిరోజుల ముందే ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఘోరంగా సిరీస్‌ కోల్పోయింది. ఇక ఎవరైనా ఏమనుకుంటారు. ఇంగ్లాండ్‌ చేతిలో మరోసారి భారత్‌కు ఘోరపరాభవం తప్పదని నిర్ణయించుకున్నారు. కానీ, కాలం వేరే నిర్ణయం తీసుకుంది. బౌన్సీ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్‌ ఆడలేరన్న విమర్శలకు చెక్‌ పడింది. ఈ ప్రక్రియలో బలైంది ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌. అప్పటి తన బ్యాటింగ్‌ తాను చేసుకుంటున్న యువరాజ్‌ను రెచ్చగొట్టాడు ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌. అంతే చరిత్రలో ఓ చెరిగిపోని ఘట్టం ఆవిష్కృతమైంది. గంటకు 140 కిలోమీటర్ల వేగం తగ్గకుండా బంతులు విసిరే బ్రాడ్‌ బౌలింగ్‌లోనే యువరాజ్‌ సింగ్‌ సిక్సర్ల మోత మోగించాడు. వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు. క్రికెట్‌ ప్రపంచం యూవీ జపం చేసింది. ఇంగ్లీష్‌ జట్టుల వణుకు పుట్టింది.

భారత్‌ కప్పు కొట్టిందిలా.


 

టాస్‌ గెలిచిన ధోనీ పాకిస్థాన్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించాడు. యూసుఫ్‌ పఠాన్‌ 15 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్కడ నుంచి భారత బ్యాట్స్‌మెన్‌ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. గౌతం గంభీర్‌ 75 (54బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఆఖర్లో రోహిత్‌శర్మ 30 (16బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్సర్‌) మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్‌ గౌరవప్రదమైన లక్ష్యాన్ని పాకిస్థాన్‌ ముందు ఉంచింది. ఛేదనకు దిగిన పాకిస్థాన్‌ను ఆర్పీసింగ్‌ ఆదిలోనే దెబ్బకొట్టాడు. 2 పరుగుల వద్ద ఆ జట్టు ఓపెనర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ను ఔట్‌ చేశాడు. ఇమ్రాన్‌ నజీర్‌, యూనిస్‌ఖాన్‌లు ఆ జట్టును లక్ష్యం వైపుగా నడిపించారు. కీలక సమయంలో వాళ్లు కూడా పెవిలియన్‌ చేరారు. దీంతో జట్టు బాధ్యతలను భుజాల మీదు వేసుకున్నాడు మిస్బా ఉల్‌ హక్‌... ఆఖరి ఓవర్లో పాకిస్థాన్‌కు కావాల్సింది 13 పరుగులు.. భారత్‌కు కావాల్సింది ఒక వికెట్‌. తొలి బంతి వైడ్‌.. రెండో బంతి డాట్‌.. తర్వాతి బంతి సిక్సర్‌.. నాలుగు బంతుల్లో 6 పరుగులు కావాలి. ఇంకేముంది భారత్‌ పని అయిపోయిందనుకున్నారంతా.. కానీ ‘క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌’ అంటారు కదా.. అదే జరిగింది. మూడో బంతికి మిస్బా ఆడిన స్కూప్‌ షాట్‌కు బంతి నేరుగా వెళ్లి ఫైన్‌లెగ్‌లో ఉన్న శ్రీశాంత్‌ చేతిలో పడింది. పాకిస్థాన్‌ వైపు ఉన్న మ్యాచ్‌ను ఇండియా లాగేసుకుంది. అంతే భారత్‌ జగజ్జేతగా మారింది. సౌతాఫ్రికాలో త్రివర్ణపతాకం రెపరెపలాడింది. ఆ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులకే 3 వికెట్లు తీసిన ఇర్ఫాన్‌ పఠాన్‌ భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. పఠాన్‌కు తోడుగా ఆర్పీ సింగ్‌ 3, జోగిందర్‌ శర్మ 2 వికెట్లు తీసి పాకిస్థాన్‌ నడ్డి విరిచారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన