ప్చ్‌...హీరోలు జీరోలయ్యారే!!
Array ( ) 1

కథనాలు

Updated : 08/11/2020 16:26 IST

ప్చ్‌...హీరోలు జీరోలయ్యారే!!

భారీ ధరకు పలికి విఫలమైన ఆటగాళ్లు

మన అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే ఎక్కడో తెలియని సందడి, సంతోషం మొదలవుతుంటుంది. అదే సినిమాకి ఉత్తమ దర్శకుడు పనిచేసి, భారీ బడ్జెట్‌లో రూపొందిస్తే.. దానిపై అంచనాలకు అవధులు ఉండవు. అదే తరహాలో.. ఒంటిచేత్తో జట్టును గెలిపించే మ్యాచ్‌ విన్నర్లను లీగ్‌లోని జట్లు భారీమొత్తంలో వెచ్చించి మరీ సొంతం చేసుకుంటుంటాయి. దీంతో రికార్డు విజయాలు, కళ్లుచెదిరే సిక్సర్లు, అబ్బురపరిచే యార్కర్లు ఉంటాయని అభిమానులు ఆశిస్తుంటారు. కానీ, ఈ సీజన్‌లో సీన్‌ రివర్స్‌ అయింది. భారీ ధర పలికిన ఆటగాళ్లు పేలవ ప్రదర్శన చేస్తున్నారు. వాళ్ల స్టార్‌డమ్‌కు తగ్గట్లుగా మెరుపు ఇన్నింగ్స్‌లు, వికెట్లు ఎగిరిపడే బంతులు లేవు. ఈ సీజన్‌లో ఇలా నిరాశపర్చిన ఆటగాళ్ల గురించి చూద్దామా..!

ఒక్క సిక్సర్‌ కూడా బాదని మాక్స్‌వెల్‌
అలవోకగా సిక్సర్లు బాదడం, చురుకైన ఫీల్డింగ్‌, అవసరమైతే బంతితోనూ మాయ చేసే సత్తా.. ఇవన్నీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్‌ సొంతం. అందుకే వేలంలో అతడ్ని పంజాబ్‌ రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ, అతడు ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 15 సగటుతో 108 పరుగులే చేశాడు. అత్యుత్తమ స్కోరు 32. టోర్నీలో అతడు ఒక్క సిక్సర్‌ కూడా బాదకపోవడం గమనార్హం. ఇక స్పిన్నర్‌గానూ అతడు తేలిపోయాడు. మూడు వికెట్లే తీశాడు.

నిరాశపరిచిన కాట్రెల్‌

పాపం.. పంజాబ్‌! భారీ మొత్తంలో వెచ్చించి జట్టులోకి తీసుకున్న మరో ఆటగాడు కూడా ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. వెస్టిండీస్‌ పేసర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ను పంజాబ్‌ రూ.8.5 కోట్లకు దక్కించుకుంది. చక్కని లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించడం, పవర్‌ప్లేలోనే వికెట్లు సాధించడం అతడి ప్రత్యేకత. కానీ, ఈ సీజన్‌లో అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఎక్కువ పరుగులు ఇస్తుండటంతో యాజమాన్యం అతడ్ని బెంచ్‌కే పరిమితం చేసింది. రాజస్థాన్‌ మ్యాచ్‌లో కాట్రెల్‌ వేసిన ఓవర్‌లో ఆల్‌రౌండర్‌ రాహుల్ తెవాతియా అయిదు సిక్సర్లు బాదిన విషయం తెలిసిందే. ఆరు మ్యాచ్‌లు ఆడిన కాట్రెల్‌ ఆరు వికెట్లు సాధించాడు. లీగ్‌లో అతడికి ఇదే తొలి సీజన్‌.

మ్యాచ్‌ విన్నర్‌గా నిలవలేదు

ఆస్ట్రేలియా పేసర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ను వేలంలో ముంబయి రూ.8 కోట్లకు సొంతం చేసుకుంది. వైవిధ్యంతో బంతులు వేసే కౌల్టర్‌నైల్‌ రాకతో ముంబయి జట్టులో మరో మ్యాచ్‌ విన్నర్‌ చేరాడని విశ్లేషకులు భావించారు. కానీ, అతడు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయాడు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లే సాధించి నిరాశపరిచాడు. ఫైనల్లో అయినా అతడు తన సత్తా చూపిస్తాడో లేదో చూడాలి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.

మెరవని హిట్టర్‌..

వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌ షిమ్రాన్‌ హెట్‌మైయర్‌ను దిల్లీ రూ.7.75 కోట్లకు తీసుకుంది. యువ దిల్లీలో మరో యువ హిట్టర్‌ చేరడంతో బ్యాటింగ్‌ విభాగం దుర్భేద్యంగా మారుతుందని భావించారంతా. కానీ, హెట్‌మైయిర్‌ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. 10 మ్యాచ్‌ల్లో 19 సగటుతో 138 పరుగులే చేశాడు. వరుసగా విఫలమవ్వడంతో తుదిజట్టులో అతడు చోటు కోల్పోయాడు. కానీ, తనదైన రోజున విధ్వంసం సృష్టించే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ క్వాలిఫయిర్‌-2లో తుదిజట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విఫలమైన చావ్లా

టీ20ల్లో లెగ్‌ స్పిన్నర్ల పాత్ర ఎంతో కీలకం. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టిస్తూ జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకే అనుభవజ్ఞుడైన పీయూష్‌ చావ్లాను చెన్నై రూ. 6.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. కానీ చావ్లా ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. యూఏఈ పిచ్‌లపై ఇతర జట్ల స్పిన్నర్లు ప్రభావం చూపిస్తుంటే చావ్లా మాత్రం సత్తాచాటలేకపోయాడు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లే తీశాడు. పొదుపుగానూ బౌలింగ్ చేయలేకపోయాడు.

తేలిపోయిన జాదవ్‌ - బ్రావో

మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్ కేదార్‌ జాదవ్‌ను 2018లో చెన్నై రూ.7.8 కోట్లతో సొంతం చేసుకుంది. అప్పటినుంచి అతడిని జట్టులో కొనసాగిస్తోంది. దూకుడుగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందివ్వడంలో అతడు సిద్ధహస్తుడు. కానీ, ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. కోల్‌కతాపై టెస్టు తరహాలో ఆడి భారీఎత్తున విమర్శలు ఎదుర్కొన్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 62 పరుగులే చేశాడు. టోర్నీలో ఒక్క సిక్సర్‌ కూడా సాధించకపోవడం గమనార్హం. చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో సైతం ఈ సీజన్‌లో నిరాశపరిచాడు. 6 మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు, ఏడు పరుగులు చేశాడు. అతడికి చెన్నై రూ. 6.4 కోట్లు చెల్లించింది.

మునపటి రసెల్‌ కాదు

విధ్యంసకర బ్యాట్స్‌మన్ రసెల్‌ను 2018లో కోల్‌కతా రూ.7 కోట్లకు సొంతం చేసుకుంది. 2019 సీజన్‌లో ప్రత్యర్థులపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన అతడు ఈ సీజన్‌లో తేలిపోయాడు. అతడి స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్కటి కూడా చేయలేదు. కొన్ని మ్యాచ్‌లకు అతడిని బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన రసెల్‌ 117 పరుగులు, ఆరు వికెట్లు తీశాడు. సునీల్ నరైన్‌, దినేశ్ కార్తీక్‌ది కూడా ఇదే పరిస్థితి. 10 మ్యాచ్‌ల్లో నరైన్‌ 121 పరుగులు, 5 వికెట్లతో నిరాశపరిచాడు. దినేశ్‌ కార్తీక్ 14 మ్యాచ్‌ల్లో 169 పరుగులే చేశాడు. కోల్‌కతా నరైన్‌కు రూ.8.5 కోట్లు, దినేశ్‌ కార్తీక్‌కు రూ.7.4 కోట్లు చెల్లిస్తోంది. జట్టు కోసం, బ్యాటింగ్‌లో మెరుగవ్వడం కోసం ఈ సీజన్‌లో కార్తీక్‌ కెప్టెన్సీని విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.

- ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన