అడిలైడ్‌లో గులాబి వేట.. విజయానికి బాట 
Array ( ) 1

కథనాలు

Updated : 16/12/2020 17:09 IST

అడిలైడ్‌లో గులాబి వేట.. విజయానికి బాట 

వాల్‌, నయావాల్‌ వల్లే టీమ్‌ఇండియాకు విజయాలు

అరె.. ఏం ఆడార్రా బాబూ..! అనిపించే హోరాహోరీ మ్యాచులకు ఆతిథ్యమిచ్చింది అడిలైడ్‌ ఓవల్‌. సుదూరంగా కనిపించే కొండలు.. సమీపంలో ఆకుపచ్చని తోటలు.. చక్కని పచ్చిక బయళ్లు.. అభిమానులు ఇష్టపడే మరెన్నో సౌకర్యాలు ఈ మైదానం సొంతం. ఆస్ట్రేలియాలోని పురాతన మైదానాల్లో ఒకటైన అడిలైడ్లో టీమ్‌ఇండియాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అవమానాలూ ఉన్నాయనుకోండీ! తిరుగులేని ఆధిపత్యం కనబరిచే ఆతిథ్య జట్టుతో సవాళ్లు విసిరే గులాబి పోరులో కోహ్లీసేన ఇక్కడే తలపడుతోంది. ఈ సందర్భంగా అడిలైడ్‌ విశేషాలు మీ కోసం.


డ్రాప్‌ఇన్‌ పిచ్‌తో మార్పు‌

ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమ్‌ఇండియా తన తొలి టెస్టును అడిలైడ్‌ ఓవల్‌లోనే ఆడబోతోంది. సాధారణంగానే ఆస్ట్రేలియాతో పోరంటే ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ఈసారి డే/నైట్‌ కావడం.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతితో జరుగుతుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందులోనూ ఈ ఏడాది ఆశించినంత క్రికెట్‌ మజా దొరక్కపోవడం మరో కారణం. ఇక మైదానం విషయానికొస్తే అడిలైడ్‌కు ఎంతో చరిత్ర ఉంది. పిచ్‌ ఫ్లాట్‌గా ఉండటంతో బ్యాట్స్‌మెన్‌ పరుగుల పండగ చేసుకొనేవారు. బౌలర్లకు సహకారం తక్కువే. మూడోరోజు తర్వాత స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. 2013 నుంచి డ్రాప్‌ఇన్‌ పిచ్‌లు వాడుతుండటంతో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. దాదాపు 50వేల మంది అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించొచ్చు.


రికార్డు 2-7-3‌

అడిలైడ్‌లో 1884లో తొలిమ్యాచ్‌ జరిగింది. ఇప్పటి వరకు 78 టెస్టులకు వేదికగా నిలిచింది. ఇక్కడ ఆతిథ్య జట్టు 41 (52.56%) విజయాలు సాధిస్తే పర్యాటక జట్లు 18 (23.08%) మ్యాచుల్లో గెలిచాయి. 19 (24.36%) మ్యాచులు డ్రాగా ముగిశాయి. భారత్‌ ఇక్కడ 12 మ్యాచుల్లో తలపడగా 2 గెలిచి 7 ఓడింది. 3 డ్రా చేసుకుంది. 1948 నుంచి పోరాడుతుంటే 2003లో తొలిసారి టీమ్‌ఇండియాను విజయం వరించింది. నిజానికి ఈ పర్యటన చిరస్మరణీయం. రాహుల్‌ ద్రవిడ్‌ అద్భుతాలు చేయడంతో సిరీస్‌ 1-1తో సమమైంది. అడిలైడ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో‌ 556కు ఆలౌటైంది. రికీ పాంటింగ్‌ (242) ద్విశతకం దంచేశాడు. అయితే రాహుల్‌ ద్రవిడ్‌ (233), వీవీఎస్‌ లక్ష్మణ్‌ (148) పోరాడటంతో భారత్‌ 523 పరుగులు చేసింది. ఆ తర్వాత సచిన్‌ (2)తో  కలిసి అజిత్ అగార్కర్‌ (6/41) చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 196కే కుప్పకూలింది. వీరేంద్ర సెహ్వాగ్‌ (47), ద్రవిడ్‌ (72*) సమయోచిత బ్యాటింగ్‌తో‌ భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయకేతనం ఎగరేసింది.


వాల్‌ గెలుపు

గత పర్యటనలో టీమ్‌ఇండియా ఆసీస్‌ను ఓడించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు బీజం పడింది అడిలైడ్‌లోనే. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ పోరులో బౌలర్లు తమ సత్తా ఏంటో చూపించారు. చెతేశ్వర్‌ పుజారా (123) అద్భుత బ్యాటింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 250కి ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలమైన దశలో అతడు ఆడినతీరు విమర్శకులను మెప్పించింది. ట్రావిస్‌హెడ్ (72) పోరాడినా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ సైతం 235కే ముగిసింది. పుజారా (71), రహానె (70), కేఎల్‌ రాహుల్‌ (44) రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా‌ 307 పరుగులు చేసింది. ఆ తర్వాత షమి, అశ్విన్‌, బుమ్రా తలో 3 వికెట్ల చెలరేగడంతో ఆసీస్‌ 291కే ఆలౌటైంది. షాన్‌ మార్ష్‌ (60) మాత్రమే అర్ధశతకం చేశాడు. భారత్ ‌31 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. ఆ తర్వాత ఈ సిరీసులో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.


నయావాల్‌ కొనసాగింపు

అడిలైడ్‌లో మొత్తం 78 మ్యాచులు జరిగినా విజయవంతంగా లక్ష్యాలను ఛేదించింది కేవలం 11 సార్లు. 31 సార్లు జట్లు విఫలమయ్యాయి. 15 సార్లు డ్రా చేసుకున్నాయి.  టీమ్‌ఇండియా ఇక్కడ 8 సార్లు ఛేదనకు దిగగా 6 సార్లు విఫలమైంది. 1981లో ఒకసారి 331 లక్ష్య ఛేదనకు దిగి 135/8తో డ్రా చేసుకుంది. 2003లో 230 పరుగుల లక్ష్యాన్ని తొలిసారి ఛేదించింది. ఈ మైదానంలో డేవిడ్‌ వార్నర్‌ (335*)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక మొత్తంగా 1,045 పరుగులతో ఈ తరంలో అతడే టాప్‌ స్కోరర్‌. విరాట్‌కోహ్లీ 3 మ్యాచులాడి 71.83 సగటు, 57.16 స్ట్రైక్‌రేట్‌తో 431 పరుగులు చేశాడు. ఆరు ఇన్నింగ్సుల్లో అతడు 3 శతకాలు చేయడం గమనార్హం. పుజారా రెండు మ్యాచుల్లో 72 సగటుతో 288 పరుగులు సాధించాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ లైయన్‌ ఇక్కడ 9 మ్యాచుల్లో 50 వికెట్లు తీయడం గమనార్హం. అశ్విన్‌ 2 మ్యాచుల్లో 11, షమి 2 మ్యాచుల్లో 8, బుమ్రా 1 మ్యాచులో 6 ఈ తరం బౌలర్లలో టాప్‌-10లో ఉన్నారు.


అందరూ రాణిస్తేనే..

పై విశ్లేషణను బట్టి గులాబి టెస్టులో టీమ్‌ఇండియా గెలుపు తలుపులు తట్టాలంటే సారథి విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె, నయా వాల్‌ చెతేశ్వర్‌ పుజారా ముగ్గురూ  రాణించడం అత్యంత అవసరం. మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ చక్కని శుభారంభం అందించాల్సి ఉంటుంది. ఓపెనింగ్‌ జోడీ 20-30 ఓవర్ల వరకు నిలిచిందంటే భారీ స్కోరుకు బాటలు పడతాయి. గత పర్యటనలో ఓపెనర్లు విఫలమవ్వడంతో పుజారా తన భుజస్కంధాలపై మ్యాచును మోశాడు. ఆసీస్‌ బౌలర్లు విసిరే చురకత్తుల్లాంటి బంతుల్ని సాధికారికంగా ఎదుర్కొన్నాడు. నిజానికి అతడి స్ట్రైక్‌రేట్‌ తక్కువని అంతకుముందు సిరీసుల్లో విమర్శలు వచ్చాయి. కానీ ఇక్కడ అదే స్ట్రైక్‌రేట్‌ కోహ్లీసేనను రక్షించింది. భారత బ్యాటింగ్‌ లైనప్‌లో కనీసం ఇద్దరు శతకాలు చేస్తే విజయావకాశాలు మెండుగా ఉంటాయి. మిడిలార్డర్లో హనుమ విహారి ఉండటం లాభదాయకం. ఇక బుమ్రా, షమి ప్రత్యర్థిపై దాడికి దిగడం అవసరం. గతంలోనూ వారే ఇక్కడ ప్రభావం చూపించారు. అశ్విన్‌ సైతం వీరికి అండగా నిలవగలడు. యువ బౌలర్లను ఆసీస్‌ ఆటగాళ్లు లక్ష్యంగా ఎంచుకోకుండా వీరు మార్గనిర్దేశం చేయాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన