రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్
Array ( ) 1

కథనాలు

Published : 28/12/2020 10:48 IST

రాహులో రాహులా.. 2020 సూపర్‌ హిట్

కోహ్లీ, రోహిత్‌ను వెనక్కి నెట్టిన ఫీనిక్స్‌!‌

కేఎల్‌ రాహుల్‌.. ది ఫీనిక్స్‌ ఆఫ్ ఇండియన్‌ క్రికెట్‌! సొగసు ఉట్టిపడే క్రికెటింగ్‌ షాట్లు.. చూడచక్కని శరీర సౌష్టవం.. విరాట్‌ కోహ్లీకి దీటైన టెక్నిక్‌ అతడి సొంతం. అనతి కాలంలోనే శిఖరాగ్రానికి చేరుకొని ఆపై  నిలకడ లేమితో జట్టులో చోటు కోల్పోయాడు. విరామంలో మానసిక బలం పెంచుకొని పునరాగమనంలో సత్తాచాటి జట్టు యాజమాన్యానికి తననిక పక్కనపెట్టకుండా గట్టిసందేశం ఇచ్చాడు. కరోనాతో అంతగా క్రికెట్‌ జరగలేదు గానీ జనవరిలో ఉన్న దూకుడుతో 2020లో అతడెన్ని రికార్డులు బద్దలుకొట్టేవాడో!


పరుగుల మొనగాడు

ఈ ఏడాది జరిగిందే అతి తక్కువ క్రికెట్‌. అందులోనూ అందరికన్నా మిన్నగా ఆడాడు రాహుల్‌. 2020లో టీమ్‌ఇండియా తరఫున వన్డే, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసింది ఈ కర్ణాటక ఆటగాడే. సాధారణంగా పరుగుల వీరుల జాబితాలో తొలి రెండు స్థానాలకు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌శర్మ పోటీపడతారు. మూడేళ్లుగా ఇదే తంతు. అలాంటిది కేఎల్‌ ఈసారి వీరిద్దరినీ వెనక్కి నెట్టాడు. ఈ సంవత్సరంలో మొత్తం 20 అంతర్జాతీయ మ్యాచులాడిన అతడు 49.82 సగటు, 120.31 స్ట్రైక్‌రేట్‌తో 847 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, ఏడు అర్ధశతకాలు ఉన్నాయి. ఇవన్నీ వన్డే, టీ20లే కావడం గమనార్హం. అదే విరాట్ కోహ్లీ 22 మ్యాచులాడి 36.60 సగటు, 87.89 స్ట్రైక్‌రేట్‌తో 842 పరుగులే చేశాడు. మూడు టెస్టులూ ఆడాడు. ఇక రోహిత్‌ శర్మ ఈ ఏడాది 7 మ్యాచులాడి 51.83 సగటు, 111.07 స్ట్రైక్‌రేట్‌తో 311 పరుగులు చేశాడు. గాయాల కారణంగా ఈసారి అతడెక్కువ మ్యాచులు ఆడలేకపోయాడు. ఇక కీపర్‌గా రాహుల్‌ మెరుపులు మరిచిపోలేం!


కోహ్లీ వెనక్కి

పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియాకు శాశ్వత ఆటగాడిగా మారిపోయాడు కేఎల్‌ రాహుల్‌. అస్థిరత్వంతో ఆత్మవిశ్వాస లేమితో జట్టులో చోటు కోల్పోయిన అతడు విరామంలో ఎంతో సాధన చేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ఆధ్వర్యంలో మానసిక దృఢత్వం పెంచుకున్నాడు. తన వ్యక్తిత్వాన్ని హరించే, ఆటకు సంబంధం లేని విషయాలను పక్కనపెట్టాడు. ఒక బంతిని ఆడేందుకు వేర్వేరు షాట్లు ప్రయత్నించాలన్న తపనలో పడి గతంలో అతడు గందరగోళానికి గురయ్యేవాడు. టెస్టుల్లో టీ20 తరహా ఆధునిక షాట్లతో త్వరగా ఔటై విమర్శల పాలయ్యాడు. ఇప్పుడా గందరగోళం నుంచి బయటపడ్డాడు. పక్కాగా ఎంచుకున్న షాట్‌నే ఆడుతున్నాడు. నిలకడకు మరోపేరుగా మారాడు. పెరిగిన అతడి సగటే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది 9 వన్డేలాడిన రాహుల్‌ 55.37 సగటు, 106.23 స్ట్రైక్‌రేట్‌తో 443 పరుగులు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. 431తో కోహ్లీ అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. టీ20ల్లో అయితే మహ్మద్‌ హఫీజ్‌ (415) తర్వాత టాప్-2లో నిలిచాడు. 11 మ్యాచుల్లో 44.88 సగటు, 140.76 స్ట్రైక్‌రేట్‌తో 404 పరుగులు చేశాడు. 4 అర్ధశతకాలు బాదాడు. విరాట్‌ (295 పరుగులు) ఏడో స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం.


ఆ ఇన్నింగ్స్‌లు అద్భుతః

ఈ ఏడాది రాహుల్‌ ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు ముచ్చటగొలిపాయి. ఫిబ్రవరిలో మౌంట్‌మాంగనూయ్‌ వేదికగా జరిగిన మూడో వన్డేలో రాహుల్‌ బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐదో స్థానంలో దిగి శతకం బాదేశాడు. 113 బంతుల్లో 9 బౌండరీలు, 2 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. ఇందుకోసం అతడు 150 నిమిషాలు క్రీజులోనే గడిపాడు. 62/3తో ఉన్న స్కోరును శ్రేయస్‌ (62), మనీశ్‌ పాండే (42) సహకారంతో తను ఔటయ్యే సమయానికి 269/5కు తీసుకెళ్లాడు. సౌథీ, నీషమ్‌, బెన్నెట్‌ బంతుల్ని ఎదుర్కొన్న తీరు అద్భుతం. ఇదే సిరీసులో మొదటి వన్డేలో 5వ స్థానంలో 64 బంతుల్లో చేసిన 88* పరుగుల ఇన్నింగ్సూ అలాంటిదే. అయ్యర్‌ (103), కోహ్లీ (51) దూకుడుగా ఆడటంతో భారత జోరుమీదుంది. ఇదే అదనుగా రాహుల్‌ రెచ్చిపోయి ఆడాడు. 6 సిక్సర్లు, 3 బౌండరీలు దంచాడు. స్కోరును 347/4కు తీసుకెళ్లాడు. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలోనూ కోహ్లీ (89)కి అండగా 66 బంతుల్లో 76 చేసిందీ రాహుల్‌ ఒక్కడే. ఇక ఐదో స్థానంలో ఈ సారి అతడు రెచ్చిపోవడం గమనార్హం. 80, 88*, 4, 112, 12, 76, 5తో రాణించాడు. మరింత క్రికెట్‌ జరిగుంటే ఈ సారి ఇలాంటి ఇన్నింగ్సులు మరిన్ని చూసేవాళ్లమేమో!


ఐపీఎల్‌లో దంచుకొట్టుడు

లాక్‌డౌన్లో ఇంటికే పరిమితమైన రాహుల్‌ తొలిసారి బ్యాటు పట్టుకోగానే భయపడ్డాడు. తాను మునుపట్లా బ్యాటింగ్‌ చేయగలనా లేదా అని కంగారూపడ్డాడు. రెండుమూడు సార్లు నిద్రలోనూ పీడకలలు కని ఉలిక్కిపడి లేచాడు. కానీ అదే రాహుల్‌ ఐపీఎల్‌ తాజా సీజన్లోనూ ఆరెంజ్‌ క్యాప్‌ ఎగరేసుకుపోయాడు. 14 మ్యాచుల్లో 55.83 సగటు, 129.34 స్ట్రైక్‌రేట్‌తో 670 పరుగులు సాధించాడు. ఒక శతకం, 5 అర్ధశతకాలు బాదేశాడు. 17 మ్యాచులాడి 618 పరుగులు చేసిన శిఖర్‌ధావన్‌ అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడంటేనే రాహుల్‌ ఆటను అర్థం చేసుకోవచ్చు. నిజానికి తనదైన దూకుడుతో రెచ్చిపోతే అతడింకా ఎక్కువ పరుగులే చేయగలడు. కానీ క్రీజులోకి వచ్చామంటే ఇన్నింగ్స్‌ ఆఖరి బంతి వరకు ఆడితీరాలన్న జట్టు యాజమాన్యం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాడు. బెంగళూరుపై 132, 61 చేసినప్పుడు అజేయంగా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన సారథి, భారతీయ బ్యాట్స్‌మన్‌గానూ రికార్డులు సృష్టించాడు. సారథ్యపరంగానూ రాహుల్‌ ఆకట్టుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న మూమెంట్స్‌ను చేజిక్కించుకోవడంలో విఫలమైనా తర్వాత వరుసగా ఐదు మ్యాచులు గెలిచి ఆశ్చర్యపరిచాడు. తర్వాతి సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచాడు. వచ్చే ఏడాదీ అతడిలాగే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన