ఐపీఎల్‌లో మెరిశారు..మరి ఆసీస్‌పై? 
Array ( ) 1

కథనాలు

Updated : 24/11/2020 14:58 IST

ఐపీఎల్‌లో మెరిశారు..మరి ఆసీస్‌పై?  

ధావన్‌, మయాంక్‌, మనీశ్‌, సంజూ ఏం చేస్తారో చూడాలి!

 గాడి తప్పిన ఫామ్‌.. అంచనాలను అందుకోలేక వైఫల్యం.. వెరసి టీమ్‌ఇండియాలో స్థానం ప్రశ్నార్థకం. ఇదీ ఐపీఎల్‌-13కు ముందు కొంతమంది భారత క్రికెటర్ల పరిస్థితి. మళ్లీ జాతీయ జట్టులోకి వస్తామా? అసలు అవకాశం దక్కుతుందా? అనే భయాలు ఓ వైపు.. ఐపీఎల్‌లో సత్తాచాటి తిరిగి టీమ్‌ఇండియా జెర్సీ ధరిద్దామనే ఆశ మరో వైపు.. ఇలా ఆ సీజన్‌లో బరిలో దిగిన ఆ ఆటగాళ్లు గొప్పగా రాణించారు. తమ ప్రదర్శనతో సెలక్టర్లను మెప్పించి ఆస్ట్రేలియా విమానమెక్కారు. కంగారూ గడ్డపై వీళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తారో తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే! మరి ఆ ఆటగాళ్లు ఎవరో చూసేద్దాం పదండి!

ధనాధన్‌ మళ్లీ..

రోహిత్‌ శర్మతో కలిసి పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమ్‌ఇండియా విజయాల్లో కీలకంగా మారిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు ఐపీఎల్‌కు ముందు నిలకడ లేమి సమస్యగా మారింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయం కారణంగా మొత్తం టోర్నీ నుంచే తప్పుకున్న అతను.. తిరిగి వెస్టిండీస్‌ సిరీస్‌తో జట్టులోకి వచ్చినప్పటికీ రాణించలేకపోయాడు. ఓ వైపు గాయాలు.. మరోవైపు అతని స్థానంలో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ పాతుకుపోవడంతో ధావన్‌కు జట్టులో చోటే ప్రశ్నార్థకమైంది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన అతను మునుపటిలా చెలరేగి.. వరుసగా రెండు శతకాలు చేసి లీగ్‌ చర్రితలో ఆ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా దిల్లీ క్యాపిటల్స్‌ తరపున 17 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపికైన అతను.. కంగారూ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. 
కొత్త కోణం చూపించి..

గత ఆస్ట్రేలియా సిరీస్‌ (2018-19)లో ఓపెనర్‌ పృథ్వీ షా గాయంతో దూరమవడంతో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్‌ అగర్వాల్‌.. ఆ తర్వాత నిలకడగా రాణిస్తూ సుదీర్ఘ ఫార్మాట్లో ఓపెనర్‌గా స్థిరపడ్డాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం అతనికి ఎక్కువ అవకాశాలు దక్కలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌లో రెండు వన్డేలు ఆడినప్పటికీ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతను పుజారా లాగా కేవలం టెస్టులకే పరిమితమవుతాడా? అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఐపీఎల్‌-13 తర్వాత అతని ఆటపై ఉన్న అభిప్రాయాలు మారిపోయాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే దిల్లీపై 60 బంతుల్లోనే 89 పరుగులు చేసి తనలోని విధ్వంసక కోణాన్ని బయటపెట్టాడు. అదే దూకుడు కొనసాగించిన అతను.. మధ్యలో గాయంతో అందుబాటులో లేనప్పటికీ.. మొత్తంగా 11 మ్యాచ్‌ల్లో 424 పరుగులతో సీజన్‌ను ముగించాడు. పంజాబ్‌ తరపున ఈ ధనాధన్‌ బ్యాటింగ్‌తోనే ఆస్ట్రేలియా పర్యటనకు అన్ని జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. అతను ఇదే జోరు కొనసాగిస్తే మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశముంది. 
ఎప్పటి నుంచో ఆడుతున్నా..

అయిదేళ్ల క్రితమే పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అరంగేట్రం చేసిన మనీశ్‌ పాండే కెరీర్‌ పడుతూ లేస్తూ సాగుతోంది. ప్రతిభావంతుడైన క్రికెటర్‌గా జట్టులో అడుగుపెట్టిన అతను అంచనాలను అందుకోవడంలో విఫలమవుతున్నాడు. ఓ మ్యాచ్‌లో రాణించి అబ్బురపరచడం.. మరో మ్యాచ్‌లో విఫలమై నిరాశపరచడం.. ఇలా అతని బ్యాటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 26 వన్డేల్లో 492 పరుగులు చేసిన అతను ఒక్క శతకం మాత్రమే నమోదు చేశాడు. మరోవైపు 38 టీ20ల్లో 707 పరుగులు చేశాడు. పొట్టి ఫార్మాట్లో అతని రికార్డు మెరుగ్గానే ఉన్నప్పటికీ.. జట్టులో పోటీ కోసం కుర్రాళ్లు పోటీపడుతున్న తరుణంలో మనీశ్‌ ఈ ఐపీఎల్‌లో కానీ రాణించకపోయి ఉంటే కచ్చితంగా టీమ్‌ఇండియాకు దూరమయ్యేవాడే. కానీ సన్‌రైజర్స్‌ తరపున 16 మ్యాచ్‌ల్లో 425 పరుగులు చేసి తనలో పరుగులు చేసే సామర్థ్యం ఉందని చాటిచెప్పి.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. 
ప్రతిభ ఉన్నా..

సంజూ శాంసన్‌ మంచి ప్రతిభావంతుడైన ఆటగాడు.. అతనికి తుది జట్టులో చోటు ఇవ్వాల్సిందేననే వ్యాఖ్యలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ అతను అందివచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 2014 ఐపీఎల్‌లో అదిరే ప్రదర్శనతో 2015లోనే టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పటివరకూ కేవలం నాలుగు టీ20లు మాత్రమే ఆడి 35 పరుగులు మాత్రమే చేశాడు. అతనిలో నైపుణ్యాలకు కొదవ లేనప్పటికీ టీమ్‌ఇండియాలో విపరీతమైన పోటీ, ఆడిన మ్యాచ్‌ల్లో విఫలమవడం అతణ్ని వెనక్కునెట్టింది. ఈ నేపథ్యంలో.. ధోని రిటైర్మెంట్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌ కీపింగ్‌ స్థానాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అడుగుపెట్టిన అతను తొలి మ్యాచ్‌ నుంచే బాదుడు మొదలెట్టాడు. 14 మ్యాచ్‌ల్లో 375 పరుగులు చేసిన ఈ రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు.. పరిమిత ఓవర్ల జట్లకు ఎంపికై ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. మరోవైపు 21 ఏళ్ల శుభ్‌మన్‌ గిల్‌ కూడా ఈ కోవలోకే వస్తాడు. అండర్‌-19 ప్రపంచకప్, ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో ప్రదర్శనతో టీమ్‌ఇండియా భవిష్యత్‌ ఆశాకిరణంలా కనిపించిన అతను.. నిరుడు న్యూజిలాండ్‌తో రెండు వన్డేల్లో అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఈ ఐపీఎల్‌లో కోల్‌కతా తరపున పరిణతితో కూడిన ఆటతీరును ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 440 పరుగులు చేసి మరోసారి టీమ్‌ఇండియా తలుపు తట్టాడు. వన్డే, టెస్టు జట్లలో చోటు దక్కించుకున్నాడు. మరి ఈసారి అతనెలా రాణిస్తాడో చూడాలి.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన