భారత్‌,పాక్‌.. రెండుజట్లకూ ఆడిన క్రికెటర్లు వీరే
Array ( ) 1

కథనాలు

Updated : 04/09/2020 17:38 IST

భారత్‌,పాక్‌.. రెండుజట్లకూ ఆడిన క్రికెటర్లు వీరే

ఏ క్రీడాకారులైనా దేశం తరఫున ఆడాలని కలలు కంటారు. అందుకోసం ఎంతో శ్రమిస్తారు. ఏళ్లకు ఏళ్లు కష్టపడతారు. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా రాణిస్తారు. చివరికి అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకుంటారు. తమ రంగాల్లో అత్యున్నత స్థాయిలో రాణించి దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెస్తుంటారు. అలా ఏ ఆటగాడైనా ఒక దేశం తరఫున ఆడటమే గొప్ప విశేషం. అలాంటిది రెండు దేశాలకు ఆడటమంటే మాటలా?అది కూడా భారత్‌ - పాకిస్థాన్‌ లాంటి దాయాది దేశాలకు. అందులోనూ క్రికెట్‌ రంగంలో. నేటి తరానికైతే అది కలలో కూడా ఊహించుకోవడానికి సాధ్యం కాదు. కానీ ముగ్గురు ఆటగాళ్లున్నారు. వారు అటు పాకిస్థాన్‌కు ఇటు భారత జట్టుకు క్రికెట్‌ ఆడి తమ పేర్లను చరిత్రలో లిఖించుకున్నారు.

అబ్దుల్‌ హఫీజ్‌ కర్దార్‌:

పంజాబ్‌లోని లాహోర్‌లో పుట్టిన అబ్దుల్‌ హఫీజ్‌ పాకిస్థాన్‌ జట్టుకు తొలి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. దాంతో పాక్‌ క్రికెట్‌ పితామహుడిగా పేరుగాంచాడు. అంతకుముందు ఉత్తర భారత ముస్లిమ్స్‌ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్యం రాకముందు టీమ్‌ఇండియా తరఫున ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేశాడు. దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌కు వలస వెళ్లి తర్వాత ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అలా 1952-53 సీజన్‌లో పాకిస్థాన్‌ అతడి సారథ్యంలోనే తొలిసారి అధికారిక భారత పర్యటనకు వచ్చింది. అప్పుడు లాలా అమర్‌నాథ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా మూడు టెస్టుల సిరీస్‌ ఆడగా 2-1తేడాతో పాక్‌పై విజయం సాధించింది. 

ఆమిర్‌ ఇలాహి:

ఆమిర్‌ కూడా లాహోర్‌లోనే జన్మించాడు. 1947లో టీమ్‌ఇండియా తరఫున ఆడిన అతడు ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. అంతకుముందు రంజీ క్రికెట్‌లో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1946-47 కాలంలో ఆ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వలస వెళ్లిన అతడు తర్వాత ఆ జట్టులో కొనసాగాడు. అలా 1952 వరకు దాయాది జట్టులో ఆడిన ఆమిర్‌ టీమ్‌ఇండియాతోనే చివరి మ్యాచ్‌ ఆడడం గమనార్హం. చివరి మ్యాచ్‌లో ఒకే వికెట్‌ తీసి 29 పరుగులిచ్చాడు. 

గుల్‌ మహ్మద్‌: 

గుల్‌ సైతం లాహోర్‌లోనే పుట్టి పెరిగాడు. ఎత్తు తక్కువగా ఉన్నా తనదైన బ్యాటింగ్‌తో అదరగొట్టేవాడు. 17 ఏళ్ల ప్రాయంలోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1942-43 కాలంలో దేశవాళి క్రికెట్‌లో భారత క్రికెటర్‌ విజయ్‌ హజారేతో కలిసి రికార్డు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అలాగే 1946-47 రంజీ ట్రోఫీ ఫైనల్లోనూ బరోడా తరఫున 319 పరుగులు సాధించాడు. అదే సీజన్‌లో టీమ్‌ఇండియాకు ఎంపికైన అతడు ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేశాడు. తర్వాత 1952-53 పాకిస్థాన్‌ భారత పర్యటనలో లాలా అమర్‌నాథ్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియాలో ఆడాడు. 1955లో దాయాది దేశానికి మకాం మార్చి 1956-57లో ఆ జట్టు తరఫున ఆడాడు. అలా పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించి ఆస్ట్రేలియాపై ఆడాడు. 

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకంTags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన