తెర వెనుక ద్రవిడ్‌.. తెర ముందు టీమ్‌ఇండియా
Array ( ) 1

కథనాలు

Updated : 08/03/2021 22:03 IST

తెర వెనుక ద్రవిడ్‌.. తెర ముందు టీమ్‌ఇండియా

టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ వేదిక‌ సౌథాంప్టన్

యువీ, వీరూ, ధోనీలా పంత్‌ మ్యాచ్‌ విజేతన్న దాదా

దిల్లీ: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను టీమ్‌ఇండియా సౌథాంప్టన్‌లో ఆడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. జూన్‌ 18-22 మధ్య భారత్, న్యూజిలాండ్‌ అక్కడ తలపడతాయని ధ్రువీకరించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన అద్భుత విజయాలు సాధించిందని ప్రశంసించారు. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో తెరవెనుక ద్రవిడ్‌ ఎంతగానో శ్రమించాడని అభినందించారు. రిషభ్ పంత్‌ను గొప్ప మ్యాచ్‌ విజేతగా అభివర్ణించారు.

బయో బుడగ కోసమే

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ప్రకటించినప్పుడు ఫైనల్‌ వేదికగా లార్డ్స్‌ను నిర్ణయించారు. కరోనా వైరస్‌ వల్ల బయో బుడగను ఏర్పాటు చేసేందుకు లార్డ్స్‌లో వసతులు లేవు. దాంతో ఐదు నక్షత్రాల వసతి ఉన్న సౌథాంప్టన్‌కు వేదికను మార్చారని తెలిసింది. ‘అవును, ఫైనల్‌ను సౌథాంప్టన్‌లో నిర్వహిస్తారు’ అని పీటీఐ అడిగిన ప్రశ్నకు దాదా జవాబిచ్చారు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు నేను వెళ్తాను. అక్కడ న్యూజిలాండ్‌ను ఓడిస్తామన్న నమ్మకం ఉంది. మనకన్నా ముందే కివీస్‌ అక్కడి చేరుకొని ఇంగ్లాండ్‌తో ఆడనుంది’ అని తెలిపారు. కాగా లార్డ్స్‌తో పోలిస్తే సౌథాంప్టన్‌ మందకొడి పిచ్‌. స్పిన్‌కు మరింత అనుకూలిస్తుంది.

ప్రశంసించాల్సిందే

ఆసీస్‌, ఇంగ్లాండ్‌పై సిరీసులు గెలిచిన టీమ్‌ఇండియాపై దాదా ప్రశంసలు కురిపించారు. ‘జట్టు గొప్పగా ఆడింది. బయో బుడగల్లో ఉంటూ క్రికెట్‌ ఆడింది. అయిపోగానే గదుల్లోకి వెళ్లింది. ఐపీఎల్‌ నుంచి వారు సాధించిన ప్రతిదీ అద్భుతమే. మనం కచ్చితంగా అజింక్య రహానెను అభినందించాలి. మొదట అతడు ఆసీస్‌లో జట్టును విజయపథంలో నడిపించాడు. ఇంగ్లాండ్‌పై కోహ్లీ, కోచ్‌, సహాయ సిబ్బంది, ప్రతి ఒక్కరినీ ప్రశంసించాలి. కుర్రాళ్లను తీర్చిదిద్దడంలో తెరవెనుక ద్రవిడ్‌ శ్రమించాడు. బ్రిస్బేన్‌ ఫలితమే అందుకు ఉదాహరణ’ అని గంగూలీ తెలిపారు.

పంత్‌ మ్యాచ్‌ విజేత

వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌సింగ్‌, మహేంద్రసింగ్‌ ధోనీలా రిషభ్‌ పంత్‌ మ్యాచ్‌ విజేతని దాదా అన్నారు. ‘రెండేళ్లుగా పంత్‌ను చూస్తున్నా. మ్యాచ్‌ విజేతలపై నేను నమ్మకం ఉంచుతాను. తమదైన రోజున మ్యాచులు గెలిపించే వారుంటారు. అలాంటివాడే పంత్‌. సిడ్నీ టెస్టులో అతడు మరో ఆరు ఓవర్లు ఉంటే మ్యాచ్‌ను గెలిపించేవాడే. అతడు ధోనీ, యువీ, సెహ్వాగ్‌లా మ్యాచులు గెలిపించగలడు. అహ్మదాబాద్‌లో ఎలా ఆడాడో చూడండి. జేమ్స్‌ అండర్సన్‌ కొత్త బంతితో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు అతడి తెలివితేటలను గమనించండి. ప్రతిదాడి చేసి మొత్తం మార్చేశాడు’ అని అన్నారు.

తెరవెనుక రాహుల్‌

జాతీయ క్రికెట్‌ అకాడమీలో రాహుల్‌ ద్రవిడ్‌ శ్రమించడంతోనే టీమ్‌ఇండియా రిజర్వుబెంచ్‌ ఇంత పటిష్ఠంగా ఉందని దాదా స్పష్టం చేశారు. జస్ప్రీత్‌ బుమ్రా లేకుండా మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌ ఆసీస్‌పై ఆఖరి టెస్టులో గెలిపించడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. తన ఆరోగ్యం బాగుందని, వయసు పెరుగుతున్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవని చెప్పారు. గుండెపోటుతో భయపడలేదని త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పడంతో శస్త్రచికిత్స చేయించుకున్నానని తెలిపారు. రెండు, మూడో టీ20 వీక్షించేందుకు అహ్మదాబాద్‌ వెళ్తానని వెల్లడించారు.

రాజకీయాలపై..

తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై దాదా స్పందించారు. ‘ఎక్కడిదాకా వెళ్తుందో చూద్దాం. ఎలాంటి అవకాశాలు వస్తాయో చూసి నిర్ణయించుకోవాలి. నా జీవితంలో చాలా విషయాలు హఠాత్తుగా జరిగినవే. సచిన్‌ నాయకత్వం వహిస్తే నాకు సారథ్యం వస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ అతడు రాజీనామా చేశాడు. బీసీసీఐ అధ్యక్షుడిగానూ అంతే. నిమిషాల ముందు వరకు అధ్యక్షుడిని అవుతానని తెలియదు. నా జీవితం అలా ఉంటోంది మరి. రాజకీయ అవకాశాలు వచ్చాయి. కుటుంబం, జీవన శైలి, ఆరోగ్యం, పని వంటి చాలా అంశాలు దానిపై ప్రభావితం చేస్తాయి. ప్రజల్లో నాపై ఇంత అభిమానం ఉండటం సంతోషం. అందుకే వారిని నిత్యం కలుస్తూనే ఉంటాను.

రిస్క్‌ కాబట్టే అనుమతించలేదు

లాజిస్టిక్స్‌ సమస్య వల్లే ఐపీఎల్‌ తొలి అంచె మ్యాచులకు అభిమానులు అనుమతించడం లేదని గంగూలీ తెలిపారు. తాము సరిగ్గా ప్రణాళిక వేశామని, దఫదఫాలుగా మ్యాచులు నిర్వహిస్తున్నామన్నారు. ‘ప్రతి జట్టుకు మూడు విమానాలు వినియోగిస్తాం. ఇంగ్లాండ్‌ సిరీసుల కోసం రెండు మాత్రమే వినియోగించాం. సంఖ్య తక్కువే గానీ దుబాయ్‌లో లీగ్‌ను విజయవంతం చేసిన అనుభవం బీసీసీఐకి ఉంది. ఇప్పుడూ అలాగే చేస్తాం. పరిస్థితులను బట్టి అభిమానులను అనుమతిస్తాం. దుబాయ్‌లోనూ అంతే. ద్వైపాక్షిక సిరీసులు, ఐపీఎల్‌కు తేడా ఉంది. లీగు కోసం అనుమతిస్తే అభిమానులు ఆటగాళ్లను సమీపించే అవకాశం ఉంటుంది. అది కాస్త రిస్కే’ అని దాదా అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన