6,6,6,6.. కొడతానని జోఫ్రాకు ముందే తెలుసా?
Array ( ) 1

కథనాలు

Updated : 25/09/2020 09:44 IST

6,6,6,6.. కొడతానని జోఫ్రాకు ముందే తెలుసా?

భవిష్యత్తు చెప్పేస్తున్న ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్!‌

కరోనా, ప్రపంచకప్‌, మోదీ 9ని|| దీపాలపై ముందే ట్వీట్లు 

మహిమాన్వితులు.. తపశక్తి సంపన్నులు భవిష్యత్తును దర్శించగలరు. మున్ముందు ఏం జరుగుతుందో ఊహించి చెప్పగలరు. ఆధునిక కాలంలోనూ అలాంటి అంచనాలతో విస్మయ పరిచిన వ్యక్తులు కొందరున్నారు. రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఇదే కోవకు చెందుతాడు! ఎలా అంటారా?


ముందే చెప్పేశాడా?

బార్బడోస్‌ మూలాలున్న జోఫ్రా ప్రస్తుతం ఇంగ్లాండ్‌ జట్టుకు ఆడుతున్నాడు. 140-150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే అతడు బ్యాటుతో అవే బంతుల్ని స్టేడియం దాటించగలడు. 2019 ప్రపంచకప్‌లో అతడిని ఆడించడం కోసం ఈసీబీ తన నియమాలను సైతం సవరించింది. అద్భుతంగా ఆడతాడు కాబట్టే రాజస్థాన్ జట్టు భారీ మొత్తానికి అతడిని దక్కించుకుంది. చాలామంది అతడిని ‘క్రికెట్‌ నోస్ట్రాడామస్‌’ అంటుంటారు. ఎందుకంటే 2013 నుంచి అతడు చేసిన ట్వీట్లలో చాలా వరకు నిజం అయినట్టే కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ గెలవడం, న్యూజిలాండ్‌పై ఫైనల్లో స్టోక్స్‌ ఆట నుంచి మోదీ 9 నిమిషాలు దీపాలు వెలిగించడం, సుశాంత్‌ మరణంతో రియాచక్రవర్తి సంబంధం వరకు అతడు చేసిన ట్వీట్లు నిజమయ్యాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు.


6666 వైరల్‌

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నైతో మ్యాచులో ఆర్చర్‌ 2 బంతుల్లోనే 27 పరుగులు సాధించాడు. ఎంగిడి వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6,6,6,6 బాదేశాడు. తొలి రెండు బంతులు సరైనవే. మూడో బంతిని రెండుసార్లు నోబాల్‌ వేయడంతో రెండు సిక్సర్లు బాదేశాడు. 2015, జనవరి 9నే జోఫ్రా ‘6666’ అనే ట్వీట్‌ చేశాడు. ఈ నాలుగు సిక్సర్లకు సంబంధించిందే ఆ ట్వీట్‌ అని చాలామంది వైరల్‌ చేస్తున్నారు. అయితే 2016 టీ20 ప్రపంపచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ సైతం స్టోక్స్‌ బౌలింగ్‌లో వరుసగా ‘6666’ బాదేసిన సంగతి తెలిసిందే. దగ్గుమందు తీసుకొని.. నాడాకు చెప్పకపోవడంతో నిషేధిత ఉత్ప్రేరకాలు వాడాడని కొంతకాలం క్రితం పృథ్వీషాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 2015, సెప్టెంబర్‌ 16న ‘షా.. దురదృష్టవంతుడు’ (Unluckey shaw) అని ఆర్చర్‌ ట్వీటడం అప్పట్లో వైరల్‌గా మారింది.


దక్షిణాఫ్రికా పతనం.. ఏబీ రాక

ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019కి సంబంధించి జోఫ్రా చాలా విషయాలు ముందే చెప్పేశాడా అనిపిస్తోంది. రెండు సెమీసుల్లో న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌ చేతుల్లో భారత్‌, ఆస్ట్రేలియా ఓటమి, ఫైనల్లో సూపర్‌ఓవర్‌ లక్ష్యంపై చేసిన ట్వీట్లు అచ్చంగా సరిపోలాయి. ఈ ప్రపంచకప్‌లో బెన్‌స్టోక్స్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రతిభను ప్రదర్శించాడు. దానికి ‘Played stokes’ అని 2015, మే21న ట్వీటాడు. ఆండ్రి రసెల్‌ 140 కి.మీ వేగంతో బంతులు విసరడం గురించి ‘Russell now bowl 140?!?!?Wdr’ అని 2015, జనవరి 28న పెట్టాడు. ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడా క్రికెట్‌ సంఘంపై నిషేధం పడింది. ‘Wrap it up SA’ (2013, డిసెంబర్‌ 8), ‘South Africa:|’ (2014, మార్చి 3), ‘Come ab’ (2014, అక్టోబర్‌ 21) అని ట్వీట్లు పెట్టాడు. మెగాటోర్నీ సమయంలో ఏబీ పునరాగమనంపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.


కివీస్‌ సెమీస్‌లో టాప్‌-3 ఫ్లాప్‌

ప్రపంచకప్‌లో ఎక్కువగా మాట్లాడిన.. వర్షం, బెయిల్స్‌ కింద పడకపోవడంపై ‘Pick the bails!!!!!!!’ (2013, జనవరి 19), ‘Rain Gonna fall everyday?’ (2015, మే 19) అని జోఫ్‌రా పోస్ట్‌ చేశాడు. ‘Kane ain't stop scoring? (2015 మార్చి 28), ‘This is foolishness rohit’ (2014, మే 25), ‘Come man out rohit and rahul’ (2015 జనవరి 8), ‘stupid shot virat’ (2014, డిసెంబర్‌ 2014), ‘Jadeja can bat tho’ (2014, ఫిబ్రవరి 11), ‘Madness New Zealand’ (2017, అక్టోబర్‌ 29) అని భారత్‌×కివీస్‌ సెమీస్‌కు సంబంధించిన ట్వీట్లు పెట్టాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌, రాహుల్‌, విరాట్‌ వరుసగా ఔటైన సంగతి తెలిసిందే. అయితే జడ్డూ మెరుపు షాట్లతో అలరించాడు. ఫైనల్లో  ఇంగ్లాండ్‌, కివీస్‌ మ్యాచ్‌ స్కోర్లు, సూపర్‌ ఓవర్‌ స్కోర్లూ సమం కావడంతో బౌండరీల ఆధారంగా ఇంగ్లిష్ జట్టును విశ్వవిజేతగా ప్రకటించారు. సూపర్‌ ఓవర్లో ఇంగ్లాండ్‌ 15 పరుగులు చేసింది. వీటికి సంబంధించి ‘result’, ‘16 from 6’, ‘15 from last’ అని ట్వీట్లు చేశాడు.


కరోనా.. ముందే తెలుసా?

కరోనా వైరస్‌ మహమ్మారి పైనా ఆర్చర్‌ జోస్యం చెప్పినట్టు అనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 9 గంటలకు 9 నిమిషాలు దీపాలు వెలిగించమని చెప్పడం, తొలుత 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించడానికి సరిపోయేలా అతడి ట్వీట్లు ఉన్నాయి. ‘Tell her i be looking for her with a falsh light’ (2014, Mar 10), ‘9 from 9’ (2014 Mar 27), ‘Light it up’ (2014, March 12), ‘3 weeks at home is'nt enought’ అని జోఫ్రా ట్వీటాడు. ఎక్కడికీ పరుగెత్తలేని రోజు ఒకటి వస్తుందని ‘There will be, no place to run, that day will come’ అని 2014, ఆగస్టు 20న చేశాడు. కరోనా వైరస్‌, వ్యక్తిగత కారణాలతో దుబాయ్‌ నుంచి సురేశ్‌ రైనా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘Don't run raina’ (2014, ఏప్రిల్‌ 18), ‘How raina out?’ (2014, సెప్టెంబర్‌ 27) అని చేసిన ట్వీట్లు ఇందుకు సంబంధించినవే అని కొందరి అభిప్రాయం. ‘Rhea and tessale:|’ (2014, జులై 17) అనే ట్వీట్‌ను చూసి సుశాంత్‌ మరణం, రియా చక్రవర్తి అరెస్టు విషయం ఆర్చర్‌కు ముందే తెలుసని మరికొందరి విశ్వాసం. ‘ఇక మేం ముగ్గురం! 2021 జనవరిలో రాక’ అని విరుష్క జంట తాము తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించింది. ‘జనవరి 5’ అని 2015, జనవరి 1న జోఫ్రా చేసిన ట్వీట్‌ వారి బిడ్డ గురించే అని వైరల్‌ అయింది.


యాదృచ్ఛికమేనా?

ఆర్చర్‌ చేసిన ట్వీట్లలో చాలా అంశాలు యాదృచ్ఛికంగా నిజమే అనిపిస్తున్నాయి. అయితే అతడు పోస్ట్‌ చేసిన తేదీలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఒక సిరీస్‌గా ఎప్పుడూ చేయలేదు. టీవీల్లో క్రికెట్‌ ప్రత్యక్ష ప్రసారాలను చూస్తూ ట్వీట్లు చేయడం అతడికి అలవాటు. అప్పటి మ్యాచ్‌లను ఉద్దేశించి చేసినవే ఇప్పటికీ సరిపోతున్నాయని కొందరు అంటున్నారు. ఆర్చర్‌కు ఏదో అతీంద్రియ శక్తి ఉందని, అతడు భవిష్యత్తును ఊహించగలడని మరికొందరు అంటున్నారు. అసలు నిజమేంటో తెలియాలంటే అతడే నోరు విప్పాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన