ముంబయితో అంత ‘వీజీ కాదు’ శ్రేయస్‌! 
Array ( ) 1

కథనాలు

Published : 04/11/2020 08:07 IST

ముంబయితో అంత ‘వీజీ కాదు’ శ్రేయస్‌! 

‘నయా దిల్లీ’కి ముంబయితో ప్లేఆఫ్స్‌ గండం

అస్థిరత.. అనిశ్చితి.. ఆఖరి స్థానం.. రెండు సీజన్ల ముందు వరకు ఆ జట్టు పరిస్థితి ఇదే. ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బంది, జెర్సీ, పేరు ఎప్పుడైతే మార్చుకుందో సరికొత్తగా తయారైంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనలతో ఆకట్టుకుంటోంది. చక్కని విజయాలతో వరుసగా రెండో సారీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. గురువారం క్వాలిఫయర్‌-1లో ‘మహా’ ముంబయిని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కసారీ ఫైనల్‌ ఆడని ‘కొత్త’ దిల్లీ తమకు అచ్చిరాని నాకౌట్‌ గండాన్ని దాటేనా? చరిత్ర సృష్టించేనా? గతంలో ఏం జరిగింది?


దిల్లీ.. విచిత్రం

ప్రస్తుత సీజన్‌లో దిల్లీ విచిత్రమైన పరిస్థితులను చవిచూసింది. తొలి 7 మ్యాచుల్లో 5 గెలిచి ఔరా! అనిపించింది. 8, 9 మ్యాచుల్లో దుమ్మురేపి 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువైంది. హమ్మయ్య! ఇంకొక్క మ్యాచు గెలిస్తే చాలు అనుకుంటే వరుసగా 4 మ్యాచుల్లో ఓడి పీకలమీదకు తెచ్చుకుంది. ఆఖరి లీగ్‌ మ్యాచులో బెంగళూరుపై విజయం సాధించి 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (525 పరుగులు), శ్రేయస్‌ అయ్యర్‌ (421) తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు. కానీ అనవసర సమయాల్లో అనవసర షాట్లకు ప్రయత్నించి ఔటై వీరు ఇబ్బంది పెడుతున్నారు.

ఇక ఓపెనర్‌ పృథ్వీ షా (228), రిషభ్ పంత్‌ (282) తమ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. ముఖ్యంగా పంత్‌ ఒక్క అర్ధశతకమూ చేయలేదు. రహానె ఫామ్‌లోకి రావడం ఆనందాన్ని ఇచ్చే అంశం. ఆల్‌రౌండర్లు స్టాయినిస్‌, అక్షర్‌ పటేల్‌ మరింత రాణించాల్సిన అవసరం ఉంది. రబాడా (25 వికెట్లు) అత్యధిక వికెట్ల వీరుడు. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అన్రిచ్‌ నార్జె (19), అశ్విన్‌ (10) వికెట్లు తీస్తుండటం ఊరటనిస్తోంది. అయితే రబాడా పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టలేక పోతున్నాడు. అశ్విన్‌ ఎక్కువ వైవిధ్యం ప్రదర్శిస్తే మొదటికే మోసమొచ్చే అవకాశం ఉంది. ప్రణాళికలను పక్కగా మైదానంలో అమలు చేయాల్సిన పెద్ద బాధ్యత కెప్టెన్‌ శ్రేయస్‌పై ఉంది.


నాకౌట్స్‌లో ఒత్తిడి

నిజానికి సెమీస్‌, క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ ఆడటంలో దిల్లీకి మంచి అనుభవం లేదు. ఎందుకంటే 12 సీజన్లలో కేవలం 4 సార్లే నాకౌట్‌ దశకు చేరుకొంది. కానీ పెద్ద మ్యాచుల్లో ఒత్తిడికి చిత్తై, ప్రణాళికలు సరిగ్గా అమలు చేయలేక ఒక్కసారీ ఫైనల్‌ చేరుకోలేదు. 2008లో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి రాజస్థాన్‌తో సెమీస్‌ ఆడింది. 105 పరుగులతో ఓటమి పాలైంది. షేన్‌వార్న్‌ సేన నిర్దేశించి 192 పరుగుల లక్ష్య ఛేదనలో 16.1 ఓవర్లకు 87కే కుప్పకూలింది. దిల్షాన్‌ (33) టాప్‌స్కోరర్‌.

2009లో 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. సెంచూరియన్‌లో డెక్కన్‌తో సెమీస్‌లో పరాజయం పాలైంది. దిల్లీ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (85; 35 బంతుల్లో) అండతో 17.4 ఓవర్లకే డెక్కన్‌ ఛేదించింది. 2012లో దిల్లీ మళ్లీ తొలిస్థానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్‌-1లో కోల్‌కతా చేతిలో 18 పరుగుల తేడాతో ఓడింది. క్వాలిఫయర్‌-2లో చెన్నై నిర్దేశించిన 223 లక్ష్యాన్ని ఛేదించలేక 136కే చతికిలపడింది. 2019లో ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌ నిర్దేశించిన 163 లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో ఛేదించినా.. క్వాలిఫయర్‌-2లో చెన్నై చేతిలో మాత్రం చిత్తుగా ఓడింది. దిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని డుప్లెసిస్‌ (50), వాట్సన్‌ (50) అండతో ధోనీసేన సునాయాసంగా ఛేదించింది.


తిరుగులేని ముంబయి

రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకున్నా భీకరమైన ఫామ్‌లో ఉన్న ముంబయిని క్వాలిఫయర్‌-1లో ఓడించడం దిల్లీకి అంత సులువేమీ కాదు. ఎందుకంటే అది విజేతల జట్టు. ఒకరు కాకపోతే మరొకరు ఆడేస్తారు. ఓపెనర్లు డికాక్‌, కిషన్‌ శుభారంభాలను ఇస్తున్నారు. ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ తిరుగులేని జోరు కనబరుస్తున్నాడు. కీరన్‌ పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య ఎలాంటి మెరుపులు మెరిపించగలరో తెలుసు. ఆఖర్లో కృనాల్‌ పాండ్య సైతం పరుగులు చేయగలడు. ఇక బుమ్రా, బౌల్ట్‌ బంతితో బుల్లెట్లు విసురుతున్నారు. వారికి తోడుగా ప్యాటిన్సన్‌, కౌల్టర్‌నైల్‌ రాణిస్తున్నారు. స్పిన్నర్లు రాహుల్‌ చాహర్‌, కృనాల్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకుంటున్నారు.

ఇక ఫైనల్‌ చేరిన 5 పర్యాయాల్లో ముంబయి నాలుగు సార్లు విజేతగా అవతరించింది. ఇలాంటి రికార్డు మరే జట్టుకూ లేదు. ఒత్తిడిని ఎదుర్కొనే ఆటగాళ్లుండటమే ఇందుకు కారణం. ఈ సీజన్‌లో ముంబయి చేతిలో రెండు లీగు మ్యాచుల్లోనూ ఓటమి పాలవ్వడం దిల్లీని భయపెడుతోంది. దుబాయ్‌లో ఆ జట్టును 110కే ఆలౌట్‌ చేసిన ముంబయి 14.2 ఓవర్లలో 9 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించేసింది. అయితే దుబాయ్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 4 గెలవడం శ్రేయస్‌ సేనకు ఊరటనిచ్చే అంశం. మొత్తంగా ఈ రెండు జట్లు లీగులో 26 సార్లు తలపడితే 14-12తో ముంబయిదే పైచేయి. ఈ రెండు జట్లు గతంలో ప్లేఆఫ్స్‌లో తలపడకపోవడం గమనార్హం.

-ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన