Stadiums: భారతావనిలో సువిశాల మైదానాలివి..!
Array ( ) 1

కథనాలు

Updated : 15/07/2021 13:44 IST

Stadiums: భారతావనిలో సువిశాల మైదానాలివి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సువిశాల భారత దేశంలో క్రీడాభిమానులకు కొదవలేదు. మరి ఇష్టమైన ఆటగాళ్లు అతిపెద్ద మైదానాల్లో ఆడుతుంటే ఆ మజానే వేరు కదా.. వేలమంది చేసే అరుపులు, కేకలతో భారీ స్టేడియం మార్మోగిపోయే దృశ్యాలను టీవీలో చూస్తేనే భలేగుంటుంది. అలాంటి పెద్ద స్టేడియాలు మన దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి..? ఎంత కెపాసిటీతో ప్రేక్షకులు వీక్షించవచ్చో తెలుసుకోండి మరి..

నరేంద్ర మోదీ స్టేడియం..

తొలుత సర్దార్ వల్లభాయ్‌ పటేల్ మైదానాన్నే గతేడాది భారీ మార్పులతో పునర్నిర్మాణం చేపట్టారు. గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ 1983లో పటేల్‌ మైదానాన్ని నిర్మించింది. దాదాపు 1,10,000 సీటింగ్‌ సామర్థ్యంతో అప్పట్లో నిర్మాణం చేపట్టింది. ఇందులో 1966, 2011 క్రికెట్‌ ప్రపంచ కప్‌, ఐసీసీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లు జరిగాయి.  అలానే ఎన్నో టెస్టు, వన్డే, టీ20 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. అయితే పునర్నిర్మాణం కోసం 2015లో స్టేడియంను మూసివేశారు. గతేడాది సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పోర్ట్స్‌ ఎన్‌క్లేవ్‌లో భాగంగా ‘నరేంద్ర మోదీ స్టేడియం’ నిర్మాణం జరిగింది. దాదాపు 63 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ స్టేడియంలో 1.32 లక్షల మంది కూర్చోవచ్చు.  ఇందులో తొలిసారిగా హైమాస్ట్‌ ఫ్లడ్‌లైట్లకు బదులుగా ఎల్‌ఈడీ లైట్లు వాడారు. 


కోల్‌కతాలో రెండు భారీ స్టేడియాలు..

కోల్‌కతా అనగానే ఈడెన్‌ గార్డెన్స్‌ గుర్తుకొస్తుంది కదా.. అయితే ఈడెన్‌ గార్డెన్స్‌ కంటే కూడా పెద్దదైన స్టేడియం మరొకటి ఉంది. అదే సాల్ట్‌ లేక్‌ సిటీ స్టేడియం. 1984లో నిర్మించిన స్టేడియంలో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2011వ సంవత్సరంలో మరమ్మత్తుల చేసే వరకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియంగా దీనికి పేరుంది. దాదాపు 1.20 లక్షల సీటింగ్‌ కెపాసిటీ ఉంది. అయితే 1997లో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 1,31,781 మంది వీక్షించడం విశేషం. ప్రస్తుతం స్డేడియం సామర్థ్యం 85 వేలు. పునర్నిర్మాణంలో భాగంగా స్టేడియంలో అనేక మార్పులు చేశారు. త్రీ లేయర్ గ్రాస్‌ పిచ్, వీఐపీ బాక్సుల పెంపు, ప్రాక్టీస్‌ పిచ్‌లు, బకెట్‌ టైప్‌ సీటింగ్‌ను ఏర్పాటు చేశారు. 

* ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠభరితమే... 

కోల్‌కతాలో 1964లో నిర్మితమైన ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌ అంటే ప్రతి క్రికెట్‌ అభిమాని ఎగిరిగంతేస్తాడు. ఎన్నో ఉత్కంఠభరిత పోరులకు వేదికగా ఈడెన్‌ గార్డెన్స్‌ నిలిచింది. 1987 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌ వరకు థ్రిల్లింగ్‌ కలిగించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో గెలిచిన ఆసీస్‌ వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. అలాంటి ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం కెపాసిటీ 68 వేలు. 2001లో ఆస్ట్రేలియాపైనే హర్భజన్‌ హ్యాట్రిక్‌తో చెలరేగిన విషయం ఎప్పటికీ మరువలేం. భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి హోం గ్రౌండ్‌ అయిన ఈడెన్‌లోనే కెరీర్‌లో తన మొదటి, ఆఖరితోపాటు మరికొన్ని సెంచరీలు చేయడం విశేషం. ప్రస్తుతం ఐపీఎల్‌తోపాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తోంది. 


ఉత్తమ మైదానాల్లో ఇదొకటి..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2008వ సంవత్సరంలో రాయ్‌పుర్‌ వేదికగా నిర్మించిన షాహీబ్‌ వీర్‌ నారాయణ్‌ సింగ్‌ స్టేడియం కెపాసిటీ 65 వేలు. 2010లో కెనడా జాతీయ జట్టు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర జట్టు తొలిసారి తలపడ్డాయి. ఇప్పటికే పలు ఐపీఎల్‌, ఛాంపియన్‌ లీగ్‌ పోటీలతోపాటు రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. 2001లో స్టేడియం నిర్మాణం ప్రారంభమైనప్పటికీ పూర్తయ్యేందుకు దాదాపు ఏడేళ్ల సమయం పట్టింది. దిల్లీ డేర్‌డేవిల్స్‌కు రెండో హోంగ్రౌండ్‌గా రాయ్‌పుర్‌ను ఎంపిక చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి ప్రధాన పర్యాటక ఆకర్షణగా స్టేడియం నిలిచింది. 


కామన్‌వెల్త్‌ గేమ్స్‌తో ప్రాచుర్యంలోకి...

అరవై వేల సీటింగ్‌ కెపాసిటీతో 1982లో ప్రారంభమైన దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం పదకొండేళ్ల కిందట జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌తో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లకు అతిథ్యమిచ్చింది. అయితే 2011లో కామన్‌వెల్త్ గేమ్స్‌ పోటీలను ఈ స్టేడియంలోనే నిర్వహించారు. ఒలింపిక్స్‌ స్థాయిలో పదివరుసల సింథటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌లు ఉండటం విశేషం. వార్మప్‌ ట్రాక్‌లు, ప్రాక్టీస్‌ ఏరియా, సింథటిక్‌ గ్రాస్‌ ఫీల్డ్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. క్రీడలే కాకుండా ఫుడ్‌ ఫెస్టివల్స్‌, కాన్సెర్ట్‌లు వంటి ఇతర ఈవెంట్‌లు బోలెడు జరిగాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన