టీ20 లీగ్‌: ఇంటర్వెల్‌ అదిరింది
Array ( ) 1

కథనాలు

Updated : 13/10/2020 08:35 IST

టీ20 లీగ్‌: ఇంటర్వెల్‌ అదిరింది

అదే వినోదం.. అదే ఉత్కంఠ.. అదే మజా

ఎంతలో ఎంత మార్పు! ఎలా ఉండేది కొన్నాళ్ల క్రితం పరిస్థితి? ఎక్కడ చూసినా కరోనా వార్తలే.. లాక్‌డౌన్‌ ముచ్చట్లే.. టీకా గురించి ఆరాలే.. రాకపోకలు బంద్‌.. కలుసుకోవడాల్లేవ్‌.. ఆటల్లేవ్‌.. పాటల్లేవ్‌.. మానసిక ఉల్లాసానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదు. టీ20 లీగ్‌ నిర్వహిస్తామన్న బీసీసీఐ ప్రకటనతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.

కాల చక్రం గిర్రున తిరిగింది. జరుగుతుందో లేదో అనుకున్న క్రికెట్ వేడుక‌ నిర్విరామంగా.. నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎప్పటిలాగే పరుగుల వరద.. ఎప్పటిలాగే వినోదం.. ఎప్పటిలాగే ఉత్కంఠ.. క్రికెట్‌ సోకు ఏ మాత్రం తగ్గలేదు. అప్పుడే లీగ్‌ సగం ముగిసింది. మరి మనల్ని ఆకట్టుకున్న విశేషాల్ని మరోసారి నెమరేసుకుందామా!


ముంబయి దూకుడు

యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ టీ20లీగ్‌‌ ఇంటర్వెల్‌కు వచ్చేసింది. లీగ్‌ దశలో అన్ని జట్లూ ఏడేసి మ్యాచులు ఆడేశాయి. పూర్తిస్థాయి బలం, బలగం ఉన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి తొలి మ్యాచులో నిరాశపరిచినా.. రెండో మ్యాచ్‌ నుంచి దూకుడు పెంచింది. 5 గెలిచి 10 పాయింట్లు అందుకుంది. రెండేళ్ల క్రితం వరకు అనామక జట్టుగా ఉండే దిల్లీ గతేడాది సూపర్‌ఫామ్‌నే ఇప్పుడూ కొనసాగిస్తోంది. 5 గెలిచి ముంబయికి గట్టి పోటీనిస్తోంది. ఒక్కసారీ కప్‌ గెలవని బెంగళూరు సైతం ఈసారి సమతూకంతో రాణిస్తోంది. ఐదింట్లో గెలిచి ప్లేఆఫ్‌ రేసులో తానున్నాని చాటిచెప్పింది. ఇక హిట్టర్లతో నిండిన కోల్‌కతా సైతం 8 పాయింట్లతో దూకుడుగానే ఉంది. టాప్‌-4 వీటితో నిండింది.


పాపం.. పంజాబ్‌!

ఇక కింది నుంచి నాలుగు స్థానాల్లో హైదరాబాద్‌, రాజస్థాన్‌, చెన్నై, పంజాబ్‌ ఉన్నాయి. ఏడింట్లో మూడు గెలిచిన హైదరాబాద్‌ ఇప్పుడిప్పుడే జోరు పెంచుతోంది. మిడిలార్డర్‌ సమస్యను అధిగమిస్తోంది. ఆరంభంలో రెండు విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్‌కు వరుసగా 4 పరాజయాలు ఎదురయ్యాయి. వార్నర్‌ సేనపైనే గెలిచి 6 పాయింట్లు అందుకుంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన చెన్నైకి ఈ సారి కలిసిరాలేదు. కీలక ఆటగాళ్లు లేకపోవడం, మిగిలిన వారు రాణించకపోవడం, ధోనీ ఆత్మవిశ్వాసంతో లేకపోవడం ఆ జట్టుకు శాపాలుగా మారాయి. అందుకే కేవలం 2 గెలిచి 4 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. పాపం.. పంజాబ్‌! ఒక్కటే విజయం సాధించింది. గెలవాల్సిన మ్యాచుల్లో ఓడిపోయి 2 పాయింట్లతో అట్టడుగున నిలిచింది.


అమ్మో.. ఛేదన?

టీ20 క్రికెట్‌ అంటేనే ఛేదన. ఎదురుగా లక్ష్యం ఉంటే గెలవడం సులవని జట్లన్నీ భావిస్తాయి. అలాంటిది ఈ సారి అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఛేదనకు దిగే జట్లు ఓడిపోతున్నాయి. ఇప్పటి వరకు 28 మ్యాచులు జరిగితే 7 సార్లే ఛేదనలు విజయవంతం అయ్యాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన 19 జట్లు గెలిచాయి. రెండు మ్యాచుల్లో ఫలితం సూపర్‌ఓవర్ల ద్వారా తేలింది. యూఏఈలో ఉష్ణోగ్రతలు, పిచ్‌లో అనూహ్య మార్పులు, తేమ ప్రభావం, ఆటగాళ్ల అలసట వల్ల ఇలా జరుగుతోందని విశ్లేషకుల అంచనా. 


కరోనా లేదు

లీగ్‌ ముందు కరోనా వైరస్ కలకలం చెలరేగింది. దీపక్‌ చాహర్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ సహా 13 మంది చెన్నై సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో టోర్నీ నిర్వహణ కత్తి మీద సాముగా అనిపించింది. దాదాపు 400+ మందితో ఏర్పాటు చేసిన బయోబుడగ నిర్వహణ విజయవంతం అవుతుందో లేదోనన్న సందేహాలు కలిగాయి. ఇప్పుడవి పటాపంచలు అయ్యాయి. ఆట మొదలయ్యాక ఒక్క ఆటగాడికీ వైరస్‌ సోకలేదు. వారు బుడగ వాతావరణానికి పూర్తిగా అలవాటు పడ్డారు. క్రమశిక్షణతో ఉంటున్నారు. ఐదు రోజులకు ఓసారి ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు చేయించుకుంటున్నారు. సౌరవ్‌ గంగూలీ, జై షా, బ్రిజేష్‌ పటేల్‌.. యూఏఈలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.


కుర్రాళ్లు.. కేక

ఎప్పటిలాగే 2020లోనూ కుర్రాళ్లకు కొదవేమీ లేదు. బంతి, బ్యాటుతో రాణిస్తూ సామ్‌ కరణ్ చెన్నైకి కీలకంగా మారాడు. 7 మ్యాచుల్లో 219.35 స్ట్రైక్‌రేట్‌తో 68 పరుగులతో పాటు 8.84 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. పంజాబ్‌లో అర్షదీప్‌ అనే కుర్ర పేసర్‌ 2 మ్యాచుల్లో 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. టీ20లకు సరిపోడనుకున్న మయాంక్‌ అగర్వాల్‌ 48.14 సగటుతో 337 పరుగులతో దుమ్మురేపుతున్నాడు. ఓ శతకమూ బాదేశాడు. కోల్‌కతాలో కమలేశ్‌ నాగర్‌కోటి (5 మ్యాచుల్లో 4 వికెట్లు), శివమ్‌ మావి (5 మ్యాచుల్లో 5 వికెట్లు) ఔరా అనిపిస్తున్నారు. 140-150కి.మీ. వేగంతో అబ్బుర పరుస్తున్నారు. ముంబయిలో ఇషాన్‌ కిషన్‌ (5మ్యాచుల్లో 186 పరుగులు), బెంగళూరులో దేవదత్‌ పడిక్కల్‌ (7 మ్యాచ్‌ల్లో 243) పరుగుల వరద పారిస్తున్నారు. హైదరాబాద్‌లో అభిషేక్‌ శర్మ (63 పరుగులు 2 వికెట్లు), నటరాజన్‌ (7 వికెట్లు), అండర్‌-19 సారథి ప్రియమ్‌ గార్గ్‌ (86 పరుగులు) అద్భుతంగా ఆడుతున్నారు.


‘సూపర్’‌  క్రేజ్‌

టీ20 లీగ్‌ మొదలైన రెండో రోజే దిల్లీ, పంజాబ్‌ మ్యాచ్‌ సూపర్‌ఓవర్‌కు దారితీయడంతో టోర్నీకి ఒక్కసారిగా క్రేజ్‌ వచ్చేసింది. దిల్లీ చేసిన 157 పరుగుల్ని పంజాబ్‌ సమం చేసింది. సూపర్‌ ఓవర్లో పంజాబ్‌ 2 పరుగులే చేసి రెండు వికెట్లు చేజార్చుకోవడంతో ఆ లక్ష్యాన్ని శ్రేయస్‌ జట్టు సునాయాసంగా ఛేదించేసింది. ముంబయి, బెంగళూరు ఆడిన పదో మ్యాచ్‌లోనూ స్కోర్లు (201) సమం అయ్యాయి. సైని కట్టుదిట్టంగా బంతులు వేయడంతో సూపర్‌ ఓవర్లో ముంబయి వికెట్‌ నష్టపోయి 7 పరుగులు చేసింది. డివిలియర్స్‌, కోహ్లీ చెరో బౌండరీ కొట్టేసి బెంగళూరును గెలిపించారు. ఈ రెండు మ్యాచులూ అభిమానులను ఉర్రూతలూగించాయి.


తెగ.. చూసేస్తున్నారు

ఫ్రాంచైజీ యజమానులు ఊహించనట్టుగా టీ20 లీగ్‌ వ్యూయర్‌షిప్‌ రికార్డులు సృష్టించింది. తొలి వారం 269 మిలియన్ల మంది లీగ్‌ను వీక్షించారు. 2019తో వీక్షించిన నిమిషాలతో పోలిస్తే ఈసారి 15% పెరుగుదల నమోదైంది. 21 ఛానళ్లలో 60.6 బిలియన్ల వీక్షణా నిమిషాలు నమోదు కావడం గమనార్హం. చెన్నై, ముంబయి మధ్య జరిగిన తొలి మ్యాచుకు ఏకంగా 52 మిలియన్ల ఇంప్రెషన్స్‌ లభించాయి. 2019తో పోలిస్తే ఇది 29% ఎక్కువ. రాబోయే రోజుల్లోనూ వ్యూయర్‌షిప్ పరంగా మరిన్ని రికార్డులు బద్దలవుతాయని అంచనా. 


వర్చువల్‌.. ఫ్యాన్స్‌

కరోనా వల్ల స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకపోవడంతో సందడి కనిపించడం లేదు. అందుకు ప్రత్యామ్నాయంగా నిర్వాహకులు చేసిన ఏర్పాట్లు మాత్రం అందరికీ నచ్చాయి! టీవీ తెరల్లో చూసే ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా అభిమానుల కేరింతల శబ్దాలను వినిపిస్తున్నారు. ఇక స్టేడియాల్లోనూ ఆటగాళ్లకు.. అభిమానులు లేరన్న ఫీలింగ్‌ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడా ప్రత్యక్షంగా శబ్దాలు వినిపిస్తున్నారు. ప్రత్యేక తెరలను పెట్టి అభిమానులను ఆన్‌లైన్‌లో కనెక్ట్‌ చేశారు. స్టేడియానికి రెండు వైపులా డగౌడ్‌లో ఆయా జట్లకు చెందిన సిబ్బంది, కుటుంబీకులు జెండాలు ఊపుతూ ఉత్సాహపరుస్తున్నారు.


హైదరాబాద్‌కు నష్టం!

ఆటగాళ్లకు ఫిట్‌నెస్‌ సమస్యలు తప్పడం లేదు. హైదరాబాద్‌కే ఈ బెడద ఎక్కువగా నష్టం చేసింది. జట్టుకు సమతూకం తెచ్చే ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌, పవర్‌ప్లే, డెత్‌లో అద్భుతంగా బంతులు విసిరే భువనేశ్వర్‌ కుమార్‌ మొత్తంగా లీగ్‌కు దూరమయ్యారు. దిల్లీకీ చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. రిషభ్‌ పంత్‌ పిక్క కండరాలు పట్టేయడంతో వారం రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా పరిస్థితి అదే. మరో ఆటగాడు ఇషాంత్‌శర్మ కూడా గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. ఫీల్డింగ్‌ చేస్తూ కిందపడ్డ అశ్విన్‌ గాయపడి, కోలుకొని మళ్లీ జట్టులోకి వచ్చాడు. హ్యారీగర్నీ గాయపడటంతో అమెరికా బౌలర్‌ అలీఖాన్‌ను అతడి స్థానంలో కోల్‌కతా భర్తీ చేసుకుంది. క్వారంటైన్‌ పూర్తి కాకముందే అతడూ గాయపడటం గమనార్హం. తొలి మ్యాచులో అదరగొట్టి గాయపడ్డ అంబటి రాయుడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని మళ్లీ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన