2020.. కోహ్లీ ఏంటి?
Array ( ) 1

కథనాలు

Updated : 22/12/2020 11:05 IST

2020.. కోహ్లీ ఏంటి?

అతడి ప్రదర్శన మరీ తీసికట్టా.. ఓ లుక్కేయండి మరి!  

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఫార్మాట్‌తో సంబంధం లేని మొనగాడు. ఛేదనలో రారాజు. నిలకడకు మారుపేరు. ఆధునిక క్రికెట్‌కు వివ్‌ రిచర్డ్స్‌ అంతటివాడు. అరంగేట్రం ఏడాదిని పక్కన పెడితే శతకం చేయని సంవత్సరమే లేదు. రికార్డులు బద్దలు కొట్టని కాలం లేదు. అలాంటిది 2020లో ఒక్క సెంచరీ కొట్టలేదు. తనవైన కళాత్మక విధ్వంసాలు కనిపించనేలేదు. ట్విటర్లోనైతే అతడిలో పదును తగ్గిందని కొందరు.. ఆశ్రిత పక్షపాతం పెరిగిందని మరికొందరు.. నాయకుడిగా విఫలమయ్యాడని ఇంకొందరు తెగ విమర్శించారు. మరి నిజంగా ఈ ఏడాది విరాట్‌ కోహ్లీ ప్రదర్శన అంత బాగాలేదా?


వన్డేల్లో  ఓకే

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీని వన్డేల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా భావిస్తారు. ఎందుకంటే ఇన్నింగ్స్‌లను నిర్మించడంలో, భాగస్వామ్యాలు నెలకొల్పడంలో, లక్ష్యాలను విజయవంతంగా ఛేదించడంలో అతడికి తిరుగులేదు. ఎంత ఒత్తిడి ఉన్నా.. బౌలర్లు ఎంత భీకరంగా బంతులేస్తున్నా.. విరాట్‌ మాత్రం ఇటుకలతో గోడ నిర్మించినట్టుగా ఒక్కో పరుగూ చేసుకుంటూ పోతాడు. నిజానికి గత మూడేళ్లుగా ఏటా 1200+ పరుగులు చేస్తూనే ఉన్నాడు. 2015, 2016ను మినహాయిస్తే 2011 నుంచి ఏ సంవత్సరమూ 1000కి తక్కువ పరుగులు చేయలేదు. 2018తో పోలిస్తే మాత్రం ఈ సారి కాసిన్ని పరుగులు తక్కువే చేశాడు. అప్పుడు 14 వన్డేల్లో 133.55 సగటుతో 1202 పరుగులు చేశాడు. ఏకంగా 6 శతకాలు బాదేశాడు. అంటే ప్రతి 2 మ్యాచులకు ఒకటి అన్నమాట. ఈ ఏడాది 9 వన్డేలాడినా 47.88 సగటుతో 431 పరుగులే చేశాడు. ఒక్క శతకమూ లేదు. దీన్ని బట్టి అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడని చెప్పొచ్చు. కానీ ఈ ఏడాది కరోనాతో సాధన లేదు. మ్యాచులూ ఎక్కువ జరగలేదు. అయితే అతడి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఏమీ లేదు. ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ ఆరో స్థానంలో ఉన్నాడు. భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీసులో అతడు చేసిన 16, 78, 89 పరుగులు ఎంతో విలువైనవే. మొన్న ఆసీస్‌పై ఎంత కష్టపడి 21, 89, 63 చేశాడో తెలిసిందే. అంటే వన్డేల్లో కింగ్‌ కోహ్లీది తీసికట్టు ప్రదర్శనేమీ కాదు.


టీ20ల్లో  అంతంతే! 

పొట్టి క్రికెట్లో కోహ్లీ సత్తా ఏంటో అందరికీ తెలుసు. ఈ ఏడాది 9 ఇన్నింగ్సుల్లో 36.87 సగటు, 141.82 స్ట్రైక్‌రేట్‌తో 295 పరుగులు చేశాడు. టాప్‌-10లో ఏడో స్థానం పొందాడు. 10+ మ్యాచులాడితే కనీసం 4-7 అర్ధశతకాలు చేసే విరాట్‌ ఈసారి కేవలం ఒక్కటికే పరిమితం అయ్యాడు. రోహిత్‌, ధావన్‌, రాహుల్‌ రాణించడం, మిడిలార్డర్‌లో హార్దిక్‌ పాండ్య ఫినిషింగ్‌లతో అతడిపై కాస్త భారం తగ్గిందనే చెప్పాలి. అయితే గతేడాది 10 మ్యాచుల్లో 5 అర్ధశతకాలతో 466 చేసిన అతడు ఈ సారి మాత్రం అందులో మూడోవంతే చేశాడు. ఈ ఏడాది టాప్‌-7లో నిలిచాడంటే కోహ్లీ దారుణంగా ఏమీ ఆడలేదనే అర్థం. కానీ తాను నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం చూస్తే పేలవమే అనొచ్చు! కరోనా వల్ల జనవరిలో న్యూజిలాండ్‌పై చేసిన అత్యధిక స్కోరు (45) దాటేందుకు అతడు డిసెంబర్‌ వరకు ఎదురుచూడాల్సి రావడం గమనార్హం. ఇక ఈ ఏడాది టెస్టుల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆసీస్‌తో గులాబి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 74 తప్ప మిగతా 5 ఇన్నింగ్సుల్లో ఎప్పుడూ 19 దాటలేదు. మొత్తంగా ఈ ఏడాది 3 టెస్టుల్లో 19.33 సగటుతో 116 పరుగులే చేశాడు.


ఐపీఎల్‌లో అంచనాలు అందుకున్నాడా?

అంతర్జాతీయ టీ20ల్లో రాణించని కోహ్లీ.. ఐపీఎల్‌-2020లో మాత్రం ఫర్వాలేదనిపించాడు. 15 మ్యాచుల్లో 3 అర్ధశతకాలు, 42.36 సగటు, 121.35 స్ట్రైక్‌రేట్‌తో 466 పరుగులు చేసి టాప్‌-9లో నిలిచాడు. ఒక సాధారణ ఆటగాడిగా ఈ స్కోరు ఎక్కువే అయినా విరాట్‌కు మాత్రం తక్కువే. ఎందుకంటే అతడికన్నా ఒక మ్యాచ్‌ తక్కువే ఆడిన కేఎల్‌ రాహుల్‌ 670తో టోర్నీలో ఆరెంజ్‌ క్యాప్‌ గెలుచుకోవడం గమనార్హం. బెంగళూరు ఆడిన ఆఖరి 4 మ్యాచుల్లో అతడి అత్యధిక స్కోరు 29. నిజానికి ఇవన్నీ చాలా కీలక మ్యాచులు. అతడు అద్భుతంగా ఆడివుంటే ఆర్‌సీబీ టాప్‌-2లో నిలిచేది. దిల్లీతో జరిగిన ఆఖరి లీగు మ్యాచులోనూ కోహ్లీ అర్ధశతకం చేయలేకపోయాడు. ఎలిమినేటర్లోనూ 6 పరుగులతో నిరాశపరిచాడు. ఒకప్పటి తెగువ, దూకుడు, చురుకుదనం కోహ్లీలో ఈ ఐపీఎల్‌లో కనిపించలేదు.


నాయకుడిగా విమర్శలు

కరోనా వల్ల తక్కువ మ్యాచులే ఆడటం వల్ల ఈ ఏడాది ఎక్కువ రికార్డులు బద్దలుకొట్టే అవకాశం విరాట్‌కు దక్కలేదు. అయితే అత్యంత వేగంగా వన్డేల్లో 12వేల పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మరోవైపు అంతర్జాతీయ కెరీర్లో 22వేల పరుగుల మైలురాయినీ అధిగమించాడు. ఒక్కటైనా చేసుంటే రికీ పాంటింగ్‌ శతకాల రికార్డు బద్దలయ్యేది. టెస్టు క్రికెట్లో 25 సార్లు టాస్‌ గెలిచిన కోహ్లీసేనకు ఒక్కసారీ ఓటమి ఎదరవ్వలేదు. 21 విజయాలు సాధించగా 4 డ్రా చేసుకుంది. గులాబి టెస్టుతో ఆ రికార్డుకు బ్రేక్‌ పడింది. ఇక అతడి సారథ్యంలోనే అత్యధిక స్కోరు (759/7డిక్లేర్‌) సాధించిన టీమ్‌ఇండియా అత్యల్ప స్కోరు (36/9)తో అప్రతిష్ఠ మూటగట్టుకుంది. ఇక నాయకుడిగానూ అతడు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. బెంగళూరు ఆటగాళ్లకే జట్టులో చోటిస్తూ ఆశ్రిత పక్షపాతం చూపిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. మరోసారి రోహిత్‌ ఐపీఎల్‌ టైటిల్‌ గెలవడంతో కోహ్లీ స్థానంలో అతడికి వన్డే, టీ20 జట్టు పగ్గాలు ఇవ్వాలన్న సెగ ఎదుర్కొన్నాడు. రాబోయే జనవరిలో తండ్రి కాబోతుండటం అతడికి సంతోషాన్ని ఇస్తుండగా.. ఘోర ఓటమితో ఏడాది ముగించడం బాధాకరం.

-ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన