ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా? 
Array ( ) 1

కథనాలు

Published : 16/12/2020 09:17 IST

ముళ్లను దాటి ‘గులాబీ’ని ముద్దాడేనా? 

ఏడు విజయాల కంగారూలతో కోహ్లీసేనకు కష్టమే

వన్డే సిరీసులో 1-2తో పరాజయం. టీ20ల్లో 2-1తో విజయ దరహాసం. లెక్క సరికావడంతో ఇప్పుడు అందరి చూపూ టెస్టు క్రికెట్‌పై పడింది. ఆటగాడి టెక్నిక్‌, సహనం, సామర్థ్యానికి పరీక్షపెట్టే సుదీర్ఘ ఫార్మాట్‌కు భారత్‌, ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. సొంతగడ్డ.. నైపుణ్యమున్న పేసర్లు.. లైన్‌కు భిన్నంగా ఆడగలిగే స్మిత్‌.. గులాబి టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ఆసీస్‌ సొంతం. అలాంటిది ఒకే డే/నైట్‌ టెస్టు అనుభవం ఉన్న కోహ్లీసేన ఆతిథ్య జట్టుకు సవాల్‌ విసిరేనా? 


గులాబి సవాళ్లు

అందమైన గులాబి పువ్వుకు ముళ్లున్నట్టే డే/నైట్‌ టెస్టులో గులాబి బంతిని ఎదుర్కోవాలంటే సవాళ్లు తప్పవు. ఎందుకంటే పింక్‌ చెర్రీతో ఆట సులువేమీ కాదు. సాధారణంగా ఆటగాళ్లంతా పగటి పూట ఎరుపు బంతి ఆడేందుకు అలవాటు పడి ఉంటారు. దాని స్వింగ్‌, సీమ్‌, స్పిన్‌, బౌన్స్‌ వంటి అంశాలపై అవగాహన ఉంటుంది. చేతి-కంటి సమన్వయం బాగుంటుంది. గులాబి బంతితో ఇవన్నీ కాస్త భిన్నంగా ఉంటాయి. రెడ్‌ చెర్రీతో ఉదయం అద్భుతమైన స్వింగ్‌ లభిస్తుంది. పిచ్‌పై పచ్చికలో తేమ బాగుంటే బౌలర్లు పండగ చేసుకుంటారు. డే/నైట్‌ మధ్యాహ్నం మొదలవుతుంది కాబట్టి అప్పుడు గులాబితో స్వింగ్‌ రాబట్టడం కష్టం. సాయంత్రం బంతి పక్కకు జరగడం మొదలవుతుంది. అప్పుడు బంతిని స్పష్టంగా చూడటంలో ఆటగాళ్లు ఇబ్బందులు పడతారు. సూర్యుడి నారింజ రంగు కాంతి, ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్ ఇబ్బందికరంగా మారుతుంది. క్యాచులు పట్టుకోవడం కష్టమవుతుంది. అయితే రాత్రిపూట గులాబి బంతి స్వింగ్‌ అద్భుతంగా ఉంటుందన్నది పేసర్ల మాట.


ఆసీస్‌ జైత్రయాత్ర

గులాబి బంతితో ఆడటంలో ఆసీస్‌ను మించిన జట్టు మరోటి లేదు. 2015 నుంచి వారు డే/నైట్‌ టెస్టు ఆడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఏడు పింక్‌ టెస్టులు ఆడితే అన్నింట్లోనూ విజయం వారినే వరించింది. ఒక్క ప్రత్యర్థి జట్టూ వారికి గట్టి పోటీనిచ్చిందే లేదు. తొలి గులాబి పోరులో కివీస్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది ఆసీస్‌. హేజిల్‌వుడ్‌ 9 వికెట్లతో చెలరేగాడు. టామ్‌ లేథమ్‌, స్టీవ్‌స్మిత్, పీటర్‌ నెవిల్‌ అర్ధశతకాలు సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో పోరులో 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. డుప్లెసిస్‌ శతకం సాధించాడు. ఆసీస్‌ పేసర్లు మిచెల్‌స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ మళ్లీ చెలరేగారు. ఖవాజా శతకం చేయగా స్మిత్‌, హ్యాండ్స్‌కాంబ్‌ అర్ధశతకాలతో మెరిశారు. మూడోసారి మాత్రం పాకిస్థాన్‌ నుంచి పోటీ ఎదురైంది. 489 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో ఛేదనకు దిగిన పాక్‌ 450కి ఆలౌటైంది. మరికాస్త పోరాడి ఉంటే విజయం సొంతమయ్యేది. ఇంగ్లాండ్ పోరులోనూ మార్పేమీ లేదు. యాషెస్‌లో భాగంగా 2018లో జరిగిన ఈ మ్యాచులో కంగారూ జట్టు‌ 120 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. స్టార్క్‌ (8), లైయన్‌ (6) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు.


పోటీయే లేదు

ఐదో గులాబి పోరుకు ఆసీస్‌ దాదాపుగా ఏడాది విరామం తీసుకుంది. 2019 జనవరిలో గబ్బా వేదికగా శ్రీలంకతో తలపడింది. పేసర్లు చెలరేగిన ఈ మ్యాచులో స్వల్ప స్కోర్లే నమోదయ్యాయి. మొదట లంక 144కి ఆలౌట్‌ కాగా ఆసీస్‌ 323 చేసింది. కమిన్స్‌ (6/23) విజృంభణతో రెండో ఇన్నింగ్స్‌లో లంక 139కే కుప్పకూలింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో గెలిచింది. అదే ఏడాది నవంబర్లో ఆసీస్‌×పాక్‌ రెండో పింక్‌ టెస్టు ఆసక్తికరంగా సాగింది. డేవిడ్‌ వార్నర్‌ త్రిశతకం (335*) చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను‌ 589/3 వద్ద డిక్లేర్‌ చేసింది. స్టార్క్‌ 6/66తో దెబ్బకు పాక్‌ 302కే ఆలౌటైంది. ఫాలోఆన్‌లో 239 మాత్రమే చేయడంతో ఆసీస్‌కు ఇన్నింగ్స్‌ 48 పరుగులతో విజయం లభించింది. ఇక కివీస్‌తో రెండో పోరులో కంగారూలు 296 పరుగుల తేడాతో గెలిచారు. మిచెల్‌ స్టార్క్‌ 9/97తో చెలరేగడమే ఇందుకు కారణం.


బంగ్లాతో 3 రోజులే

ఇక భారత్‌ విషయానికి వస్తే గులాబి బంతితో అనుభవం కేవలం ఒక్క మ్యాచే. అదీ బంగ్లాదేశ్‌తో కావడం గమనార్హం. ఇషాంత్‌ శర్మ (5/22), ఉమేశ్‌ యాదవ్‌ (3/29), షమి (2/36) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా‌ 106కే కుప్పకూలింది. టీమ్‌ఇండియా పేసర్లు ఒక రకంగా ప్రత్యర్థిని వణికించారనే చెప్పాలి. ఇక విరాట్‌ కోహ్లీ (136) శతకం బాదేశాడు. చెతేశ్వర్‌ పుజారా (55), అజింక్య రహానె (51) అర్ధశతకాలు సాధించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 347/9కు డిక్లేర్‌ చేసింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని ఉమేశ్‌ (5/53), ఇషాంత్‌ (4/56) మళ్లీ దెబ్బకొట్టడంతో 195 పరుగులకు ఆలౌటైంది. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ 46 పరుగులతో గెలిచింది. అయితే బంగ్లాలో ముష్ఫికర్‌ రహీమ్‌ (74) పోరాటం ఆకట్టుకుంది. ఇక ఆసీస్‌-ఏతో రెండు గులాబి సన్నాహక మ్యాచుల్లో భారత ఆటగాళ్లు ఆశలు రేపారు. హనుమ విహారి, అజింక్య రహానె, రిషభ్‌ పంత్‌, చెతేశ్వర్‌ పుజారా, మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌గిల్‌ సాధికారికంగా ఆడారు. బౌలర్లూ ఫర్వాలేదనిపించారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన