మ్యాట్‌... ముగ్గులా! - Sunday Magazine
close

మ్యాట్‌... ముగ్గులా!

ఇంటి ముందు రంగు రంగుల్లో తీర్చిదిద్దిన పూల ముగ్గు ఉంటే ఎంత బాగుంటుందో... అయితే, ఎప్పుడో పెద్ద పండగలప్పుడంటే అలా వేసుకుంటాం కానీ రోజూ అంటే అంత తీరికా, ఓపికా ఉండదు. అలా అని ఇంటి అందం విషయంలోనూ రాజీ పడనక్కర్లేదు. ఎందుకంటే... ఇప్పుడు గుమ్మం ముందు వేసే మ్యాట్‌లే చూడచక్కని ముగ్గుల రూపంలో వచ్చేస్తున్నాయి. ‘రంగోలీ మ్యాట్‌ అండ్‌ కార్పెట్‌’ పేరుతో దొరుకుతున్న వీటిని రంగు రంగుల ఊలుతో పూల ముగ్గుల డిజైన్‌లో తయారుచేస్తారు. దాంతో ఇవి పూరేకులతో తీర్చిదిద్దిన రంగవల్లుల్లానే దర్శనమిస్తాయి. ఇంటికి అందాన్ని తెస్తాయి.


కేకులో కానుక!

పుట్టినరోజు, పెళ్లిరోజులకు ఆత్మీయుల కోసం కేకు తెప్పించి కోయిస్తాం. తర్వాత వాళ్లను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఏదో ఒక కానుకనూ ఇస్తాం. మరి, ఆ బహుమతి కేకులోంచే దానంతటదే బయటికొస్తే... ఇంకా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది కదా... మీరూ అలా థ్రిల్‌ చెయ్యాలను కుంటున్నారా... అయితే ఈ ‘మ్యూజికల్‌ పాపింగ్‌ కేక్‌ స్టాండ్‌’ని తెప్పించుకోండి. ఈ స్టాండు కిందిభాగంలో ఉండే రింగుని లాగితే దీన్లో ఇమిడి ఉండే గొట్టంలాంటి నిర్మాణం పైకి వస్తుంది. అందులో మనం ఫోను, ఉంగరం... ఇలా, ఇవ్వాలనుకునే కానుకను ఉంచి రింగుని వెనక్కి నెట్టేస్తే గొట్టం మళ్లీ లోపలికి వెళ్లిపోతుంది. తర్వాత స్టాండుపైన కేకుని ఉంచితే సరి. ఆత్మీయులు స్టాండ్‌ రింగుని లాగగానే సంగీతం వినిపిస్తూ కేకులోంచి కానుక ఉన్న డబ్బా పైకి వచ్చి వాళ్లను ఆశ్చర్యపరుస్తుంది. బాగుంది కదా..!


పేరుని ముద్రించేయొచ్చు!

డాదీ రెండేళ్ల తేడాతో ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే యూనిఫామ్‌, రుమాళ్లు, సాక్సుల్లాంటివన్నీ ఒకేలా ఉండి మారిపోతుంటాయి. స్కూల్లోనూ వాటర్‌ బాటిళ్లూ బ్యాగుల్లాంటివి వేరే పిల్లలవాటితో కలిసిపోతుంటాయి. అలాంటప్పుడు వారి దుస్తులమీదా, బాటిళ్లూ, కంబాక్సుల పైనా పిల్లల పేరుని ముద్రించేస్తే ఏ గందరగోళమూ ఉండదు. అందుకోసం వస్తున్నవే ఈ ‘కస్టమైజ్డ్‌ బేబీ నేమ్‌ స్టాంప్స్‌’. ఆన్‌లైన్‌లో దొరుకుతున్న వీటిని ఆర్డరిచ్చేముందు మన పిల్లల పేరుని అక్కడ నమోదు చేస్తే ఆ వివరాలతోనే బుల్లి స్టాంప్‌ మెషీన్‌ ఇంటికి వస్తుంది. ఇంకు కూడా దీన్లోనే ఉంటుంది. ఈ స్టాంపుని షర్టుమీద పెట్టి నొక్కితే ఫొటోలో చూపినట్లూ చిన్నారి పేరు దానిమీద ప్రింట్‌ అయిపోతుంది. రెడీమేడ్‌ షర్టులమీద బ్రాండ్‌ల పేర్లున్నట్లే ఇవీ ఎప్పటికీ చెరిగిపోవు. మెషీన్‌లో ఇంకు అయిదారొందలసార్లు వాడుకోవడానికి పనికొస్తుంది. మళ్లీ కావాలంటే విడిగా దీనికోసం దొరికే ఇంకు కొని పోసుకోవచ్చు. ప్లేస్కూలుకి వెళ్లే పిల్లలకి సరిగా మాటలు కూడా రావు. అలాంటప్పుడు అనుకోకుండా వాళ్లు తప్పిపోయినా సమాచారం అందేలా కొందరు తల్లిదండ్రులు షర్టు కాలర్‌ దగ్గర పిల్లల పేర్లతో పాటు ఫోన్‌ నంబర్‌ని కూడా కలిపి ఇలా స్టాంప్‌ వేస్తున్నారు. మంచి ఆలోచన కదూ..!


గౌను కాదు టవల్‌!

దివరకంటే ఇంట్లో ఏది ఎలా ఉన్నా పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఈ అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగాక వంటగది కూడా హాలులా అందంగా మెరిసిపోవాలనుకుంటున్నారు జనం. అందుకే, అక్కడ వాడే వంట సామగ్రి, ఇతర వస్తువులు కూడా రంగు రంగుల్లో విభిన్నమైన ఆకారాల్లో వస్తున్నాయి. ఇప్పుడేమో మరో అడుగు ముందుకేసి చేతులు తుడుచుకునే టవళ్లను కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు తయారీదారులు. అవును, ఇక్కడ పిల్లల గౌనుల్లా కనిపిస్తున్నవి టవళ్లే. ఇలా బుల్లి బుల్లి గౌనుల్లా వస్తున్న ఇవి హ్యాంగర్లకు తగిలించుకునేందుకూ వీలుగా ఉంటాయి. వంట గదిలోనే కాదు, డైనింగ్‌ టేబుల్‌ దగ్గరున్న సింకు దగ్గరైనా ఈ ‘ఫ్రాక్‌ హ్యాండ్‌ టవళ్ల’ను తగిలిస్తే ఇంటికొచ్చిన అతిథులు కూడా ‘భలే కొత్తగా ఉన్నాయే’ అనుకోవాల్సిందే.


 

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న