ఐస్‌క్రీమ్‌... కొత్త రూపాల్లో..! - Sunday Magazine
close

ఐస్‌క్రీమ్‌... కొత్త రూపాల్లో..!

వావ్‌... చికెన్‌ డ్రమ్‌స్టిక్‌ అనుకుంటూనో, పిజ్జా అదుర్స్‌ అనుకునో, ఎమ్మీ ఎమ్మీ కేక్‌ అంటూనో రెట్టించిన ఉత్సాహంతో వాటిని అమాంతం కొరికారనుకోండి... ఒక్కసారిగా పళ్లు జివ్వుమనడం... ఆపై అవి కారి మీ బట్టలు ఖరాబవడం ఖాయం. ఎందుకంటే అవన్నీ అచ్చం వాటిలా తయారుచేసిన ఐస్‌క్రీమ్స్‌. నిజమండీ బాబూ... ఐస్‌క్రీమ్‌ని అచ్చుగుద్దినట్లుగా మరో ఫుడ్‌లా చేయడమే తాజా ట్రెండ్‌ మరి!

స్‌క్రీమ్‌ని చూస్తే తినకుండా ఉండటం ఎవరికైనా కష్టమే. అందుకేనేమో దానికి ఎప్పటికప్పుడు కొత్త ఫ్లేవర్లు అద్దేస్తూ మరింత రుచిగా తయారుచేస్తుంటారు. అక్కడితో ఆగితే చెప్పేదేముందీ, దాన్ని సేమ్యా, పాస్టా, ఫ్లేక్స్‌, బాల్స్‌... ఇలా భిన్న రూపాల్లోనూ రూపొందిస్తున్నాయి కొన్ని కంపెనీలు. అయితే ఇప్పుడు అసలది ఐస్‌క్రీమేనా అన్న అనుమానం వచ్చేలా చేయడమే నయా ట్రెండ్‌ అంటున్నారు కొందరు షెఫ్‌లు. అందులో భాగంగా వస్తున్నవే ఈ చికెన్‌ డ్రమ్‌స్టిక్‌, పిజ్జా, కేక్‌ ఐస్‌క్రీమ్స్‌.

ఈ మధ్య రెండుమూడు దేశ విదేశీ రుచుల్ని జోడించి ఫ్యూజన్‌ ఫుడ్స్‌ తయారుచేసి, వాటిని ఇన్‌స్టాల్లో పోస్టు చేసే ట్రెండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కావచ్చు... సౌత్‌ కరోలినాలోని చార్లెస్టన్‌లో ‘లైఫ్‌ ర్యాఫ్ట్‌ ట్రీట్స్‌’ను నిర్వహిస్తోన్న సింథియా వాంగ్‌కి వచ్చిన క్రేజీ ఆలోచనే ఈ చికెన్‌ ఐస్‌క్రీమ్‌. తక్షణం దాన్ని అమల్లో పెట్టి ఐస్‌క్రీమ్‌ను చికెన్‌ పీస్‌ల రూపంలో ఫ్రీజ్‌ చేసేసి, ఆపై వాటిమీద వేఫల్స్‌ ఫ్లేక్స్‌ను అద్దేసిందట. చికెన్‌ ముక్కల్లా తయారైన వాటిని చూసి తన కళ్లను తానే నమ్మలేక పోయిందట. ఇంకేముందీ... వాటిని కోడి బొమ్మ ఉన్న డబ్బాలో ప్యాక్‌ చేసి ‘నాట్‌ ఫ్రైడ్‌ చికెన్‌, ఐస్‌క్రీమ్‌’ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టగానే ఈ కొత్త రకం చికెన్‌ ఐస్‌క్రీమ్‌ కోసం ఆర్డర్లు క్యూ కట్టాయట. అది కాస్తా పాపులర్‌ అయిపోవడంతో మరికొన్ని కంపెనీలు దీన్ని తయారుచేసేందుకు ప్రయత్నం చేసేస్తున్నాయట.

అలాగే పిజ్జాని చీజ్‌, డీలక్స్‌ వెజ్జీ, పెప్పీ పనీర్‌, మార్గరిటా, డబుల్‌ చీజ్‌... వంటి విదేశీ రుచులతోపాటు చట్‌పటా పనీర్‌, పావ్‌బాజీ, తందూరీ పనీర్‌, ఊతప్పం... ఇలా దేశీయ రుచుల్లోనూ చేయడం తెలిసిందే. ఎలా చేసినా వాటిల్లో పిజ్జా బేస్‌ తప్పనిసరి. కానీ ఆ బేస్‌ లేకుండా అచ్చంగా ఐస్‌క్రీమ్‌తోనే పిజ్జా చేస్తే ఎలా ఉంటుందీ అనుకున్నారు కొందరు ఐస్‌క్రీమ్‌ ప్రియులు... ఫలితమే ఈ పిజ్జా ఐస్‌క్రీమ్స్‌. ఐస్‌క్రీమ్‌కి ఓరియో బిస్కట్లూ కుకీలూ కలిపి పిజ్జా చేయడంతో దాన్ని ఎంతో ఇష్టంగా చప్పరించేస్తున్నారు ఈతరం ఫుడీలు.

ఇక, సందర్భం ఏదయినా కేకు కట్‌ చేయడం నేటి యువతకి ఓ సంప్రదాయంగా మారిపోయింది. ఆ కేక్‌ ఏదో మనమే తయారుచేస్తే పోలా అనుకున్నట్లున్నాయి కొన్ని ఐస్‌క్రీమ్‌ కంపెనీలు. అలా వస్తున్నవే ఈ ఐస్‌క్రీమ్‌ కేక్స్‌. నిజానికి క్వాలిటీ వాల్స్‌, అమూల్‌... వంటి కంపెనీలు కేక్‌ పీస్‌ని తలపించేలా చేసే కసాటా ఐస్‌క్రీమ్‌ మార్కెట్లో ఎప్పటినుంచో ఉంది. కానీ ఇటీవల బాస్కిన్‌ రాబిన్స్‌, హేవ్‌మోర్‌... వంటి సంస్థలు కేకుల్ని మరపించేలా ఐస్‌క్రీమ్స్‌ చేస్తున్నాయి. కోసిన వెంటనే కేకు ముక్క కరిగిపోకుండా తినడంలోనే ఉంటుంది అసలు మజా. సో... ఐస్‌క్రీమ్‌ని ఏ రూపంలో తినాలనుకుంటున్నారో ఛాయిస్‌ మీదే సుమా!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న