ఆ ముస్లింలకు స్వామి ఇంటి అల్లుడు! - Sunday Magazine
close

ఆ ముస్లింలకు స్వామి ఇంటి అల్లుడు!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వేంకటేశ్వరస్వామిని కలియుగ దైవంగా పూజిస్తే... కడపలో కొలువైన ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వర స్వామిని అల్లుడిగా, బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు ఇక్కడ ఉండే ముస్లింలు. అందుకే ఉగాది రోజున చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ముస్లింలు ఈ ఆలయానికి వచ్చి స్వామికీ, అమ్మవారికీ పూజలు చేసి కానుకలు సమర్పించడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. తిరుమలకు తొలి గడపగా భావించే ఈ మహిమాన్వితమైన క్షేత్రానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది.

తిరుమలలోని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందుగా కడపలోని ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వరుడిని చూడాలని అంటారు. స్వామికి ఏదయినా మొక్కుకుని తిరుమల వరకూ వెళ్లలేని వారు ఆ ముడుపుల్ని ఈ ఆలయంలో చెల్లించినా సరిపోతుందనేది భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలోని గర్భగుడిలో స్వామి విగ్రహంతోపాటూ హనుమంతుడినీ దర్శించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఏటా ఉగాది నాడు కడపలో ఉండే ముస్లింలు ఈ ఆలయానికి వచ్చి బీబీనాంచారమ్మకూ, వేంకటేశ్వరుడికీ కానుకలూ, ముడుపులూ చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి తొలి గడపగా పరిగణించే ఈ మహిమాన్వితమైన క్షేత్రానికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

స్థలపురాణం

హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడిలో ప్రసన్న లక్ష్మీవేంకటేశ్వరుడితోపాటు హనుమంతుడి విగ్రహాన్ని కూడా దర్శించుకోవచ్చు. అదెలా జరిగిందంటే... ఒకప్పుడు కృపాచార్యుడు అనే గురువు తిరుమలలోని స్వామిని దర్శించుకునేందుకు బయలు దేరుతూ మార్గమధ్యంలో ఈ ప్రాంతంలో ఆగాడట. అప్పటికే భక్తులు ఇక్కడ ఉన్న ఆలయంలోని హనుమంతుడిని పూజించే వారట. ఆ స్వామిని దర్శించుకున్న కృపాచార్యుడు తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాలనుకున్నప్పుడు ఎన్నోఆటంకాలు ఎదురయ్యాయట. వాటిని అధిగమించేందుకు వేంకటేశ్వరస్వామిని పూజించిన కృపాచార్యుడు మళ్లీ తన ప్రయాణం ప్రారంభించే ముందు స్వామి విగ్రహాన్ని కూడా ఈ ఆలయంలోని గర్భగుడిలో ప్రతిష్ఠించాడట. అప్పటినుంచీ కాశీ, రామేశ్వరం, తిరుమల వెళ్లే యాత్రికులు మార్గంలో ఇక్కడున్న స్వామిని దర్శించు కోవడం మొదలుపెట్టారనీ, ఇప్పటికీ కొంతమంది దాన్ని పాటిస్తున్నారనీ అంటారు. కృపాచార్యుడు స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కృపాపురం అని పిలిచినా కాలక్రమంలో అదే కడపగా మారిందట. ఈ ఆలయాన్ని విజయనగర రాజులతోపాటూ ఎంతోమంది అభివృద్ధి చేశారనీ, స్వామికి ఎన్నో కానుకలు సమర్పించారనీ ఇక్కడున్న శాసనాలు చెబుతున్నాయి. తాళ్లపాక అన్నమాచార్యుడు ఈ స్వామిపైనా పన్నెండు కీర్తనలు రచించాడనడానికీ ఇక్కడ ఆధారాలున్నాయి. జనమేజయుడు ఈ స్థలాన్ని తిరుమలకు ఉత్తర ద్వారంగా ప్రకటించి ఇక్కడ ఒక అగ్రహారాన్ని కూడా నిర్మించాడట. ఏ కారణంతోనైనా తిరుమలకు వెళ్లలేని వారు తిరుమలేశుని ఉత్తర గడప అయిన ఈ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకోవచ్చని చెబుతారు.

మతాలకు అతీతంగా

స్వామిని వివాహమాడిన బీబీనాంచారమ్మను తమ ఇంటి ఆడపడుచుగా భావించే ముస్లింలు ఏటా ఉగాది రోజున ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారితోపాటు స్వామికి కూడా భక్తిశ్రద్ధలతో పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. తితిదే పరిధిలో ఉన్న ఈ ఆలయంలో ఏటా మాఘ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు అంగరంగ వైభవంగా స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. రథసప్తమి నాడు సాగే రథోత్సవాన్ని చూసేందుకు లక్ష మందికి పైగా భక్తులు రావడం విశేషం. స్వామికి నిర్వహించే కల్యాణోత్సవం, పుష్పయాగాదులు కన్నుల పండగ్గా ఉంటాయి. అదే విధంగా చెన్నకేశవమూర్తి విగ్రహంతోపాటు, నిలువు నామాలున్న తాండవ గణపతి, బంగారు బల్లి, పుష్కరిణి, ఈ మధ్యే నిర్మించిన అద్దాల మందిరం ఈ ఆలయంలో ఉన్న అదనపు ఆకర్షణలు.

ఎలా చేరుకోవాలి

ఈ ఆలయం కడప విమానాశ్రయం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో, కడప రైల్వేస్టేషన్‌ నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడినుంచి బస్సులూ, ప్రయివేటు వాహనాల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. బస్టాండుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

- జి.రాజేష్‌గౌడ్‌, ఈనాడు, కడప


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న