అలల మీద తేలే అందాల పల్లె! - Sunday Magazine
close

అలల మీద తేలే అందాల పల్లె!

నీలి సముద్రం మధ్యలో కొండను ఆనుకుని కట్టిన ముచ్చటైన ఇళ్లతో ప్రకృతి ఒడిలో ఒదిగిపోయినట్టున్న ఈ ఊరు... దూరం నుంచి అందాల దీవిలో ఉన్నట్టు కనిపిస్తున్నా అది వెలిసింది మాత్రం అచ్చంగా కర్రలూ, స్తంభాలపైనే. అలలపైన తేలే ఈ ఫ్లోటింగ్‌ విలేజ్‌ ‘కో పన్యి’ థాయ్‌లాండ్‌లో ఉంది. సుమారు 200 ఏళ్ల క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సాగరం మధ్యలో ఇలా కర్రల సాయంతో ఇళ్లు కట్టుకుని, చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడ ఉంటున్నాయి. మెల్లగా ఇల్లు పక్కన ఇల్లు చేరడంతో 300 ఇళ్లూ, 1500 జనాభాతో గ్రామంగా ఏర్పడింది. ఊరంటే బడి ఉండాలి, గుడి ఉండాలి అనుకుంటాం కదా. అందుకే కో పన్యి ప్రజలు... నీటిపైనే సకలసౌకర్యాల్నీ ఏర్పాటుచేసుకున్నారు. దుకాణ సముదాయాలూ, పిల్లల కోసం స్కూల్‌, ప్లే గ్రౌండ్‌, ఫ్లోటింగ్‌ ఫుట్‌బాల్‌ పిచ్‌... ఇలా అన్నీ ఉన్నాయక్కడ. ఏదైనా అవసరం ఉంటే ఊరి ప్రజలు పడవల ద్వారా తీరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ తేలే ఊరికి పర్యటకుల తాకిడీ ఎక్కువేనండోయ్‌!


ఫొటోఫీచర్‌

ప్రకృతికి పచ్చల హారమేసినట్లు ఎటు చూసినా పచ్చదనం... ఆ మధ్యలో వెండి వెన్నెలతో పోటీ పడుతున్నట్లుగా ధవళవర్ణంలో జాలువారుతున్న జలపాతం... చూస్తుంటేనే రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోవాలన్నట్లుంది కదూ ఈ చోటు. ఇది ఇండోనేషియాలోని ‘టెగెనుంగన్‌’ గ్రామంలో ఉంది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతాన్నీ ఇక్కడి ప్రకృతి రమణీయతనూ చూసేందుకు ఎక్కడెక్కడినుంచో పర్యటకులు వస్తుంటారట.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న