ఆ రాత్రంతా నిద్రపోలేదు! - Sunday Magazine
close

ఆ రాత్రంతా నిద్రపోలేదు!

అక్కినేని నట వారసుడిగా నాగ చైతన్యకు ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు. త్వరలో ‘లవ్‌స్టోరీ’, ‘థాంక్యూ’, ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో అలరించనున్న చై తన కుటుంబం, అలవాట్లూ, ఆసక్తులూ, ఇష్టాయిష్టాల గురించి చెబుతున్నాడిలా...


ఏదయినా తనతోనే...

చిన్నప్పటి నుంచీ రానా నాకు బెస్ట్‌ఫ్రెండ్‌ కన్నా ఎక్కువ. నేను చెన్నైలో ఉన్నప్పుడు సెలవులకు తను అక్కడికి వచ్చేవాడు. నేను కూడా కేవలం రానాని కలిసేందుకే అప్పుడప్పుడూ హైదరాబాద్‌ వచ్చేవాడిని. ఆ అనుబంధం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. నాకు సంబంధించిన ఏ విషయాన్నయినా తనతోనే చెప్పుకుంటా. అవకాశం వస్తే రానాతో కలిసి నటించాలని ఉంది.


ఆదివారం నాకు నచ్చినట్లుగా

నాకు ఫలానా వంటకాలే తినాలనేం లేదు కానీ ఎదురుగా చైనీస్‌ వంటకాలు ఉంటే మాత్రం ఆగలేను. అలాగే వారం మొత్తం డైటింగ్‌ విషయంలో కఠినంగా ఉన్నా ఆదివారం కోసం గురువారం, శుక్రవారం నుంచే ఎదురుచూస్తుంటా. ఆ రోజున చీట్‌ డే పేరుతో నాకు నచ్చిన పదార్థాలన్నీ లాగించేస్తుంటా. పైగా ఆ రోజున లంచ్‌, డిన్నర్‌లో ఏం తినాలనేది ముందే ఆలోచించి పెట్టుకుంటా.


‘ప్రేమమ్‌’ వద్దన్నారు

నేను చేసిన సినిమాల్లో నాకు ‘ప్రేమమ్‌’ అంటే చాలా ఇష్టం. దాన్ని చేయాలనుకున్నప్పుడు కొందరు ‘ఆ సినిమా చేయకపోవడమే మంచిది, టైంవేస్ట్‌’ అన్నారు. కానీ మలయాళంలో ఆ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఎవరెన్నిరకాలుగా చెప్పినా చేసేందుకేసిద్ధమయ్యా. చివరకు అది నాకు మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది.


ఆ సినిమాలంటే ఇష్టం

నాన్న సినిమాల్లో నాకు ‘శివ’, ‘నిన్నే పెళ్లాడతా’ అంటే చెప్పలేనంత ఇష్టం. మావయ్య సినిమాల్లో అయితే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’. ఈ సినిమాలని ఎన్నిసార్లు చూసినా నాకు అస్సలు బోర్‌కొట్టవు.


అఖిల్‌ నేనూ కలిస్తే..

మేమిద్దరం ఒక్కచోట చేరామంటే సినిమా కబుర్ల కన్నా బైక్‌లూ, కార్లూ, రేసింగ్‌, క్రికెట్‌ వంటి విషయాల గురించే మాట్లాడుకుంటాం.


భక్తి..

దేవుడిని నమ్ముతా కానీ నాకు అది కావాలీ, ఇది కావాలీ అని మాత్రం కోరుకోను. కేవలం నాకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునే శక్తి మాత్రం ఇవ్వమని వేడుకుంటానంతే.


నాన్న మాటలు దారి చూపాయి..

ప్పుడు నాకు సంబంధించిన ప్రతి వార్తనూ తేలిగ్గా తీసుకుంటున్నా కానీ... ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో మాత్రం విపరీతంగా ఆలోచిస్తూ నిద్రపోయేవాడిని కాదు. ‘జోష్‌’ చేస్తున్నప్పుడు... నేను ఓ నటితో చనువుగా ఉన్నానంటూ వార్త రాశారు. అది చూసి కంగారుపడి ఆ రాత్రంతా నిద్రపోలేదు. తెల్లవారు జామున నాన్న ఎందుకో నిద్రలేచి వచ్చి చూస్తే - విషయం చెప్పా. నాన్న వెంటనే ‘ఒక నటుడిగా నీకు గుర్తింపు వచ్చేకొద్దీ ఇలాంటి గాసిప్స్‌ కూడా పెరుగుతాయి. వాటిని తేలిగ్గా తీసుకోవడం అలవాటు చేసుకో’మని చెప్పారు. అప్పటి నుంచీ అలాంటివి చూసి నవ్వడం అలవాటు చేసుకున్నా.


‘మనం’ మర్చిపోలేను

మా కుటుంబమంతా కలిసి నటించిన సినిమా ‘మనం’. అందుకే నాకు ఆ సినిమా, షూటింగ్‌ సమయంలో ఎదురైన అనుభవాలూ ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ‘మనం’ మొదటిరోజు షూటింగ్‌ సమయంలో సగం రోజు రిహార్సల్స్‌కే సరిపోయింది. ఇదే కొనసాగితే ఆ రోజు ప్యాక్‌-అప్‌ చెప్పేయాల్సి వస్తుందని అనుకుంటున్న సమయంలో నాన్న వచ్చారు. అప్పుడు ఎలాగోలా ఆ సీన్లను పూర్తి చేయగలిగా.


అమ్మను బతిమాలేవాడిని

చిన్నప్పటినుంచీ నాకు రేసింగ్‌ అంటే ఇష్టం. కానీ అమ్మ మాత్రం టీవీ చూసేందుకు కేవలం గంట మాత్రమే అనుమతి ఇచ్చేది. నేనేమో మరో గంట రేసింగ్‌ చూస్తానంటూ బతిమాలేవాడిని. రేసింగ్‌పైన ఆ ఇష్టం వయసుతో పాటు పెరిగిందే తప్ప తగ్గలేదు.  ఆ ఇష్టంతోనే నేను ఆరాధించే బ్రిటిష్‌ ఫార్ములా వన్‌ రేసింగ్‌ డ్రైవర్‌ డేవిడ్‌ కూల్‌థార్ట్‌ని కలిసి, ఆయన నడిపే ఫార్ములావన్‌ కారులో కూడా కూర్చుని మురిసిపోయా.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న