చిన్నారులకో దేవుడి బొమ్మ..! - Sunday Magazine
close

చిన్నారులకో దేవుడి బొమ్మ..!

చిన్నపిల్లలకు కథలన్నా బొమ్మలన్నా ఎంతో ఇష్టం. అందులోనూ సుతిమెత్తగా ఉండే సాఫ్ట్‌టాయ్స్‌ అంటే ఇంకా ఇష్టం. నిద్రపోతున్నా ఆడుకుంటున్నా తమకిష్టమైన బొమ్మ పక్కన ఉండాల్సిందే. అందుకే సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైన దేవతల్నీ ఆ బొమ్మల రూపంలోనే పరిచయం చేస్తున్నారు ఈతరం తల్లిదండ్రులు.

కప్పుడు ఇంట్లోని పెద్దవాళ్లు పిల్లలకు పురాణాల్ని కథలుగా చెబుతూ అందులోని పాత్రల్ని చక్కగా వర్ణించేవారు. వినాయకుడికి తొండం ఉంటుందనీ, ఆయన్ని పూజిస్తే అంతా శుభం కలుగుతుందనీ, హనుమంతుడు ఎంతో శక్తిమంతుడనీ సముద్రాన్ని అవలీలగా దాటేశాడనీ, చిన్నికృష్ణుడికి వెన్న అంటే ఎంతో ఇష్టమనీ... ఇలా ఒక్కో పాత్ర గురించీ వివరంగా చెప్పేవారు. అయితే ఇప్పుడు చిన్నకుటుంబాలు కావడం, ఇద్దరూ ఉద్యోగాలతో తీరిక లేకపోవడంతో తల్లితండ్రులకు ఆ పురాణాల గురించి చెప్పే తీరికా ఓపికా ఉండటం లేదు. అందుకే ఆ పురాణ పాత్రల్నే బొమ్మలుగా మలిచి విక్రయించాలన్న ఆలోచన వచ్చింది అమెరికాలో స్థిరపడ్డ అవని సర్కార్‌, విరాల్‌ మోదీ అనే అన్నాచెల్లెళ్లకి. తమ పిల్లలకి భారతీయ సంస్కృతిని పరిచయం చేయాలన్న ఆలోచనతో ‘మోదీ టాయ్స్‌’ పేరుతో
దేవతల సాఫ్ట్‌టాయ్స్‌ను మొట్టమొదట రూపొందించారు.

ఈ బొమ్మల ద్వారా కేవలం ఆయా పాత్రలు పరిచయమవ్వడమే కాదు, అవి కొన్ని మంత్రాల్ని చదివేలానూ వాటిని డిజైన్‌ చేశారట. బటన్‌ ఆన్‌ చేయగానే వినాయకుడు జయ జయ గణేశ... అంటూ ప్రార్థన చేయడం, హనుమంతుడు శ్రావ్యంగా హనుమాన్‌ చాలీసా చదవడంతో పిల్లలు కూడా వాటిని మళ్లీ మళ్లీ ఉచ్చరిస్తూ సులభంగా నేర్చుకోగలుగుతారు. ఆ కారణంతో వాటికి మంచి ఆదరణ లభించింది. దాంతో అనేక భారతీయ కంపెనీలు సైతం ఈ పౌరాణిక పాత్రల్ని బొమ్మలుగా మలుస్తున్నాయి. రంగురంగుల పంచెలతో ఉన్న బుజ్జి వినాయకుడినీ గద పట్టుకున్న చిట్టి హనుమంతుడినీ వెన్న తింటోన్న చిన్నారి కృష్ణుడినీ భక్తప్రహ్లాదుడితో కొలువుదీరిన నరసింహుడినీ మెడలోనూ సిగలోనూ సర్పాన్ని ధరించిన పరమశివుడినీ నందితో ఉన్న ఈశ్వరుణ్ణీ చదువుల తల్లి సరస్వతినీ... ఇలా సకల దేవతల్నీ మృదువైన బొమ్మల రూపంలో తయారుచేస్తున్నారు. అంతేకాదు, రాధాకృష్ణులూ శివపార్వతుల బొమ్మలూ ఉన్నాయి. రకరకాల సైజుల్లో ఆకర్షణీయంగా ఉన్న ఈ దేవతల బొమ్మల పట్ల చిన్నారులకు ఒకలాంటి ఇష్టం, ప్రేమ కలగడంతోపాటు పెరిగేకొద్దీ ఆ పౌరాణిక పాత్రల పట్ల వాళ్లకి చక్కని అవగాహన ఏర్పడుతుంది. బాగా ప్రాచుర్యం పొందిన ఛోటా భీమ్‌ లాంటి క్యారెక్టర్లనీ సాప్ట్‌టాయ్స్‌గా తీసుకొస్తున్నారు. మంచి విషయమే కదూ!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న