కాలేజీ ఏదైనా.. చదవొచ్చు ఐఐటీ పాఠాలు! - Sunday Magazine
close

కాలేజీ ఏదైనా.. చదవొచ్చు ఐఐటీ పాఠాలు!

‘ సెమిస్టర్‌ మార్కులు... పక్కనపెట్టండి. లాక్‌డౌన్‌లో అందరికీ మంచి స్కోరే ఇస్తున్నాయి వర్సిటీలు!’ అన్నాడు ఆ సీఈఓ పవన్‌ వైపు పరీక్షగా చూస్తూ. ‘మరి... ప్రాజెక్టు వర్క్‌ చూపించమంటారా!’ అడిగాడు ఇంటర్వ్యూకొచ్చిన పవన్‌.  ‘నో నీడ్‌! ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి చాలు... లాక్‌డౌన్‌లో మీ సబ్జెక్టు నాలెడ్జ్‌ స్కిల్స్‌ పెంచుకోవడానికి ఏం చేశారు... ఏం చదివారు?’ ఆ సూటి ప్రశ్నకి జవాబులేక గతుక్కుమన్నాడు పవన్‌! మీరూ పవన్‌లా ఇబ్బందిపడకూదంటే... ‘స్వయం’ వైపు చూడమంటున్నాయి మన ఐఐటీలూ, ఎన్‌ఐటీలూ, ఐఐఎంలూ! ఇంతకీ ఏమిటీ స్వయం అంటే..

ఇంజినీరింగ్‌ రంగమంటూ ఎంచుకున్నాక... ఐఐటీల సీటు కోసం అర్రులు చాచని విద్యార్థులు ఎవరుంటారు! ఇక, మేనేజ్‌మెంట్‌ చదువులైతే ఐఐఎంల వైపే ఉంటుంది అందరి చూపూ. కానీ ఈ ఐఐటీలూ, ఐఐఎంలలో చేరాలంటే లక్షల్లో ఒకరికి తప్ప సీటు రాదు. దాంతో తమకున్న మార్కులూ, డబ్బుని బట్టి ఆ తర్వాతిస్థాయి కాలేజీల్లో సర్దుకుంటారు. పెద్ద నగరాల్లోని కాలేజీలు ఫర్వాలేదుకానీ... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల స్థాయి మరీ తీసికట్టుగా ఉంటుంది. సరైన ల్యాబ్‌ వసతుల్లేకపోవడమే కాదు... బోధనా సిబ్బంది స్థాయీ అంతంతమాత్రమే. దాంతో విద్యార్థులు కూడా అత్తెసరుగానే మిగిలిపోతారు. మరి అలాంటి విద్యార్థులూ... దేశంలోని ప్రముఖ ఐఐటీలూ ఐఐఎంల నుంచి పాఠాలు వినగలిగితే ఎలా ఉంటుంది... ఆ పాఠాలతో తమ ‘సబ్జెక్టు’ నాలెడ్జ్‌ మాత్రమే కాదు... ఉద్యోగార్హతా పెంచుకుంటే ఎంత బావుంటుంది? ఆ ఆలోచనతో పుట్టిందే ‘స్వయం’(swayam.gov.in). స్టడీ వెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌-లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌ అన్నదానికి సంక్షిప్త రూపమిది. ఒక్క ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులనే కాదు... ఆర్ట్స్‌, సైన్స్‌, క్రాఫ్ట్స్‌ ఇలా తొమ్మిదో తరగతి నుంచి పీజీ దాకా ఉన్న ప్రధాన సబ్జెక్టులన్నింటికీ ఈ సైట్‌లో పాఠాలు వినొచ్చు. ఇవేవీ ఆషామాషీ పాఠాలు కావు... దేశంలోని ఐఐటీలూ, ఎన్‌ఐటీలూ, ఐఐఎంలూ, బెంగళూరు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సస్‌, బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంతోపాటూ ఏఐసీటీఈ, ఎన్‌సీఆర్‌టీఈ వంటి ప్రఖ్యాత సంస్థల్లో నమోదైన అధ్యాపకు లందరూ ‘స్వయం’లో బోధిస్తున్నారు!

కొవిడ్‌ వేళ..
2017లో ‘స్వయం’ ప్రారంభమైనా... కొవిడ్‌ లాక్‌డౌన్‌ల తర్వాత విద్యార్థుల మధ్య ఒక్కసారిగా దీనికి ఆదరణ పెరిగింది. గత ఏడాదిన్నరలోనే కోటీ పదిలక్షలమంది ఇందులో కొత్తగా రిజిస్టర్‌ చేసుకున్నారట! కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని, అత్యాధునిక మెషిన్‌ లెర్నింగ్‌, పైథాన్‌ ఫర్‌ డేటా సైన్సస్‌, ప్రోగ్రామింగ్‌... వంటివాటికి జాబ్‌మార్కెట్‌లో మంచి ఆదరణ ఉండటంతో ప్రతి సబ్జెక్టుకీ... ప్రతి సెమిస్టర్‌లోనూ 40 వేలమంది విద్యార్థులు చేరుతున్నారట. వీటిని ఐఐటీలే అందించడం వల్ల ఆ కోర్సులపైన రోజురోజుకీ క్రేజ్‌  పెరుగుతూనే ఉందని చెబుతున్నారు.

ఇలా చేరొచ్చు..
తొమ్మిదో తరగతిలో బయాలజీ అర్థం కాలేదా? పదిలో మ్యాథ్స్‌ కష్టంగా ఉందా? ఇంటర్‌ పార్ట్నర్‌షిప్‌ అకౌంటెన్సీలో ఇబ్బందా? బీటెక్‌ ట్రిపుల్‌ ఈలో ‘ఎలక్ట్రిక్‌ సర్క్యూట్స్‌’ని చూసి బెంబేలెత్తుతున్నారా! ఇవే కాదు, మనదేశంలోని అన్ని పాఠ్యప్రణాళికలకి సంబంధించి ఏ సబ్జెక్టునైనా ‘స్వయం’ ద్వారా నేర్చుకోవచ్చు... ఒక్క ప్రాంతీయ భాషల సబ్జెక్టులు తప్ప!

వివిధ విభాగాలకి సంబంధించి సుమారు రెండువేల సబ్జెక్టుల్ని 700 కోర్సులుగా బోధిస్తారు ఇక్కడ! దేశంలోని 135 విద్యాసంస్థలకి చెందిన వెయ్యిమంది లెక్చరర్లు ఇందుకోసం సిద్ధంగా ఉంటారు. మీకు ఏ కోర్సు కావాలన్నా పూర్తి ఉచితంగా చదవొచ్చు. కోర్సు కాలం మీరు ఎన్నుకునే సబ్జెక్టుని బట్టి నాలుగువారాల నుంచి 24 వారాల దాకా ఉంటుంది. అధ్యాపకులు ఆన్‌లైన్‌లో బోధించినా... వారాంతంలో ప్రత్యేకంగా ఇంటరాక్టివ్‌ సెషన్‌ కూడా ఉంటుంది. కేవలం లెక్చరర్లు మాత్రమే కాకుండా వివిధ పరిశ్రమలకి సంబంధించిన సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన వీడియోలూ, ఈ-పుస్తకాలూ ‘స్వయం’లో ఉంటాయి. పాఠాలు మీకు ఎంతవరకూ అర్థమయ్యాయో అంచనావేయడానికి టెస్టులు పెడతారు. మరి పరీక్షలూ అంటారా...

తప్పనిసరిగా రాయాలనేమీ లేదు. మీకు ఆసక్తి ఉంటే వెయ్యి రూపాయల ఫీజుతో పరీక్షలకి హాజరై సర్టిఫికెట్‌ పొందవచ్చు. మీరు చేరే కోర్సుని బట్టి ఐఐటీలూ, ఐఐఎంలే నేరుగా మీకు ఆ సర్టిఫికెట్‌ని ఇస్తాయి. మీరు ఏ కాలేజీలో ఏ కోర్సు చదువుతున్నా... అది ఏ వర్సిటీ పరిధిలో ఉన్నా... ‘స్వయం’ ద్వారా మీరు ఆ సబ్జెక్టులో సాధించిన మార్కుల్ని... మీ డిగ్రీ లేదా పీజీ కోర్సులకి ‘క్రెడిట్స్‌’గా కలుపుతారు! దాంతో మీ విద్యార్హతలకి మంచి వెయిటేజీ వస్తుంది!

ఏ చిన్న పట్టణ ప్రాంతంలోని కాలేజీలో చదివినా... మీ దగ్గర ఐఐటీ, ఐఐఎంకి సంబంధించిన ఇలాంటి ఓ సర్టిఫికెట్‌ ఉంటే చాలు కదా... ఉద్యోగ మార్కెట్‌లో మీ విలువ పెరగడానికి!


సబ్బు, పేస్టు, మాస్కు.. అన్నీ బొగ్గుతోనే!

‘మేం బొగ్గు టూత్‌పేస్టు వాడుతున్నా’మని కొందరూ, ‘బొగ్గు దిండు వేసుకుంటే నిద్ర బాగా పడుతుంద’ని మరికొందరూ, ‘అల్మరాల్లో వాసన రాకుండా బొగ్గు బ్యాగ్స్‌ వేస్తున్నామ’ని ఇంకొందరూ... ఇలా చాలామంది చాలా రకాలుగా బొగ్గుని వాడేస్తున్నారీమధ్య. ఆరోగ్యం కోసం బొగ్గు ట్యాబ్లెట్లు మింగుతున్నామనే వాళ్లూ ఉన్నారు. అసలేమిటీ బొగ్గు... ఎందుకీ క్రేజ్‌... వివరాల్లోకి వెళితే..!

కప్పుడు బొగ్గు ఇంధనంగానే తెలుసు. దంత ధావనానికీ ఉపయోగించడమూ కొంతవరకూ సుపరిచితమే. క్రమంగా దీని వాడకం తగ్గుతూ వచ్చింది. కానీ కొంతకాలంగా మార్కెట్లో యాక్టివేటెడ్‌ చార్కోల్‌ ఉత్పత్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆ బొగ్గూ... ఈ చార్కోలూ... రెండూ ఒకటేనా?

...కాదు, కట్టెల్ని మామూలుగా కాలిస్తే వచ్చేది సాధారణ బొగ్గు. చెక్క, కొబ్బరిపెంకులు, వెదురు, రంపపుపొట్టు... వంటి వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్‌ లేదా నీటిఆవిరి సాయంతో ప్రత్యేక పద్ధతిలో కాల్చి చేసేదే యాక్టివేటెడ్‌ చార్కోల్‌. ఆక్సీకరణకు గురిచేయడంవల్ల చార్కోల్‌లోని రేణువులు దేనికది విడివడి రంధ్రాల సంఖ్య మామూలు బొగ్గులోకన్నా అనేక రెట్లు పెరుగుతుంది. దాంతో గాల్లోని తేమనీ చెడు వాసనల్నీ హానికర పదార్థాల్నే కాదు, పొట్టలోని టాక్సిన్లనీ ఈ చార్కోల్‌ పీల్చుకుంటుంది. ఆ కారణంతోనే  వైద్య రంగంలో మాత్రమే ఉపయోగించే ఈ బొగ్గుతో మరెన్నో ఉత్పత్తులూ వస్తున్నాయి.

లాభాలెన్నో..

బ్యాంబూ లేదా కోకోనట్‌ షెల్‌... ఏదయినాగానీ యాక్టివేటేడ్‌ చార్కోల్‌ పొట్టలోకి వెళ్లి అక్కడి చెడు పదార్థాల్ని పీల్చుకుని మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. అందుకే అధిక మొతాదులో మందులు వేసుకున్నప్పుడూ విషానికి విరుగుడుగానూ వాడుతుంటారు. జీర్ణంకాని పదార్థాలను బయటకు పంపడానికీ; మూత్రపిండాలు, కాలేయ పనితీరుకీ తోడ్పడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందనీ ఒక గ్రా.ట్యాబ్లెట్‌ను భోజనానికి ముందూ వెనకా ఇచ్చినప్పుడు గ్యాస్‌ సంబంధిత సమస్యలు ఉండవనీ అధ్యయనాలు చెబుతున్నాయి. డయేరియా నివారణకీ దోహదపడుతుందీ బొగ్గు మందు.

* పళ్లమీద పేరుకునే పాచినీ అందుకు కారణమైన వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటి వాటి నిర్మూలనకోసం బ్యాంబూ చార్కోల్‌ని చొప్పించిన టూత్‌పేస్టుల్ని అనేక కంపెనీలు తయారుచేస్తున్నాయి. బ్రష్‌ బ్రిజల్స్‌ల్లోనూ ఈ పొడిని చొప్పిస్తున్నారు.

* చర్మరంధ్రాల్ని బిగుతుగా చేయడం ద్వారా మొటిమల్నీ బ్లాక్‌హెడ్స్‌నీ తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లూ తగ్గడానికీ తోడ్పడుతుంది. దాంతో క్రీములూ మాస్కులూ క్లీనర్లూ... అనేక సౌందర్య లేపనాలు బొగ్గు రంగుని పులుముకుంటున్నాయి. ఈ బొగ్గుపొడిలో కాసిని నీళ్లు పోసి పేస్టులా చేసి దోమలూ కీటకాల్లాంటివి కుట్టిన చోట పెడితే నొప్పీ వాపూ వెంటనే తగ్గుతాయట.

* చెడు వాసనల్ని పీల్చడంలో బొగ్గుని మించింది లేదు. కాబట్టే డియోడరెంట్లతోపాటు, గదుల్లో అల్మరాల్లో ఫ్రిజ్‌ల్లో పెట్టుకునేందుకు వీలుగా బొగ్గుపొడిని నింపిన ఎయిర్‌ ప్యూరిఫయింగ్‌ బ్యాగులు దొరుకుతున్నాయి. వీటిని కబోర్డులూ డ్రాయర్లూ బాత్‌రూముల్లోనూ వాడుకోవచ్చు. అంతేనా... ఈ బొగ్గుపొడిని చొప్పించిన లోపలి దుస్తులూ సాక్సులూ వస్తున్నాయి. ఇక, దీంతో తయారైన దిండ్లు దానిమీద పడిన దుమ్మునీ ధూళినీ పీల్చడంతోపాటు హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయట.

* ఆరోగ్యానికి మంచిదన్న కారణంతో బర్గర్లూ కేకులూ సాఫ్ట్‌ డ్రింకులూ కాఫీలూ టీలూ కుకీలూ బిస్కెట్లూ ఐస్‌క్రీములూ... ఇలా ఆహారపదార్థాల తయారీలోనూ కాస్త బొగ్గుపొడిని చల్లడమూ పెరిగింది. అయితే అన్నింటిలోకీ కొబ్బరి పెంకులతో తయారైన బొగ్గే మంచిదట. కానీ వెదురు మొక్క వేగంగా పెరుగుతుంది. కాబట్టి సౌందర్య లేపనాలూ డియోడరెంట్లు... వంటి వాటి తయారీలో వెదురు బొగ్గునీ, తినేవాటిల్లో కొబ్బరిపెంకుల బొగ్గునీ ఉప యోగిస్తున్నారు. ఇదండీ... ఈ బొగ్గు కథ!


మీకు తెలుసా!

నేటి పిల్లలకి పుట్టడం తోనే వేసే టీకాల్లో ఒకటి... బీసీజీ! క్షయవ్యాధికి నిరోధకంగా పనిచేసే ఈ టీకాని విజయవంతంగా మనుషులపైన ప్రయోగించి ఈ ఏడాదికి సరిగ్గా వందేళ్లవుతోంది. 1940ల్లోనే ఇది మనదేశానికి వచ్చినా 1978 నుంచి పుట్టే ప్రతి శిశువుకి తప్పనిసరిగా వేయాల్సిన టీకాల్లో దీన్నీ భాగం చేశారు. ఈ టీకా ప్రభావం భూమధ్యరేఖకి దగ్గరగా ఉన్న భారత్‌లాంటి వేడి ప్రాంతాల్లో తక్కువగానూ... దానికి దూరంగా ఉన్న చల్లటి దేశాల్లో ఎక్కువగానూ ఉంటుందట. ఇందుక్కారణం ఎవరూ చెప్పలేకపోతున్నారు మరి!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న