అమ్మమ్మ కథ - Sunday Magazine
close

అమ్మమ్మ కథ

త్మకథాత్మకంగా సాగే ఈ జీవిత కథ ఒకరిది కాదు, అమ్మమ్మ- మనవరాళ్ల మాటల్లో ఆసక్తిగా చదివించే మూడు తరాల అనుభవసారం. పదేళ్ల కే వితంతువులైన ఇద్దరు యువతులు తమలాంటివారు వీధిలో అడుగుపెట్టడమే పాపమనుకునే రోజుల్లో ఏకంగా పోరుబాటే పట్టారు. పొలంకోసం ఇంట్లోనూ, దేశ స్వాతంత్య్రం కోసం బయటా వారు చేసిన పోరాటాల్ని వారి మాటల్లోనే విని మనవరాలే అక్షరబద్ధం చేయడం విశేషం. బిడ్డలిద్దరి జీవితాలూ ఇలా అయ్యేసరికి ఒక దత్త పుత్రుడిని పెంచుకున్న ఆ తల్లిదండ్రులు చివరికి అతడి మీద నమ్మకం లేక కూతుళ్లిద్దరికీ చెరి నలభై ఎకరాల పొలమూ ఇచ్చారు. దాన్ని తన పేరున రాస్తే కానీ ఇంట్లో ఉండడానికి వీల్లేదన్నాడు ఆ తమ్ముడు. అలా బయటపడిన వారిద్దరూ రచ్చగెలిచి ఇంట గెలిచిన వైనం స్ఫూర్తిదాయకం. నాటి, నేటి సామాజిక పరిస్థితుల్ని పోల్చుతూ బిగి సడలకుండా కథనాన్ని నడిపించారు రచయిత్రి.    

- పద్మ
ఆకుపచ్చ నేలకోసం
రచన: స్వరాజ్య పద్మజ కుందుర్తి
పేజీలు: 166; వెల: రూ.180/-
ప్రతులకు: ఫోన్‌- 9848410694


ఉత్కంఠభరితం

తెలుగునాట పాఠకులు గణనీయంగా పెరగటానికి పునాదులు వేసిన రచయితల్లో కొవ్వలి లక్ష్మీ నరసింహారావు ప్రముఖులు. ఆయన 60 ఏళ్ళ క్రితం రాసిన సైంటిఫిక్‌ మిస్టరీ నవల ఇది. విదేశాల్లో చదువుకున్న రసాయనశాస్త్ర నిపుణుడు దిన్షాబాబు డీఎస్‌పీ కుమార్తె లీలను ప్రేమించి, ఆ క్రమంలో వేధింపులూ, అడ్డంకులూ ఎదుర్కొంటాడు. బందీగా, నిస్సహాయంగా మారిన లీలను అనూహ్యంగా ఓ చాటు మనిషి కాపాడుతుంటాడు. తమను ముప్పుతిప్పలు పెట్టే ఇతణ్ణి అంతం చేసేందుకు పోలీస్‌ అధికారి చేసే కుయుక్తులూ, చాటు మనిషి పైఎత్తులూ, చివర్లో న్యాయస్థానంలో విచారణలూ... ఉత్కంఠభరితంగా సాగుతాయి. మాయా మందిరం విచిత్రాలు ఆశ్చర్యపరుస్తాయి. విజ్ఞానశాస్త్ర పరిశోధన ఫలాలపై విశ్వాసం, వర్ణాంతర ప్రేమవివాహాల్ని సమర్థించే అభ్యుదయం ఇందులో కనిపిస్తాయి.    

- సీహెచ్‌. వేణు
చాటు మనిషి(నవల), రచన: భయంకర్‌
పేజీలు: 304; వెల: రూ.250/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655


అక్షరాంజలి

వితను తన చిరునామాగా ప్రకటించుకుని, తెలంగాణ గడ్డకు జ్ఞానపీఠాన్ని అందించిన కవి సి.నారాయణరెడ్డి. ‘పేరేమో సింగిరెడ్డి నారాయణరెడ్డి కానీ కులం కీళ్లు విరిచిన నా కలానికి సన్మానం’ అని చెప్పుకున్న ఆయన సాహిత్య వారసత్వాన్ని కొత్త తరానికి అందించాలన్న ఆశయంతో వెలువరించిన ఈపుస్తకంలో పలువురు ప్రముఖులు సినారె బహుముఖీన ప్రతిభా విశేషాలను సోదాహరణంగా పేర్కొంటూ రాసిన రచనలున్నాయి. పుస్తకం తెరవగానే సినారె దస్తూరీతో ఉన్న సినిమా పాట, దాని పక్కనే ‘అమ్మ ఒకవైపు- దేవతలంతా ఒకవైపు/ సరితూచమంటే నేను ఒరిగేను అమ్మవైపు’ అంటూ రాసిన గజల్‌... ఆకట్టుకుంటాయి. సినారె అభిమానులకూ ఆయన కవితారీతులపై అవగాహన పెంచుకోవాలనుకునేవారికీ నచ్చే పుస్తకమిది.

- శ్రీ
మన సినారె
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
పేజీలు: 198; వెల: రూ. 300/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


దైనందిన కవి!

వేకువా వెన్నెలా మండే సూర్యుడూ రాలే మబ్బుతునకా... మనుషులతో ముడిపడ్డ ఆనంద విషాదాలూ... ఇలాంటి దైనందిన అనుభవాలకి కవితా రూపమిచ్చి సామాన్యులని సేదదీర్చే కవి ఎన్‌.గోపి. మార్మికతల్లేవు, భాషాపటాటోపాలు అసలే కానరావు... పాఠకుల గుండె లయకి పలుకులేవో జతచేసినట్టుండే కవితలు ఆయనవి. ‘నోట్లు కప్పుకున్న జనం దిగంబరులయ్యారు నేడు/ఎంత స్వాభావిక సరళంగా/ఉన్నారో జనం ఈనాడు’ (కొత్త స్పృహ) - ‘పెద్ద నోట్ల రద్దు’ ఫీటుకి ఎంత చక్కటి స్పందన ఇది! గోపి సప్తతి సందర్భంగా ఆయన గత నాలుగేళ్లలో రాసిన కవితల సమగ్ర సంకలనం ఇది.

- అంకిత
మనిషిని కలిసినట్టుండాలి (కవిత్వం)
రచన: డా.ఎన్‌.గోపి
పేజీలు: 648; వెల: రూ. 600/-
ప్రతులకు: ఫోన్‌- 040 27037585ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న