జ్ఞాపకాల జావళి - Sunday Magazine
close

జ్ఞాపకాల జావళి

సినిమాలతో ప్రేక్షకులకీ రచనలతో పాఠకులకీ చేరువైన దర్శకుడు వంశీ జ్ఞాపకాల కథలివి. తన జీవితంలో తారస పడిన వ్యక్తులకు సంబంధించిన ఈ కథల్లో లబ్ధప్రతిష్ఠులతోపాటు సాధారణ హోటల్‌ నిర్వాహకులవరకూ ఉండటం విశేషం. ఇళయరాజా స్వరాలు వింటూ, భారతీరాజా దర్శకత్వ ప్రతిభను ఆరాధిస్తూ అలా పేజీలు తిప్పుతుంటే మధ్యలో బొబ్బిలి వీణ తన కథ చెబుతుంది. గుడారాల్లో ఆయుర్వేద మందులు అమ్మే అనిల్‌సింగ్‌ సంచార జీవితం కనబడుతుంది. ఉప్పాడ జాందానీ చీరల సోయగం విశేషాలు వినిపిస్తాయి. బలభద్రపురం స్టేషన్‌ మాస్టారి కథ కళ్లను చెమర్చేలా చేస్తుంది. మధ్యలో సినిమా సంగతులు చెబుతూనే- అదోరకం తన్మయత్వం, సమాధి నంబరు-6, అలా చేసింది విజయలక్ష్మి లాంటి కథల్లో గోదావరి జిల్లాలకు చెందిన విభిన్నమైన వ్యక్తుల్నీ, వారి జీవితాల్నీ పరిచయం చేస్తారు. ఆ కథలను బొమ్మలతో, రెండు ముఖచిత్రాలతో పుస్తకరూపంలో సమర్పించిన తీరు ఆకట్టుకుంటుంది.

- పద్మ

వంశీ పొలమారిన జ్ఞాపకాలు
పేజీలు: 670; వెల: రూ.900/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

 జీవిత పరిమళం

జీవితాన్ని పరిమళభరితం చేసే మానవసంబంధాల విలువనూ, నిర్వేదాన్ని దరిచేరనీయని ఆశావాదాన్నీ నిరూపించే కథలివి. అలనాటి కుటుంబాల్లో వికసించిన ఆత్మీయతలను కోల్పోతున్న వర్తమాన యాంత్రిక బంధాల డొల్లతనాన్ని ఎత్తి చూపుతాయి కొన్ని కథలు. ప్రేమ ఒక సంభవమనీ, అది మారదనీ ‘ఆలాపన’లో, దేన్నయినా భరించే శక్తి ప్రేమించే గుణం వల్ల వస్తుందని ‘సహచరి’లో చిత్రిస్తారు రచయిత్రి. అత్తగారితో కలిసివుండటం సమస్య అని ఓ కోడలు, దీనికి భిన్నంగా అత్తగారితో సామరస్యం పెంచుకున్న మరో కోడలు ‘గమనం’లో కన్పిస్తారు. చెడుమార్గం పట్టిన కొడుకులో పరివర్తన తెచ్చిన విశాలి, అమ్మతనం మూర్తీభవించిన జయమ్మ, బతుకులోని వెలితిని అధిగమించిన అన్నపూర్ణ... ఇలా చక్కని పాత్రలు ఆహ్లాదపరుస్తాయి. కథనశైలి, శిల్పం పఠనీయతను పెంచాయి. 

  - సీహెచ్‌. వేణు

సంగమం (కథల సంపుటి)
రచన: గోటేటి లలితా శేఖర్‌
పేజీలు: 127; వెల: రూ. 125/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

చదివించే కథలు

నాలుగున్నర దశాబ్దాల సాహితీ జీవితంలో రచయిత రాసిన వందకు పైగా కథలనుంచి ఎంపిక చేసిన 37 కథల పుస్తకమిది. స్త్రీ పురుష సంబంధాలూ ఆర్థిక వ్యత్యాసాలూ పెడతోవ పడుతున్న మనిషి ఆలోచనలూ ఎక్కువ కథల్లో కన్పిస్తాయి. సుందర్రావు రూపం అతడి పేరుకి పూర్తి వ్యతిరేకం. అతడి పరిస్థితికి జాలిపడి, స్నేహంతో సేదదీర్చి, పెళ్లికి తిరస్కరించి వెళ్లిన మాలిని తిరిగి ఏ రూపంలో అతడికి కన్పించి హృదయాన్ని తేలికపరిచిందో చెప్పే ‘సాలెగూడు’, ప్రేమించినవాడి వ్యక్తిత్వానికి ప్రియురాలు పరీక్ష పెట్టే
‘బెటర్‌హాఫ్‌’, తాగి లారీ నడిపి ఓ యువకుడిని అవిటివాడిని చేసిన రంగరాజుకి ఆ యువకుడే ధన్యవాదాలు చెప్పిన ‘క్షమ’... కథలన్నిటిలోనూ అంతర్లీనంగా కన్పించే సమాజ ప్రవృత్తి ఆలోచింపజేస్తుంది. సూటిగా సాగే కథనం చదివిస్తుంది.

  - సుశీల

రెంటాల హనుమత్‌ ప్రసాద్‌ కథలు
పేజీలు: 255; వెల: రూ.200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు

పురాణ పరిజ్ఞానం

సత్యహరిశ్చంద్రుడని పొగడటమూ అపరకీచకుడని తెగడటమూ సాహిత్యంలోనే కాదు, వాడుక భాషలోనూ మనకు అలవాటు. అయితే పురాణాల్లోని ఆయా వ్యక్తులెవరో, వాళ్ల ప్రత్యేకతలేమిటో చాలామందికి తెలియకపోవచ్చు. ఒకోసారి తెలిసినా ఒకే పేరుతో ఇద్దరు ముగ్గురు ఉండటం వల్ల కొంత అయో మయమూ కలుగుతుంది. ఆ ఇబ్బంది నుంచి తప్పిస్తుంది ఈ పుస్తకం. పురాణప్రముఖులైన వందలాది వ్యక్తుల గురించి బయోడేటా తరహాలో వారి వంశచరిత్రలనూ పేర్ల అర్థాలనూ ఇతర ముఖ్యమైన వివరాలనూ క్రోడీకరించారు రచయిత.

- శ్రీ

పురాణ ప్రముఖులు (జిజ్ఞాసువులకు కరదీపిక)
రచన: చక్కా చెన్నకేశవరావు
పేజీలు: 955; వెల: రూ. 800/-
ప్రతులకు: ఫోన్‌- 9848082432


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న