ముళ్ల బాట - Sunday Magazine
close

ముళ్ల బాట

సమాజం విధించిన నైతిక కట్టుబాట్లను ఉల్లంఘిస్తే ఆ పర్యవసానాలు సంపన్నులకూ, పేదలకూ ఒకేరకంగా ఉండవు. వారిలోనూ బాధితులు స్త్రీలే. తాత్కాలిక ఆకర్షణకు లొంగి ముళ్లబాటలోకి మళ్లిన తిమ్మక్క బతుకు ఈ నవల. యదార్థంగా జరిగిన ఈ వృత్తాంతాన్ని అదే ప్రాంత మాండలికంలో ప్రతిభావంతంగా మలిచారు రచయిత. కపటత్వం, స్వార్థం, పసిపిల్లలను అమ్మేసే అమానుషత్వాలతో పాటు నిస్సహాయులకు ఆసరాగా నిలిచే మానవత్వం కూడా వివిధ సంఘటనల్లో వ్యక్తమవుతుంది. తాను ఎప్పుడో వదిలివెళ్లిన కన్నకూతుర్ని చరమదశలో కళ్లారా చూడాలని తపించిన తిమ్మక్క దీనావస్థ హృదయాన్ని కదిలింపజేస్తుంది. చెట్లు పుట్టల గురించి చెప్పినా, కులవృత్తుల జీవనశైలిని వివరించినా సూక్ష్మాంశాలను విడిచిపెట్టని విషయగాఢత కనిపిస్తుంది. గెద్దె, చిలక జోస్యాల వర్ణన సహజంగా ఉండి ఆకట్టుకుంటుంది.

- సీహెచ్‌ వేణు

వక్రగీత (నవల)

రచన: డా।।వి.ఆర్‌.రాసాని

పేజీలు: 130; వెల: రూ. 100/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


సమాజానికి దర్పణం

సమాజంలో జరుగుతున్న సంఘటనలకూ, మనుషుల స్వభావాలకూ అద్దంపడుతూ రాసిన వంద చిన్న కథలివి. అమ్మానాన్నలు ఎలా బతుకుతారన్నది ఆలోచించకుండా ఉన్న ఎకరం పొలాన్నీ అమ్మి డబ్బు పంచుకుంటామన్న బిడ్డలకు వృద్ధ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ‘కుటీరం’. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలనే స్వభావం భార్యదైతే తనకు అక్కర్లేని విషయాల్లో తలదూర్చని గుణం భర్తది. భార్య ఎంత చెప్పినా ఆ గుణాన్ని మార్చుకోని భర్తకి కనువిప్పు కలిగించిన సంఘటనే ‘నాకెందుకు’. అంతస్తుని బట్టి మనిషి ప్రవర్తన ఎలా మారుతుందో చెబుతుంది ‘కార్తీక్‌ అనే నేను’. లంచం తీసుకునేవాళ్లంటే అసహ్యం అంటూ తాను మాత్రం పనేమీ చేయకుండా తప్పించుకుని తిరిగే వ్యక్తి పేరు అవినీతిపరుల జాబితాలో మొదటిస్థానంలో ఉంటుందని చెప్పే కథ ‘చీడపురుగు’.ప్రతి కథలోనూ ఒక మంచిని చెప్పే ప్రయత్నం చేశారు రచయిత్రి. 

- శ్రీ

కథా నీరాజనం

రచన: జి.మేరీకృపాబాయి

పేజీలు: 392; వెల: రూ.400/-

ప్రతులకు: ఫోన్‌- 9989347374


చరిత్ర కథలు

జాతి వారసత్వపు ఆస్తికి దస్తావేజు చరిత్ర అయితే ఆ చరిత్రను తెలియజేసేది సాహిత్యం అంటారు రచయిత సాయి పాపినేని. తెలుగు సాహిత్యంలో చారిత్రక రచనల లేమికి కారణాలను చర్చించి, కార్యశాల పెట్టి మరీ కథలను రాయించి ప్రచురించిన పుస్తకమిది. తెలుగునేల నుంచి బర్మాకి వలసవెళ్లిన తైలంగులే ‘మన్‌’ జాతీయులు కాగా వారి చరిత్ర గాథల్లోని నిజమైన హీరో కథ ‘మగాడు’. బాల్యంలో విడిపోయిన స్నేహితులు తిరిగి యవ్వనంలో కలుసుకున్నారు. ఎలా అంటే- అతడేమో స్వామిని కొలిచే అర్చకుడిగా, ఆమేమో ఆ స్వామివారి సేవకు అంకితమైన దేవదాసిగా. ఆ పరిణామం వారి జీవితాలను ఏ మలుపు తిప్పిందో చెబుతుంది ‘వసంతమాలిక’. హైదరాబాద్‌ సంస్కృతిని స్పృశిస్తూ సాగే కథ ‘అన్నీసా’. కథలన్నీ ఆసక్తిగా చదివిస్తాయి.

- పద్మ

కాలయంత్రం 2020

కూర్పు: సాయి పాపినేని

పేజీలు: 261; వెల: రూ. 390/-

ప్రతులకు: ప్రధానపుస్తకకేంద్రాలు


కవితా కాలనాళిక!

విజయవాడ సాహితీమిత్రులు తెచ్చిన 2020 ఏడాది ప్రతినిధి కవితల గుచ్ఛం ఇది. ఎప్పట్లాగే గడిచిన ఏడాదిని కవిత్వపు జాడీల్లో ఒడిసిపట్టే ప్రయత్నం చేసింది కానీ... ఆ ఏడాది ఇదివరకటిలాంటిది కాదుకదా! ఎన్నడూ చూడని మహమ్మారిని పరిచయం చేసిన సంవత్సరం అది. మనల్ని మనం ఉమ్మడిగా ఆత్మవిమర్శ చేసుకునేలా చేసింది. వలస జీవుల నెత్తురంటిన రహదారుల్ని కళ్లముందు నిలిపి కన్నీటిని మిగిల్చింది. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ భయాలూ, విమర్శలూ, అపరాధభావాల్ని చూపే కవితలే ఇందులో చాలావరకూ. వలస కూలీల పిల్లల ‘అడుగులు తడబడుతున్న బుల్లి పాదాల/కింద బొబ్బలు చిట్లుతున్న చప్పుడు’(పెగలని దుఃఖం) వెన్నాడుతూనే ఉంటుంది చదువుతున్నంత సేపూ. అంతేకాదు, ‘స్వీయకేంద్రమై తనను తప్ప సమస్తాన్నీ దుంపనాశనం చేసిన/మానవకోటి చిట్టచివరి స్క్వేర్‌ రూట్‌ తెలిసింది’ అన్న నిర్వేదం కూడా మన ముందు నిలుస్తుంది! 

- అంకిత

2020 కవిత

నిర్వాహక సంపాదకులు: విశ్వేశ్వరరావు

పేజీలు: 167; వెల: రూ. 150/-

ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలుఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న