మంచిని పంచే కథలు - Sunday Magazine
close

మంచిని పంచే కథలు

ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లాడితే ఆ దంపతులను తన కారులో పెళ్లి ఊరేగింపుకి సంతోషంగా తీసుకెళ్లిన ప్రేమికుడి కథ ‘నల్లకారు నవ్వింది’. స్త్రీ పురుషుల సమానత్వం కోరుతూ బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లింది మంగనాయకి. ఆమెకి లభించిన ‘బ్రహ్మవరం’ పరిణామాలేమిటో కథలోనే చదవాలి. ఆరోజుల్లో ఊహకందని కథావస్తువది. విభిన్న శైలిలో సాగే ‘టిట్టిభం’ ఆలోచింపచేస్తుంది. ఐదు దశాబ్దాల క్రితం ప్రముఖ తెలుగు రచయితలు కొందరు ఒరిస్సాలోని బరంపురంలో ఏర్పాటుచేసిన సాహిత్య సంస్థ ‘వికాసం’ వర్ధమాన కథకులు రాసిన 11 కథల్ని ‘మనం మనం బరంపురం’ పేరుతో సంకలనంగా వేసింది. సంస్థ స్వర్ణోత్సవ సందర్భంగా పునర్ముద్రించిన ఈ పుస్తకంలో కథలన్నీ విభిన్న అంశాలతో ఆకట్టుకుంటాయి.

- సుశీల

మనం మనం బరంపురం

సంకలనం: ఎ. రామకృష్ణారావు

పేజీలు: 127; వెల: రూ.150/-

ప్రతులకు: ఫోన్‌-9438676699


ఉత్కంఠభరితం

దో అందమైన హవేలీ. దాయాదుల స్వార్థానికి పాలకుల దుర్నీతి తోడుకాగా ఆ ఆనందాల హవేలీలో రక్తం ఏరులై పారింది. ఆ తర్వాత పట్టించుకునేవాళ్లు లేక పాడుబడిపోయింది. అమెరికాలో ఓ వ్యాపారవేత్త ఇంట పుట్టి పెరిగిన ఆద్యకి కల వచ్చిందంటే చాలు కుటుంబసభ్యులంతా గాభరాపడిపోతారు. అలాంటి ఆద్య ఓ రోజు అమ్మవారి బొమ్మని అద్భుతంగా చిత్రించింది. ఆ బొమ్మలో తానెప్పుడూ చూడని భారతీయ మహిళ పోలికలుంటాయి. ఆమె... అవినాష్‌ తల్లీ పోలీసు అధికారీ అయిన రుద్రాణి. ఆనాటి హవేలీనీ ఆద్య కలల్నీ రుద్రాణి వృత్తినీ కలుపుతూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన హవేలీని తిరిగి ఆనందాల క్షేత్రంగా మారుస్తారు ఆద్యా అవినాష్‌లు.

- పద్మ

హవేలి(సాంఘిక, కాల్పనిక నవల)

రచన: లలితావర్మ

పేజీలు: 94; వెల: రూ. 100/-

ప్రతులకు: ఫోన్‌- 8096310140


మనసు పాటలపేటిక

నసు కవిగా అభిమానుల మనసులో స్థిరపడిపోయిన కవి ఆత్రేయ. ఆయన సాహిత్యాన్నంతటినీ ‘ఆత్రేయసాహితి’ పేరుతో ఏడు సంపుటాలుగా గతంలో ప్రచురించారు. అందులో సినిమా పాటలూ వేసినప్పటికీ ఇంకా కొన్ని ముఖ్యమైనవే మిగిలిపోయాయి. భక్తి, ప్రేమ, తత్త్వం, వలపు, విషాదం... ఇలా ఎన్నోరకాల భావోద్వేగాలను పలికించే ఆత్రేయ పాటలన్నీ ఒకేచోట లభ్యమయ్యేలా ప్రచురించాలని సంకల్పించారు పైడిపాలతో కలిసి గాయకుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. ఆయన హఠాన్మరణంతో కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి పూనుకుని ఆత్రేయ శతజయంతి నేపథ్యంలో వీటిని ప్రచురించారు. పాటలతోపాటు సినిమాల వివరాలనూ జతచేసి సమగ్రంగా రూపొందించిన ఈ సంపుటాల్లో మొత్తం 1650 పాటలు ఉన్నాయి.

- శ్రీ

ఆత్రేయ సినీగేయ సర్వస్వం

సంపాదకులు: పైడిపాల

రెండుభాగాలు కలిసి

పేజీలు: 1333; వెల: రూ.800/-

ప్రతులకు: ఫోన్‌- 9989106162


అంతరంగ మథనం

కుటుంబ బంధాల్లోని సున్నిత అంశాలనూ, సంక్లిష్టతలనూ భిన్న కోణాల్లో చిత్రించిన కథల పుస్తకమిది. ‘రంగు వెలసిన బతుకు’లో అండ, ఆసరా లేని తల్లీకూతుళ్లను లోకం క్షోభపెట్టి వంచించిన విషాదం కదిలిస్తుంది. కన్నతల్లిని స్వార్థానికి ఉపయోగించుకునే కూతురూ; దానికి భిన్నంగా- ఆపద వేళ అమ్మకు ధైర్యం చెప్పే కూతురూ వేర్వేరు కథల్లో కనిపిస్తారు. సహనం, సర్దుకుపోయే స్వభావాన్ని అందరూ చేతకానితనంగా భావించినపుడు చిరకాలంగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతుందని ‘పేలిన మంచుపర్వతం’ నిరూపిస్తుంది. కొత్త తరం అమ్మాయిల ఆత్మాభిమానం, స్థిర సంకల్పాలను ‘ఎంపిక’ సూచిస్తుంది. లాక్‌డౌన్‌ మూలంగా రోజుల తరబడి కాలినడకన సాగిన శ్రామికుల కష్టం ‘కూలిన వెన్నెల’లో వ్యక్తమవుతుంది. చాలా కథలకు పెట్టిన కవితాత్మక శీర్షికలూ, కథల్లోని సంభాషణలూ ఆకట్టుకుంటాయి. సమకాలీన అంశాలను జోడిస్తూ స్త్రీల సమస్యలకూ, వారి అంతరంగంలోని ఆకాంక్షలకూ అద్దం పట్టిన 17 కథల సంపుటి ఇది.

- సీహెచ్‌.వేణు

కురిసి అలసిన ఆకాశం(కథలు)

రచన: పద్మావతి రాంభక్త

పేజీలు: 170; వెల: రూ. 150/-

ప్రతులకు: ఫోన్‌- 9848787284

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న