హాయినిచ్చే కథలు - Sunday Magazine
close

హాయినిచ్చే కథలు

వినోదం కలిగించే సరదా కథలతో పాటు సీరియస్‌ కథలూ ఉన్నాయి ఈ పుస్తకంలో. ప్రేమించి పెళ్ళి చేసుకున్న సుబ్బారావు ఆఫీసే లోకంగా బతుకుతూ తమ పెళ్ళిరోజును మర్చిపోయి కళ్లు తేలేసిన ప్రహసనం ‘సీతాయణం’. ఇద్దరితో పెళ్ళిచూపులు జరిగాక నిర్ణయం తీసుకోవటంలో చేసిన తాత్సారం ఎలా పరిణమించిందో ఓ కథ చెపుతుంది. నేటి వీడియో ఫోన్‌ కాల్స్‌ రోజుల్లోనూ నాటి చేతిరాత ఉత్తరాల్లో దాగిన జ్ఞాపకాల విలువ గ్రహించిన ఆధునిక యువతి ‘ఉభయ కుశలోపరి’లో కనిపిస్తుంది. సాటి మనిషన్న మానవత్వం లేకుండా కక్షతో చేసిన ఫిర్యాదు ఓ గెస్ట్‌హౌస్‌ నౌకరు కొలువు పోగొట్టి అతడి కుటుంబాన్ని అస్తవ్యస్తం చేయటం మరో కథ సారాంశం. ఏ ఇతివృత్తం ఎంచుకున్నా ఆహ్లాదకరంగా కొనసాగేలా శ్రద్ధ తీసుకున్నారు రచయిత. చకచకా సాగిపోయే సంభాషణలూ,
చమక్కుల కథనంతో పఠనీయత పుష్కలంగా నిండిన కథలే ఇవన్నీ!

- సీహెచ్‌ వేణు

ఆహ్లాదకరకర కథలు

రచన: ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి

పేజీలు: 127; వెల: రూ. 60/-

ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్‌


స్ఫూర్తిదాయకం

ళాశాలలు జ్ఞానదాతలే కాదు, జీవన ప్రదాతలు కూడా. నేర్చుకున్న నైపుణ్యాలతో, నిండైన ఆత్మవిశ్వాసంతో అక్కడ నుంచి బయటకు వచ్చిన వాళ్లు జీవితాలనూ వెలిగించుకుంటారనడానికి నిదర్శనం ఈ పుస్తకం. వారి విజయగాధలు మరెందరికో స్ఫూర్తినిస్తాయన్న ఆలోచనతో పద్మశ్రీ డా।।ఐ.వి.సుబ్బారావు స్మారక కమిటీ చేపట్టిన ప్రయత్నమే- బాపట్ల వ్యవసాయ కళాశాల పూర్వవిద్యార్థుల జీవిత కథల సంకలనం. పల్లెటూళ్లలో పుట్టి పెరిగిన వీళ్లంతా వేర్వేరు రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదగడం విశేషం. బీపీసీఎల్‌ ఎండీ పద్మాకర్‌, నాబార్డ్‌ చైర్మన్‌ జీఆర్‌ చింతల, నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ జీఎం స్థాయికి ఎదిగిన యోగేశ్వరరావు, హైబ్రిడ్‌ జొన్న పితామహుడు నీలంరాజు... ఒకరూ ఇద్దరూ కాదు, వివిధరంగాల్లో విశేష అనుభవజ్ఞులైన 52 మంది ఉద్యోగ, జీవనయాన విశేషాల సమాహారమిది.

- శ్రీ

వెలుతురు తోవలు

సంకలనం: వలేటి గోపీచంద్‌

పేజీలు: 230; వెల: రూ.200/-

ప్రతులకు: ఫోన్‌- 9441276770, 9676797777


వెతల కథలు

నిషి జీవితంలోని వైవిధ్యాలకూ వైరుధ్యాలకూ అద్దంపడుతుంది తమిళం నుంచి తెలుగులోకి అనువదించిన ఈ 15 కథల సంకలనం. ఒక్కో కథా సమాజంలోని ఒక్కో సమస్యని సూటిగా చర్చిస్తుంది. వందల సంవత్సరాలుగా పంటలు పండిన పొలాలు ఇప్పుడు పచ్చదనపు ఆనవాళ్లే లేకుండా మైదానాలుగా కన్పిస్తుంటే తంగమ్మాళ్‌కి కడుపు తరుక్కుపోతుంది. తనకి ఉన్నది బారెడు నేలే అయినా దానికి లక్షలు ఇస్తామన్నా ఆమె పంతం వీడకపోవడానికి కారణం నేల తరతరాలనూ బతికించే ‘జీవనాడి’ అని తెలుసు కాబట్టి. అగ్రకులం వాళ్లు ఉండే కాలనీలో అద్దెకున్న దళితుడి ఉనికిని అంబేద్కరు పుస్తకాలు బయటపెడతాయి ‘మొండిగోడలు’ కథలో. ‘శరణు’, ‘శవప్రదక్షిణం’ లాంటి కథలూ అదే కోవకి చెందినవి.

- పద్మ

జీవనాడి (తమిళ దళిత కథలు)

అనువాదం: జిల్లేళ్ల బాలాజీ

పేజీలు: 176; వెల: రూ. 140/-

ప్రతులకు: నవచేతన బుక్‌హౌస్‌


పద్య కథలు

కొద్ది పదాల్లో గొప్ప జీవిత సత్యాలను ఆవిష్కరిస్తాయి పద్యాలు. వాటికి అర్థ తాత్పర్యాలను వివరించి చెప్పే పనిని కుటుంబ కథల ద్వారా చేశారు రచయిత్రి. దాంతో ఎక్కడోచోట పాఠకులు మనకీ ఇలాగే జరిగింది కదా అనుకోక మానరు. తల్లి ఎంతో ప్రేమతో పిండివంటలు వండి నగరంలో డాక్టరైన పెదనాన్న కొడుక్కి పంపించడం చూసిన వాసు తండ్రికి ప్రాణం మీదికి రాగానే అన్న ఉన్నాడు కదా అని ధైర్యంగా వెళ్తే ‘అక్కరకు రాని చుట్టము’ అయ్యాడు ఆ డాక్టరు. ఆకొన్న కూడే అమృతము, ఆత్మ శుద్ధిలేని ఆచారమదియేల, ఉప్పుకప్పురంబు... లాంటి పద్యాలన్నీ కథల్లో ఒదిగిన తీరు ఆసక్తికరం.

- సుశీల

శతక పద్యాలు(కథాకదంబం)

రచన: బిందుమాధవి మద్దూరి

పేజీలు: 170; వెల: రూ.110/-

ప్రతులకు: ఫోన్‌- 9491727272


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న