ఓ అమ్మ కథ - Sunday Magazine
close

ఓ అమ్మ కథ

కనకవల్లి...సరస్వతీపుత్రుడని పేరొందిన పుట్టపర్తి నారాయణాచార్యుల ధర్మపత్ని. బాల్యంలోనే సంస్కృతాంధ్ర పంచకావ్య పఠనం చేసిన ఆమెను సాహితీరంగంలో ఎదిగేలా ప్రోత్సహించారు భర్త. వివాహానంతరం మరిన్ని కావ్యపాఠాలను స్వయంగా నేర్పించారు. తన శిష్యులచేత సంస్కృతాంధ్ర భాషాపాఠాలను పునశ్చరణ చేయించే బాధ్యతనూ ఆమెపై మోపారు. ముత్యాలకోవలాంటి ఆమె అక్షర సౌందర్యం చూసి తన రచనలకు లేఖకురాలిగా మార్చుకున్నారు. దాంతో ఆయన రచనావేగమూ కీర్తీ పెరిగాయి. నేర్చిన జ్ఞానానికి ఇంట్లో నెలకొన్న సృజనాత్మక వాతావరణం తోడు కాగా కనకమ్మ అలవోకగా కీర్తనలు అల్లారు, పదకవితలు రాశారు. అయితే వాటిని ఆమె రహస్యంగా ఎందుకు దాచారో, అవి ఎలా వెలుగులోకి వచ్చాయో తెలియాలంటే ఈ విదుషీమణి జీవిత కథ చదవాల్సిందే. చక్కని నవలలా సాగే కథనం ఆసక్తిగా చదివిస్తుంది.

- సుశీల

మా అమ్మ కనకమ్మ
రచన: పుట్టపర్తి నాగపద్మిని
పేజీలు: 150; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 0866-2436642


జీవన గమనం

నదిలా నిస్వార్థంగా ఉండాల్సిన నరుడు స్వార్థంతో పతనమైపోతే పర్యవసానాలేమిటో ఆసక్తికరంగా చిత్రించిన నవల ఇది. గోదావరి ఒడ్డున నిరుపేద స్థితిలో చదువే ఆలంబనగా, అందిన అవకాశాలను వినియోగించుకుంటూ వాణిజ్యవేత్తగా ఎదిగిన వేణుగోపాలరావు జీవితగమనమే కథ. ప్రకృతి ప్రకోపాన్నీ, మనిషి నిస్సహాయతనూ వర్ణిస్తూనే మానవత్వం పరిమళించే మంచిమనసులను పరిచయం చేస్తారు. పరహితం మరిచి, స్వార్థమే పరమార్థంగా చరించి చిక్కుల్లో చిక్కుకున్న వ్యక్తి చివరికి ఏ నిర్ణయం తీసుకున్నాడో ఆకట్టుకునేలా రాశారు. ‘నిర్విరామంగా ప్రవహిస్తేనే నది అవుతుంది. జీవితమూ అంతే’, ‘సమయం సందర్భాలను బట్టి నదికైనా, నరుడికైనా నడక మార్చుకోక తప్పదు’ లాంటి ఆలోచనాత్మక వాక్యాలు ఇందులో పాఠకులను వెంటాడతాయి. ముఖ్యంగా ముగింపు ఘట్టాలు అద్భుత కథాకథనంతో సాగుతాయి.

- సీహెచ్‌.వేణు

నదీ నరుడు(నవల)
రచన: సింహప్రసాద్‌
పేజీలు: 152; వెల: రూ.80/-
ప్రతులకు: ఫోన్‌- 9849061668


అలనాటి కథలు

తెలుగు సాహిత్యాభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు- శ్రీపాద. ‘మనిషి దీర్ఘజీవితంలో ఎదురైన రసవత్తరమైన ఒక ఘట్టాన్నో, జటిలమైన ఓ అను భూతినో హృదయంమీద అచ్చుగుద్దినట్టు చేస్తుంది చిన్న కథ’ అంటారాయన. ఇందులోని కథలన్నీ అలాంటివే. పారితోషికం కంటే, తన అత్తర్లకు దేవదుందుభులు మోగడం అతడికి అవసరం. అందుకు అతడేం చేశాడూ, ఫలితం దక్కిందా అంటే ‘గులాబీ అత్తరు’ చదవాలి. ఈ చేతినుంచి ఆ చేతికి, ఆ చేతినుంచి మళ్లీ ఈ చేతికీ మారడంలో నాలుగల్లా పన్నెండు కాసులు అయిపోవడం- పదకొండేళ్ల కుర్రాడికి గారడీలానే కనబడుతుంది. అందులోని మర్మాన్ని ఆ కుర్రాడు ఎలా తెలుసుకున్నాడో చెబుతూ ఒకే పాత్ర మాటల్లో ఆపకుండా చదివించే కథ ‘మార్గదర్శి’. ఇలా ఒక్కో కథా ఒక్కో ప్రత్యేక
అనుభూతినిస్తుంది. లోగుట్టును విప్పి చూపుతుంది.

- పద్మ

గులాబీ అత్తరు (16 కథలు)
రచన: శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి
పేజీలు: 536; వెల: రూ. 495/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


వ్యంగ్యరచన

రష్యన్‌ రచయిత గొగోల్‌ నవల ‘డెడ్‌సోల్స్‌’కి అనువాదం ఇది. వెట్టిపైన ఆధారపడిన జమీందారీ వ్యవస్థా దానికి అండగా నిలిచిన పోలీసుల అడ్డుతొలగాలంటే దేశంలోని ప్రజాస్వామిక శక్తులకు తమ బలం తెలిసిరావాలని భావించాడు గొగోల్‌. చదువుకుని ప్రభుత్వోద్యోగం చేయాలని కలగంటూ సమాజంలో అడుగుపెట్టిన అతడికి అక్కడి ద్వంద్వ విలువలు జుగుప్స కలిగించాయి. దాంతో కలం పట్టి రచనలతో వ్యవస్థను కదిలించాడు. ‘మృతజీవులు’ పేరుకు తగ్గట్టే కథంతా ద్వంద్వంగా నడుస్తుంది. కథానాయకుడు చిచీకవ్‌ నాటి కరడుగట్టిన జమీందారీ వ్యవస్థనుంచి బయటకు వస్తున్న బూర్జువా వైఖరికి ప్రతినిధి. విడ్డూరమైన అతడి వ్యాపారం ఒకవైపు, ఏమాత్రం విలువలేని మానవజీవన పరిస్థితులు మరోవైపు. నవల నడిచేకొద్దీ పరిస్థితి మారిపోతుంది. ఇందులో ఒక్కో పాత్రకీ ఒక్కో విశిష్ట లక్షణం ఉంటుంది. కథనంలోని గాఢతను అనువాదం ప్రతిబింబిస్తుంది.

- శ్రీ

మృతజీవులు(నవల)
అనువాదం: కొడవటిగంటి
పేజీలు: 375; వెల: రూ. 325/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న