హరివిల్లు ‘సమయ’మిది! - Sunday Magazine
close

హరివిల్లు ‘సమయ’మిది!

ఎరుపు, నీలం, పసుపు... ఒక్కో రంగుదీ ఒక్కో అందం. ఇక, ఆ రంగులన్నీ ఓ చోట కలిస్తే... వాచీలోకి చేరి చేతిని చుట్టేసుకుంటే... ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, ఈ కొత్త ఫ్యాషన్‌ ఇప్పుడు కేక పుట్టిస్తోంది.

వాచీలంటే స్టీలు, బంగారు చెయిన్లూ లేదా ఏదో ఒక రంగు బెల్టు స్ట్రాప్‌లతో ఉన్నవే గుర్తొస్తాయి. ఇక, డయల్స్‌ అంటారా ఆ లోపలి భాగంలో నలుపూ తెలుపూ ఎరుపూ... ఇలా ఒకటే రంగున్నవి కనిపిస్తాయి. స్పోర్ట్స్‌ వాచీల్లో కొత్త డిజైన్లూ, స్మార్ట్‌ వాచీల్లో తాజా ఫీచర్లూ, విలాసవంతమైన వాటిలో అయితే విలువైన రాళ్లతో ఆకారంలోనూ తేడా ఉంటుంది. కానీ వాటి డయల్‌, స్ట్రాప్‌ల రంగుల్లో మాత్రం దశాబ్దాలుగా ఒకటే తీరు. ఆ పాత పద్ధతికి టాటా చెబుతూ లగ్జరీ వాచీలకు హరివిల్లు రంగులద్దడం ప్రారంభించింది రోలెక్స్‌ కంపెనీ. ‘రెయిన్‌బో డేటొనా’ పేరుతో ఆ కంపెనీ తెచ్చిన రోజ్‌ గోల్డ్‌, వైట్‌ గోల్డ్‌, బంగారంతో చేసిన ఈ వాచీల డయల్‌ ఫ్రేము చుట్టూతా ఇంద్రధనుస్సు రంగులున్న సెఫైర్‌ రాళ్లు వరుసగా పొదిగి ఉంటాయి. లోపల సమయాన్ని తెలిపే గీతల దగ్గరా, వాచీని పెట్టే క్లిప్‌కి కూడా అవే ఉంటాయి. ఇవి బాగా ప్రాచుర్యం పొందడంతో ఆ తర్వాత హుబ్లట్‌, షొపా, ఆడెమార్‌ పిగె, ఫ్రాంక్‌ ములర్‌, జాకబ్‌ అండ్‌ కొ, పర్మిజియాని, డియార్‌... లాంటి విలాసవంతమైన కంపెనీలూ... రిచర్డ్‌ మిల్‌, ఆపిల్‌, మైఖెల్‌ అండ్‌ కొర్స్‌, గెస్‌... వంటి ప్రముఖ బ్రాండ్‌లు కూడా ఈ తరహా వాచీలను తీసుకురావడం ప్రారంభించాయి. ఇంకేముందీ... ఈ రెయిన్‌బో వాచీలు ఇప్పుడు హాట్‌ ఫ్యాషన్‌గా మారిపోయాయి.

చూడచక్కగా...

హరివిల్లు వాచీల్లో హుబ్లట్‌, రోలెక్స్‌, షొపా... వంటి కంపెనీలు ఎక్కువగా డయల్‌నీ, కొన్నింటిలో చెయిన్‌తో కలిపీ ఇంద్రధనుస్సు రంగులున్న సెఫైర్‌ రాళ్లూ వజ్రాలతో పొదిగి తయారు చేస్తున్నాయి. ఇలాంటి వాటిలో వాచీ ఫ్రేముని కూడా బంగారంతోనే చేస్తారు. మామూలుగానే రత్నాలు మిలమిలా మెరుస్తూ కళ్లను కట్టిపడేస్తాయి. అలాంటివి ఇంద్రధనుస్సు రంగుల్లో కలగలిస్తే ఆ అందాన్ని వర్ణించగలమా... అందుకే, ఈ వాచీలు ప్రియాంకా చోప్రా(షొపా), విరాట్‌ కోహ్లీ(రోలెక్స్‌)... లాంటి సెలెబ్రిటీల చేతుల్నీ అలంకరిస్తున్నాయి. ఈ తరహావి కాస్త తక్కువ ధరకు దొరికేలా ఫాసిల్‌, డానియల్‌ క్లెయిన్‌... వంటి సంస్థలు సహజాతి రత్నాలతో తయారు చేస్తున్నాయి. ఇక, మైఖెల్‌ కొర్స్‌, గెస్‌, ఆపిల్‌, కేసియో, స్వాచ్‌... వంటి బ్రాండ్‌లు డయల్‌ భాగంలోనూ స్ట్రాప్‌లకూ ఇంద్రధనుస్సు రంగుల్ని అందంగా వేసి, హరివిల్లు వాచీలను తీసుకొస్తున్నాయి. ఇవి కూడా చూడ్డానికి చాలా బాగుంటున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న