బోన్సాయ్‌ చామంతి.. భలే ఉందే! - Sunday Magazine
close

బోన్సాయ్‌ చామంతి.. భలే ఉందే!

భారీ చెట్లను మరుగుజ్జుగా చేయడం మాత్రమే బోన్సాయ్‌ అనుకుంటాం. కానీ ఈమధ్య మీడియం సైజులో పెరిగే పూలమొక్కల్నీ మరుగుజ్జు చెట్లుగా మార్చేస్తున్నారు. వాటితోపాటు కొత్తగా ఇప్పుడు సన్నని కాండంతో కొద్దికాలం మాత్రమే బతికే చామంతుల్ని సైతం అందమైన బోన్సాయ్‌ రూపంలో పెంచి విరబూయిస్తున్నారు మొక్కల నిపుణులు.

కాశంలోకి పెరిగే పెద్ద చెట్లను చిన్న కుండీ లేదా తొట్టెలో పెంచడం చూస్తే ఎవరికైనా చిత్రంగానే అనిపిస్తుంది. ఈ మరుగుజ్జు మొక్కల కళ మొదట్లో మర్రి, రావి వంటి భారీ వృక్షాలకే పరిమితం. క్రమంగా కొన్ని రకాల పండ్లూ పూల చెట్లని కూడా బోన్సాయ్‌లుగా పెంచడం ప్రారంభించారు. వాటిల్లోనూ బోగైన్‌విలియా, మాగ్నోలియా, దేవగన్నేరు, ఇక్సోరా... వంటి రకాలే ఎక్కువ. కానీ బలహీన కాండంతో సీజన్‌లో మాత్రమే పూసే చిట్టిపొట్టి చామంతి మొక్కల్ని బోన్సాయ్‌లుగా మార్చడం అనేది క్లిష్టమైనదీ అరుదైనదీ అనే చెప్పాలి. ఈ తరహా బోన్సాయ్‌ పూల మొక్కలకి రోజూ నీళ్లు పోయడం, కత్తిరించడం, ఎరువులు వేయడం... ఇలా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. భారీ వృక్షాలతో పోలిస్తే చిట్టిపొట్టి పూలమొక్కల్ని మరుగుజ్జు వృక్షాలుగా మార్చేందుకు మరింత శ్రద్ధా ఓపికా కావాలి అంటారు బోన్సాయ్‌ వృక్షాల్ని పెంచేవాళ్లు. ముఖ్యంగా చామంతుల్ని బోన్సాయ్‌గా మార్చేటప్పుడు- అవి త్వరత్వరగా పెరిగి, మొగ్గలు రావడానికి సరైన ఎరువులు వేయాల్సి ఉంటుంది. బోన్సాయ్‌ మట్టి మిశ్రమం ఎటూ ప్రత్యేకంగానే ఉంటుంది. మొక్క ఎత్తు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ, ఎరువులు వేసి, దృఢంగా ఎదగనిస్తూ మళ్లీ కత్తిరిస్తూ... ఒకటి రెండేళ్లలో చామంతి మొక్కని చిన్నపాటి బోన్సాయ్‌ చెట్టుగా మారుస్తారు. ఈ మొక్కల్ని చెట్ల మొద్దులకి చుట్టుకునేలానూ పెంచుతున్నారు. దాంతో చామంతి చెట్టు మొదలే అంత లావుగా పెరిగిందా అనిపిస్తుంటుంది. అయితే వీటికి ఎండతోపాటు తగినన్ని నీళ్లు ఎప్పుడూ ఉండాలి. నేల పూర్తిగా ఎండిపోకుండా చూసుకోవాలి. తగిన శ్రద్ధ తీసుకుంటే ఇతర బోన్సాయ్‌ చెట్లలానే ఇవీ సంవత్సరాలపాటు జీవించే ఉంటాయట.

జపాన్‌లో...

చామంతుల్ని మరుగుజ్జు చెట్లుగానే కాదు, రకరకాల ఆకారాల్లో పెంచడం జపనీయులకి వెన్నతో పెట్టిన విద్య. ఏటా చలికాలంలో జరిగే చామంతుల ప్రదర్శనలో వీటినీ ప్రదర్శిస్తుంటారు. ఆనోటా ఈనోటా ఈ చామంతుల కళతోపాటు బోన్సాయ్‌ రూపంలోనూ వాటిని ఎలా పెంచాలనేది అందరూ తెలుసుకుంటున్నారు. దాంతో ఇది అంతటా వాడుకలోకి వచ్చింది. పైగా చామంతి మొక్కల్ని కేవలం అందంకోసం మాత్రమే కాదు, పెరటి వైద్యంకోసమూ పెంచుతారక్కడ. అత్యంత ప్రాచీనమైన ఈ పూలమొక్క మంచి ఔషధం కూడానట. అందుకే ఆగ్నేయాసియా దేశాల్లో చామంతి మొక్కని పెంచని ఇల్లు ఉండదు. దీని వేళ్లను మరిగించి తలనొప్పికి మందుగానూ పిలక మొక్కల ఆకుల్నీ పూల రేకుల్నీ సలాడ్లలో వాడటం, టీ రూపంలో తాగడం చేస్తుంటారు. ఏ కారణంతో అయితేనేం... బలహీనమైన చామంతి మొక్కలు సైతం మరుగుజ్జు వృక్షాలుగా మారి, ఏళ్ల తరబడి విరబూయడం విచిత్రంగానే అనిపిస్తోంది కదూ.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న