సేవాభిలాషులు! - Sunday Magazine
close

సేవాభిలాషులు!

కొందరికి సంపాదనా హోదా సౌకర్యమూ లాంటివి ఇవ్వని ఆనందం తోటివారి ముఖంలో విరిసే చిరునవ్వు ఇస్తుంది. అందుకే వారు మనసారా సేవాపథాన్ని ఎంచుకుంటారు. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతారు.


సగౌరవంగా అంతిమ వీడ్కోలు

రోనా రెండో వేవ్‌ విజృంభించినప్పుడు సరైన అంతిమ సంస్కారానికి నోచుకోకుండా గంగానది ఒడ్డున శవాలు గుట్టలుగా పడి వున్న దృశ్యం అతడిని కదిలించింది. కొందరు వ్యాపారులు పరిస్థితుల్ని అడ్డంపెట్టుకుని కట్టెల ధరను ఐదారు రెట్లు పెంచి అమ్ముతున్నట్లు తెలుసుకున్నాడు. ఆత్మీయులకు గౌరవంగా చివరి వీడ్కోలు ఇవ్వలేని అసహాయులకు తన వంతు సాయం చేయాలనుకున్నాడు సంజయ్‌ రాయ్‌ షేర్పూరియా. అందుకోసం ‘లక్డీ బ్యాంక్‌’లను ప్రారంభించాడు. తాను నిర్వహిస్తున్న రూరల్‌ ఎంట్రప్రెన్యూరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొందరు స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో గాజీపూర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 10 కలప బ్యాంకుల్ని నెలకొల్పాడు. అంత్యక్రియల కోసం పేదలు ఇక్కడినుంచి ఉచితంగా కట్టెలు తీసుకోవచ్చు. సంస్థ తరఫున ఐదుగురు సభ్యులు వారికి సాయంగా వెళ్లి పని సక్రమంగా జరిగేలా చూస్తారు. అనాధ శవాలకు ఈ సంస్థ కార్యకర్తలే అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కొంతవరకు పిడకలను ఉపయోగించడం ద్వారా కలప వాడకం తగ్గించి చెట్లను కాపాడుకోవచ్చని భావించిన సంజయ్‌ పశువుల పేడను పొడవాటి పిడకలుగా మార్చే యంత్రాలను తయారుచేయించాడు. వాటి ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి లభిస్తోంది, కలప వాడకమూ మూడొంతులు తగ్గుతోంది. అంతటితో ఊరుకోకుండా హెల్ప్‌లైన్‌ సాయంతో ఆక్సిజన్‌, మందులు, అంబులెన్స్‌ సౌకర్యం లాంటి కొవిడ్‌ సేవల్నీ ఇంటి వద్దకే అందిస్తోంది సంజయ్‌ బృందం. గత ఆర్నెల్లలోనే 16వేల మందికి వీరు సాయం అందించారు.


హాబీని ఆదాయ మార్గంగా మార్చి..

ప్రతిభా కృష్ణయ్య బెంగళూరులో కంప్యూటర్‌ సైన్స్‌ చదువుకుంది. కార్పొరేట్‌ సంస్థలో మంచి ఉద్యోగమూ వచ్చింది. ఎనిమిదేళ్లు ఉద్యోగం చేశాక ఇంకేదైనా కొత్తగా చేయాలనిపించింది ప్రతిభకు. ఎస్‌బీఐ వారి యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌కి ఎంపికైంది. దానికింద 13 నెలలు ఏదైనా ఎన్జీఓతో కలిసి గ్రామాల్లో పని చేయాలి. ప్రతిభ ఉత్తరాఖండ్‌లోని ఖేతికాన్‌ అనే గ్రామానికి వెళ్లింది. అక్కడి మహిళలు పది నిమిషాలు తీరిక దొరికినా చేత్తో ఊలు పట్టుకుని ఏదో ఒకటి అల్లడం గమనించింది ప్రతిభ. అలా అల్లినవన్నీ వాళ్లు కుటుంబసభ్యులకోసం వినియోగిస్తున్నారు తప్ప అమ్మడం లేదు. అవన్నీ తాను కొంటానని చెబితే మొదట ఎవరూ నమ్మలేదు. ఓ పదిమంది మాత్రం ముందుకొచ్చారు. ప్రతిభ వారు అల్లిన వస్తువులన్నిటినీ తన స్నేహితులకూ తెలిసినవారికీ అమ్మి డబ్బు తీసుకెళ్లి వారికి ఇచ్చింది. అది చూసి మరికొందరు చేరారు. అలా వారి హాబీని ఆదాయమార్గంగా మారుస్తూ ఆన్‌లైన్‌లో ప్రతిభ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు విదేశీయుల్ని సైతం ఆకట్టుకుంది. దాంతో ప్రతిభ తన ఫెలోషిప్‌ అయిపోయినా ఖేతికాన్‌లోనే ఉండిపోయింది. ఆమె ఇచ్చిన శిక్షణతో ఇప్పుడు 40 గ్రామాలకు చెందిన 200 మంది మహిళలు ‘హిమాలయన్‌ బ్లూమ్స్‌’ పేరుతో తమ వ్యాపారాన్ని పూర్తిగా తామే నిర్వహించుకుంటూ నెలకు 2లక్షల వరకూ సంపాదిస్తున్నారు. వారి జీవితాల్లో వచ్చిన మార్పు తనకెంతో తృప్తినిచ్చిందంటుంది ప్రతిభ.


శాస్త్రవేత్త టీచరయ్యాడు..!

శాస్త్రవేత్తల పని పరిశోధన చేసి కొత్తవి కనిపెట్టడమే కాదు, రేపటి శాస్త్రవేత్తల్ని తయారు చేయడం కూడా అని నమ్ముతాడు మహమ్మద్‌ సాజిద్‌ హుస్సేన్‌. ఝార్ఖండ్‌కి చెందిన సాజిద్‌ జర్మనీలో పీహెచ్‌డీ చేసి వచ్చి నేషనల్‌ ఏరోస్పేస్‌ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా చేరాడు. ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ సమాజంలో అధికశాతం పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులో లేదన్న విషయం అతడిని ఆలోచింపజేసేది. పరీక్షల కోసం బట్టీ పట్టే చదువుల వల్ల పిల్లల్లో నిద్రాణంగా ఉండే ప్రతిభ బయటకు రావడం లేదని భావించేవాడు. ఆ ఆలోచనల నుంచి రూపు దాల్చిందే ‘స్కూలేషియం’ ప్రాజెక్టు. జిమ్నేషియం(వ్యాయామశాల)లో ఎలాగైతే చేసి నేర్చుకుంటారో అలాగే స్కూల్లోనూ ప్రతిదీ చేసి, చూసి నేర్చుకోవాలన్నది సాజిద్‌ ఆలోచన. అందుకోసం తానే స్వయంగా మౌంట్‌ ఎవరెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌ని ప్రారంభించాడు. అక్కడ రాష్ట్ర విద్యాశాఖ సూచించిన పాఠ్యాంశాలే నేర్పిస్తారు. కాకపోతే టీచరు చెబుతుంటే పిల్లలు వింటూ కాదు, ఆరుబయట ప్రతి పనినీ తమ చేతులతో తాము చేస్తూ, అక్కడికక్కడే సందేహాలను తీర్చుకుంటూ నేర్చుకుంటారు. అలాంటి చదువు పిల్లల్లో సృజనను వెలికితీస్తుంది, ఆలోచనలకు పదును పెడుతుంది, రేపటి శాస్త్రవేత్తలను తయారుచేస్తుందంటాడు సాజిద్‌. తన స్కూల్లో నామమాత్రపు ఫీజు- అది కూడా కట్టగలిగినవారి నుంచి మాత్రమే తీసుకుంటాడు సాజిద్‌. పేదలందరికీ ఉచిత ప్రవేశం ఇస్తాడు. పలువురు విద్యా వేత్తల ప్రశంసలు పొందిన ఈ విద్యావిధానాన్ని ఇప్పుడు ఝార్ఖండ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నిటిలోనూ అమలు చేయమని సూచించింది. దాంతో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు తానే శిక్షణ ఇస్తున్నాడు సాజిద్‌.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న