ఐసైపోవాల్సిందే..! - Sunday Magazine
close

ఐసైపోవాల్సిందే..!

ముద్దుగా ముస్తాబైన బుల్లి బుల్లి పిల్లి బొమ్మలు... ‘కాస్త ఐస్‌క్రీమ్‌ ఉంటే పెట్టండి బాబూ’ అన్నట్లు నాలుక తెరిచిన కుక్క బొమ్మలు... చక్కగా కాల్చిన మొక్కజొన్న కండె... రంగు రంగుల్లో నోరూరించే పండ్లు... రూపాలు వేరేమో కానీ ఇక్కడ ఉన్నవాటన్నిటికీ కామన్‌గా కనిపించేది ఒక్కటే. అదే... ఐస్‌క్రీమ్‌ పుల్ల. మరి, ఇవేంటో కనిపెట్టారా... లేదా..?

చాలామంది వ్యాపారాలు చేస్తారు. కానీ వారిలో కొద్దిమంది మాత్రమే అందనంత ఎత్తుకి వెళ్తారు. కారణం... మిగిలినవారికన్నా వాళ్లు భిన్నంగా, జనాన్ని ఆకట్టుకునేలా ఆలోచించడమే. ఆఖరికి ఐస్‌క్రీమ్‌లు బాగా అమ్మాలన్నా వర్తించే సూత్రం ఇదే. ‘హిమక్రీములను కప్పుల్లోనూ కోనుల్లోనూ, పుల్లకు గుచ్చి ఐస్‌పాప్స్‌లానూ అందరూ అమ్ముతారు. కానీ, మన ఐస్‌క్రీమ్‌లు మాత్రమే ట్రెండ్‌ని సృష్టించాలంటే సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండాలి కదా’ అని ఆలోచించాయి ఓ నాలుగు కంపెనీలు. అలా పుట్టుకొచ్చినవే ఇక్కడ కనిపించే ఐస్‌క్రీమ్‌లు. అస్సలు నమ్మబుద్ధి కావడంలేదు కానీ ముమ్మాటికీ ఇవి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే ఆ ఐస్‌క్రీమ్‌లే.

ఐస్‌డియా...
‘ఐస్‌క్రీమ్‌ ఐస్‌క్రీమ్‌లా ఉండకూడదు...’ అనే కాన్సెప్ట్‌తో ‘ప్రిమ చక్రబంధు’ అనే ఆమె బ్యాంకాక్‌లో ప్రారంభించిందే ఈ ఐస్‌క్రీమ్‌ షాపు. నిజమైన పిల్లి, కుక్క బొమ్మలు, మొక్కజొన్న కండెల్లా ఇక్కడ కనిపించే ఐస్‌క్రీమ్‌లు ఈ షాపులో తయారయ్యేవే. అన్నట్లూ... ఈమధ్య ఈ దుకాణం కరోనాను దృష్టిలో పెట్టుకుని శానిటైజర్‌ బాటిల్‌లానూ ఐస్‌క్రీమ్‌ని తయారుచేసింది. దీన్ని చూస్తే ఎవరైనా ఓ క్షణం తినాలా, వద్దా అని ఆలోచించాల్సిందే. అంత సహజంగా ఉంది మరి.

స్టోన్‌...
చే గువేరా, మార్లిన్‌ మన్రో, మార్క్‌ జుకెర్‌బర్గ్‌... ఇలా ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్న ప్రముఖులతో పాటు డొనాల్డ్‌ డక్‌, మిక్కీ మౌస్‌... లాంటి కార్టూన్‌ క్యారెక్టర్ల రూపాలనూ వేరు వేరు రుచుల ఐస్‌క్రీమ్‌లుగా మార్చేసి అమ్ముతోంది రష్యాలోని మాస్కోకి చెందిన ‘స్టోన్‌ ఐస్‌క్రీమ్‌’ పార్లర్‌. తాజాగా ఆ కంపెనీ పదో వార్షికోత్సవం సందర్భంగా అచ్చంగా మామిడి ముక్కలూ, అరటి పండ్లు, పైనాపిల్‌, ఆపిల్‌, ద్రాక్ష... పండ్లను పోలినట్లుండే కొత్త వెర్షన్‌ ఐస్‌క్రీమ్‌లను మార్కెట్లోకి తెచ్చింది.

నెస్లె బనానా ఐస్‌క్రీమ్‌...
నెస్లె కంపెనీ ఉత్పత్తులు మన దగ్గరా చాలా ఉన్నాయి కానీ ఈ బనానా ఐస్‌క్రీమ్‌ని మాత్రం ప్రస్తుతం తైవాన్‌, మలేషియాల్లోనే అమ్ముతున్నారు. నిజమైన అరటి పండులా తొక్క తీసుకు తినగలగడమే ఈ ఐస్‌క్రీమ్‌ ప్రత్యేకత. ఈ తొక్కను తినే జెల్లీతో తయారుచేస్తారట. కాబట్టి లోపలున్న ఐస్‌క్రీమ్‌ని తిన్నాక జెల్లీనీ తినేయొచ్చు.

పర్యటక క్షేత్రాల రూపంలో...
‘మా రూటే వేరు’ అనే... చైనీయులు ఈమధ్య ఐస్‌క్రీమ్‌తో స్థానిక పర్యటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం మొదలుపెట్టారు. అదెలా అంటారా... టెంపుల్‌ ఆఫ్‌ హెవెన్‌, మగావు కేవ్స్‌, టైగర్‌ హిల్‌ పగోడా... ఇలా ఆ దేశంలోని ప్రముఖ పర్యటక స్థలాలన్నిటి దగ్గరా అక్కడి కట్టడాలూ శిలలూ శిల్పాలూ మ్యూజియంలలోని అరుదైన వస్తువుల రూపాల్లో త్రీడీ ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి అమ్ముతున్నారు. ఇవి సోషల్‌ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటిని చూస్తే నిజంగా ఐస్‌క్రీమ్‌లా... అనిపిస్తున్నాయి కదూ..!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న