పర్వదినాల మాసం... ఆషాఢం! - Sunday Magazine
close

పర్వదినాల మాసం... ఆషాఢం!

సంవత్సరంలోని ప్రతి నెలకు ఓ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఆషాఢం పేరుకు శూన్య మాసమైనా పూజలకు ఎంతో ప్రాధాన్యం ఉన్న నెలగా పరిగణిస్తున్నాయి శాస్త్రాలు.

షాఢమాసం... ఈ నెల్లో ఎవరూ ఎలాంటి శుభకార్యాన్నీ తలపెట్టకపోయినా  సకల దేవతలనూ కొలిచేందుకు ఆషాఢాన్ని మించిన మాసం లేదని అంటారు. ఈ నెల్లోనే తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, బోనాలు, జగన్నాథుడి రథయాత్ర... వంటి వేడుకల్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

విష్ణుమూర్తికి ప్రియమైన రోజు
తొలి ఏకాదశి... తెలుగు పండుగలలో ఇది మొదటిదనీ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజనీ చెబుతారు. ఈ రోజు నుంచీ నాలుగు నెలల పాటు మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నాలుగు నెలల్నీ చాతుర్మాసాలుగా పరిగణించి ఈ రోజున చాతుర్మాస దీక్షను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరం పొంది దేవతల్నీ, రుషుల్నీ ఇబ్బంది పెట్టేవాడట. ఆ రాక్షసుడితో విష్ణువు పోరాడి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు స్వామి అనుగ్రహంతో శ్రీహరి శరీరం నుంచి ఓ అమ్మాయి బయటకు వచ్చి ఆ రాక్షసుడిని అంతం చేసిందట. దానికి సంతోషించిన విష్ణువు ఆ అమ్మాయిని ఏదయినా వరం కోరుకోమంటే తాను విష్ణుప్రియగా పూజలు అందుకునే వరం ఇవ్వమని అడిగిందట. అప్పటినుంచీ ఆమెని ఏకాదశిగా పిలిచేవారనీ... పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో పేలాల పిండిని ప్రసాదంగా తినే సంప్రదాయం కూడా ఉంది.

శ్రీ గురుభ్యోనమః
ఏ వ్యక్తికైనా జ్ఞానాన్ని పంచేది గురువులే. అలాంటి గురువుల్ని పూజించేందుకు నిర్ణయించిన తిథేఆషాఢంలో వచ్చే పూర్ణిమ. శ్రీహరి అంశతో సత్యవతి-పరాశరునికి జన్మించిన వ్యాస మహర్షి మానవ జాతికే గురువని చెబుతున్నాయి పురాణాలు. అలాంటి వ్యాసమహర్షి జన్మదినమే ‘గురుపూర్ణిమ’. వేదజ్ఞానాన్నంతటినీ ఒక్కచోటకు చేర్చి దాన్ని నాలుగు భాగాలుగా విభజించి సామాన్యుడి చెంతకు చేర్చి, పంచమ వేదమైన మహాభారతాన్ని రాసింది కూడా వ్యాసుడే. వ్యాసపూర్ణిమ రోజున వ్యాసుని రూపంలో ఉన్న తమ గురువుల్ని కొలిస్తే సకల శుభాలూ కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో ఆదిశక్తి పేరిట పూర్ణిమ వ్రతాన్ని, సత్యనారాయణ వ్రతాన్ని చేసుకునే సంప్రదాయం కూడా ఉంది.

అమ్మకు బోనం సమర్పయామి
జగన్మాతకు చైత్రం, ఆశ్వయుజ మాసాల్లో నిర్వహించే నవరాత్రులు ఒకెత్తయితే ఆషాఢంలో బోనాల పేరుతో చేసే పూజలు మరొకెత్తు. తెలంగాణ ప్రాంతంలో ఎంతో విశేషంగా జరిగే ఈ బోనాల వేడుకలకు కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు హైదరాబాద్‌లో మలేరియా వ్యాధి ప్రబలి ఎంతోమంది చనిపోయారట. అమ్మవారికి కోపం రావడం వల్లే ఇలా జరిగిందనుకున్న భక్తులు జాతరలు చేయాలనే ఉద్దేశంతో ఈ బోనాల్ని ప్రారంభించారట. అదేవిధంగా ఆషాఢంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందనీ అమ్మవారిని సొంత కూతురిలా భావించే భక్తులు ఇంటికి వచ్చిన జగన్మాతకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించడమే బోనమనే కథ కూడా ప్రచారంలో ఉంది. రాగి లేదా కొత్త మట్టి కుండకు పసుపు రాసి, కుంకుమ పెట్టి అందులో పసుపు అన్నం లేదా పొంగలి వండి దానిపైన జ్యోతి వెలిగించిన మరో పాత్రను పెట్టి ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి తల్లికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. గోల్కొండలోని జగదాంబికా ఆలయంలో మొదలయ్యే బోనాలు ఆ తరువాత తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఆ రోజున చేసే శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరంగం రెండోరోజున ‘రంగం’ పేరుతో మాతంగి చెప్పే భవిష్యవాణి... ఇలా అన్నింటితో బోనాల జాతర వైభవంగా సాగుతుంది. మళ్లీ గోల్కొండ కోటలో అమ్మవారికి చివరి బోనం సమర్పించడంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

పూరీ రథయాత్రకు సిద్ధం
ఆషాఢమాసంలో జరిగే మరో వేడుక పూరీ జగన్నాథుడి రథయాత్ర. విష్ణుభక్తులకు ఎంతో ఇష్టమైన ఈ దేవాలయం ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఏడాదంతా గర్భాలయంలో ఉండే జగన్నాథుడు ఆషాఢ శుద్ధ తదియ నాడు తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రులతో కలిసి రథయాత్ర చేస్తాడని ఐతిహ్యం. జగన్నాథ ఆలయం ఎదుట ఉండే పెద్దవీధి మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకూ సాగే ఈ యాత్రకు ఆక్షయ తృతీయ నుంచే సన్నాహాలు మొదలుపెడతారు. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లోనూ ఈ యాత్ర గురించి ప్రస్తావించడం విశేషం.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న