కధలు చెప్పే టార్చ్‌లైట్‌..! - Sunday Magazine
close

కధలు చెప్పే టార్చ్‌లైట్‌..!

‘మరేమో అనగనగా ఓ అడవి ఉంది. అందులో బోలెడన్ని జంతువులు ఉన్నాయి. వాటన్నింటికీ రాజు సింహం... ’ అంటూ కథ అంతా చెబుతూనే మంచం మీదనుంచే ఆ పాత్రలన్నింటినీ చూపించేశాడు నాన్న. ‘అదెలాగబ్బా’ అని ఆలోచిస్తున్నారా... కొత్తగా వస్తున్న ‘కిడ్స్‌ బుక్స్‌ స్టోరీ టార్చ్‌లైట్‌’తో.

ఒకప్పుడైతే పొద్దుపోతే చాలు... ఆరుబయట మంచంమీద పడుకుని ఆకాశం లోని చుక్కల్నీ, చందమామనీ చూపిస్తూ అమ్మమ్మో తాతయ్యో ఎంచక్కా కథలు చెప్పేవాళ్లు. కాలంతో పాటూ ఆ పరిస్థితులూ మారిపోయాయి. దీంతో ఇప్పుడసలు ఆరుబయట పడుకునే వీలే ఉండట్లేదు. కానీ పిల్లలకు కథలంటే ఉన్న ఇష్టం మాత్రం అలాగే ఉంది. చదవడం వచ్చిన పిల్లలకైతే చిన్న చిన్న కథల పుస్తకాలు ఉంటాయి సరే, మరి బుజ్జి బుజ్జి మాటలు చెప్పే బుజ్జాయిల సంగతో. వారికి కచ్చితంగా ఎవరో ఒకరు కథ చెప్పాల్సిందే. అలా కథలు వినేటప్పుడు వాటి బొమ్మల్నీ చూస్తే ఇంకా బాగుంటుంది కదా! ఆ ఆలోచనకు రూపంగానే ఈ ‘కిడ్స్‌ బుక్స్‌ స్టోరీ టార్చ్‌లైట్లు’ వచ్చాయి. వీటితో పిల్లలకు ఎంతో ఇష్టమైన రకరకాల జంతువుల, కార్టూన్‌ పాత్రల కథలూ, జానపద కథలూ చెప్పొచ్చు.

‘పే...ద్ద ఏనుగు... దానికి పొడవైన తొండం... చేటంత చెవులు’ అంటూ కథలోని పాత్ర గురించి వర్ణిస్తూనే ఆ ఏనుగు బొమ్మను గోడపైన ఈ టార్చ్‌లైట్‌తో చూపించేయొచ్చు. ‘ఒక రాజుగారికి ఏడుగురు కొడుకులు... వాళ్లంతా కలిసి ఓరోజు చేపల వేటకు వెళ్లారు... ఏడు చేపల్ని తెచ్చారు...’ అంటూ జానపద కథని ఆసక్తిగా చెబుతూనే వాటి బొమ్మల్నీ కళ్ల ముందుకు తెప్పించేయొచ్చు. బ్యాటరీతో నడిచే ఈ టార్చ్‌లైట్‌తో పాటుగా కొన్ని స్లైడ్సూ వస్తాయి. వాటిల్లో పిల్లల ఫేమస్‌ కథలో, ప్రత్యేకమైన అంశాలో ఉంటాయి. ఒక్కో స్లైడ్‌లో ఒక్కో దానికి సంబంధించిన ఎనిమిది సన్నివేశాల బొమ్మలుంటాయి. చూడాలనుకున్న స్లైడ్‌ను పెట్టి టార్చ్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తే చాలు... ఫోకస్‌ చేసిన ప్రాంతంలో ఆ స్లైడ్‌లోని బొమ్మ కనిపించేస్తుంది. అలా దాన్ని చుట్టూ తిప్పుతూ అందులోని అన్ని సన్నివేశాల్నీ చూస్తే కథ పూర్తవుతుందన్నమాట. చక్కగా అమ్మానాన్నల పక్కన పడుకుని వాళ్లు చెప్పే ఆ కథ వింటూనే చీకట్లో వెలిగే బొమ్మలు చూస్తే భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది కదూ!  ఎన్నెన్నో కథలతో వస్తున్న ఈ స్టోరీ టార్చ్‌లైట్లే హ్యాండిల్‌తో చిన్న ప్రొజెక్టరూ, స్లీప్‌ ల్యాంప్‌తో కలిపి కూడా దొరుకుతున్నాయి. నాలుగేళ్ల నుంచి పదేళ్ల లోపు చిన్నారుల కోసమే ప్రత్యేకంగా వస్తున్న కథలు చూపే ఈ టార్చ్‌ల్ని బుజ్జాయిలకు బహుమతిగా ఇచ్చారంటే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ ‘అమ్మా... ఈ బొమ్మల కథ చెప్పవూ’ అని మళ్లీమళ్లీ అడగకుండా ఉంటారా... మీరే చెప్పండి!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న