యువతి సాహసయాత్ర - Sunday Magazine
close

యువతి సాహసయాత్ర

జానపద శైలిలో ఆసక్తిగా సాగుతూ పరోక్షంగా నాటి సామాజిక పరిస్థితుల్నీ స్పృశిస్తుంది ఈ నవల. తండ్రి మరణంతో అనాథగా మేనమామ ఇంట చేరిన శ్రీకంఠ సకల విద్యాప్రవీణుడు. అన్యాయాన్ని సహించని మంచి మనిషి. ఒక సంఘటనలో గ్రామ బహిష్కరణ శిక్షకు గురై కన్పించకుండా వెళ్లిపోయిన అతడిని వెతుక్కుంటూ ఒంటరిగా బయల్దేరుతుంది మరదలు శంతలి. శ్రీకంఠ ఏ దిశగా వెళ్లి ఉంటాడో ఊహించుకుంటూ ఆ మార్గంలో తారసపడే ఊళ్లలోని సమస్యలను తన ధైర్య సాహసాలతో పరిష్కరిస్తూ ముందుకు సాగుతుంది. ఆ సమస్యలేమిటీ, శంతలి వాటిని ఎలా పరిష్కరించిందీ, చివరికి ఆమె తన బావను కలుసుకుందా... అన్నది కథ. విద్యాబుద్ధులూ ధైర్యమూ ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా నెగ్గుకురావచ్చని చెప్పే కథ.

- పద్మ

శంతలి (జానపద నవల)
రచన:
శెట్టిపల్లి అరుణా ప్రభాకర్‌
పేజీలు: 152; వెల: రూ.120/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


విషాద గాథ

తిమింగలాలను వేటాడి వాటినుంచి తీసిన నూనెను అమ్ముకోవడం పందొమ్మిదో శతాబ్దపు తొలినాళ్లలో పెద్ద వ్యాపారం. నవలలో ప్రధాన పాత్ర ఆహబ్‌- మాబీడిక్‌ అనే తిమింగలంతో జరిగిన పోరాటంలో ఒక కాలుని పోగొట్టు కుంటాడు. అయినా దానిమీద ప్రతీకారం తీర్చుకోవాలని పంతం పడతాడు. దాన్ని కనిపెట్టి, తన శక్తినంతా ఉపయోగించి పోరాడి బలైపోతాడు. హెర్మన్‌ మెల్‌విల్లీ రాసిన ‘ద వేల్‌’ అనే ఈ ట్రాజెడీ నవల ఆయన జీవితకాలంలో అంతగా ఆదరణ పొందలేదు కానీ, ఆ తర్వాత అద్భుతమైన రచనగా ప్రముఖ రచయితల మన్ననలందుకుంది. తిమింగలాల వేట మీదా, మనిషికీ సముద్రంలోని జంతుజాలానికీ మధ్య జరిగే పోరాటాల మీదా ఆసక్తి ఉంటే యాభై ఏళ్లనాటి ఈ తెలుగు అనువాదం చదివిస్తుంది.

- శ్రీ

మాబీడిక్‌ (నవల)
అనువాదం: ఆచార్య పింగళి లక్ష్మీకాంతం
పేజీలు: 240; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655


ఉపాధ్యాయుడి జీవితకథ

పాఠాలు చెప్పి విద్యార్థుల జీవితాలను చక్కదిద్దే ఉపాధ్యాయులు తమ జీవితానుభవాలను అక్షరబద్ధం చేస్తే అది సమాజానికి మరెన్నో విషయాలు తెలియజేస్తుందనడానికి ఉదాహరణ ఈ పుస్తకం. ధర్మవరంలో తాను చదివిన బడి నుంచి, అధ్యాపకుడిగా పనిచేసిన కళాశాలల వరకూ సాగిన ప్రయాణంలో తాను గమనించిన అంశాలన్నిటినీ రచయిత స్పష్టంగా వివరించారు. విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకుల ఆలోచనా విధానాల్నీ, ఊళ్లలో కులసంఘాల దౌర్జన్యాల్నీ ఎత్తిచూపారు. వ్యవస్థలోని లోపాల వల్ల ఉపాధ్యాయులకు ఎదురయ్యే అవస్థల్ని చెప్పారు. పనిచేసే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధ్యాయులు పడే తిప్పల్ని కళ్లకు కట్టారు. నిజానికి దీన్ని ఒక రాష్ట్ర విద్యావ్యవస్థ, సంక్షేమ గురుకులాల చరిత్ర అనవచ్చు.

- సుశీల

నేను నా బడి
రచన: డా।।ఎస్‌.ఎస్‌.గిరిధరప్రసాద్‌ రాయ్‌
పేజీలు: 244; వెల: రూ.150/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


ఎత్తుకు పైఎత్తులు 

దాత్తమైన ఇతివృత్తాలూ, అనూహ్య మైన మలుపులతో విశ్వప్రసాద్‌ రాసిన రెండు అపరాధ పరిశోధక నవలలు నవతరం పాఠకుల కోసం మార్కెట్లోకి వచ్చాయి. పోలీసు యంత్రాంగానికీ, డిటెక్టివ్‌ బృందానికీ సవాలు విసిరినవారు దుష్ట పాత్రలు కాకపోవటం వీటి విశేషం. చట్టపరిధిని ధిక్కరించి అసమానతలు లేని కొత్త ప్రపంచాన్ని సృష్టిం చాలనే సదాశయం వీరిది. జగదీశ్వర్‌  వేసిన పథకాలూ, చేసిన సాహస కృత్యాలూ ‘జోకర్‌’లో ఆకట్టుకుంటాయి. రాబిన్‌హుడ్‌లాంటి యువకుడు అత్యాధునిక రాకెట్‌ ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేయటం ‘జానీవాకర్‌’ నవలా సారం. వీరి ఎత్తులకు పైఎత్తులు వేసే డిటెక్టివ్‌ భగవాన్‌ బృందం మేధాశక్తి మురిపిస్తుంది. ఈ రెండు నవలలూ ఉత్కంఠభరిత కథా సంవిధానంతో ఆకట్టుకుంటాయి. నీతి, న్యాయం, ధర్మాలదే అంతిమ విజయమని నిరూపిస్తాయి. ప్రతిభావంతమైన సన్నివేశాల అల్లిక, భావగర్భితమైన సంభాషణలూ, విశిష్ట భాషాశైలీ ఈ నవలల పఠనీయతను పెంచాయి.

- సీహెచ్‌. వేణు

 
జోకర్‌
పేజీలు: 296; వెల: రూ.250/-
జానీవాకర్‌
పేజీలు: 200; వెల: రూ.150/-
రచన: విశ్వప్రసాద్‌
ప్రతులకు: ఫోన్‌: 9866115655


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న