దేవుళ్లు కొలువైన గాజులు..! - Sunday Magazine
close

దేవుళ్లు కొలువైన గాజులు..!

గాజులు అంటే... మెరిసే చెక్కుళ్లేనా... ఎనామిల్‌ చమక్కులేనా... రంగు రాళ్ల తళుకులేనా... వీటికి భిన్నంగా దేవతా రూపాలను అద్దుకుని సరికొత్తగా టెంపుల్‌ జ్యువెలరీతో వస్తున్నాయి! అతివల చేతులకు అదనపు సొబగులు అద్దుతూ నిండుదనాన్ని తెచ్చిపెడుతున్నాయి.

ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా... ఏ వేడుకకైనా వెళ్లాలన్నా... అందరిలో అందంగా కనిపించడానికి అమ్మాయిలు కాస్త ముందు నుంచే సిద్ధమైపోతుంటారు. చీరా, హారాలే కాదూ చేతి గాజుల విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఎంపిక చేసుకుంటుంటారు. మెరిసే పట్టుచీరలకూ, గ్రాండ్‌ లుక్‌ డ్రెస్సుల మీదకూ సాదా గాజులు మరీ సింపుల్‌గా కనిపించేస్తాయి. అందుకే, అందరి చూపునూ చేతి మీదకు తిప్పుకునే ఒకటే పెద్ద గాజును వేసుకోవడానికే మొగ్గు చూపిస్తున్నారు నేటితరం అమ్మాయిలు. మరి, చేతినంతటినీ మెరిపించే ఆ ఒకే ఒక్క గాజు మరెంత ప్రత్యేకంగా ఉండాలి! అందుకోసమే దేవీ దేవతల రూపాలతో రకరకాల థీమ్‌ల గాజుల్ని రూపుదిద్దుతున్నారు తయారీదారులు.

నిజానికి బంగారు ఆభరణాల్లో దేవతా రూపాలను చొప్పించడం అనేది కొత్త ట్రెండేమీ కాదు. నగలు చేయించుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచే లక్ష్మీదేవీ లాకెట్టూ, నెక్లెసూ, హారమూ, ఉంగరమూ అంటూ దేవతా మూర్తుల ఆకారాల ఆభరణాలు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ ట్రెండూ మారుతోందిగా. అలా, దేవుళ్ల విగ్రహాల్ని మరింత ట్రెండీగా నగల్లో పొదగడం ప్రారంభమైపోయింది. ఓవైపు భక్తినీ, మరోవైపు ఫ్యాషన్నీ రంగరిస్తే పుట్టుకొచ్చిన టెంపుల్‌ జ్యువెలరీ బాగా ఫేమసైపోయింది. ఇప్పుడదే ఫ్యాషన్‌ హారాలూ, వడ్డాణాలూ, అరవంకీల్నీ దాటేసి చేతిగాజుల్లోకీ చేరిపోయిందన్నమాట.

టెంపుల్‌ థీమ్‌తో ఉండే ఈ భారీ గాజుల్ని విడిగానే కాకుండా హారాలకు మ్యాచింగ్‌లానూ వేసుకుంటున్నారు. లక్ష్మీదేవీ విగ్రహరూపులున్న గాజు చేయికి వేసుకున్నామంటే అది మెడలో వేసుకున్న కాసుల పేరుకు ఇట్టే మ్యాచ్‌ అయిపోతుంది. అంతేనా, సీతారాముల కాసుల గాజులు రామపరివార హారానికీ ఎంచక్కా సరిపోతాయి. ఇవే కాదు... వేంకటేశ్వర స్వామీ, రాధాకృష్ణా, గణనాథుడూ, శివపార్వతులూ... ఇలా ఎందరో దేవీ దేవతల రూపాలను ఎంతో పొందికగా పేర్చుకుంటూ తయారుచేసిన గాజులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. సాదాగానే కాదు- పచ్చలూ, కెంపులూ, ముత్యాలూ లేదంటే రంగు రాళ్లవంటి అదనపు హంగులతోనూ ఆకట్టుకుంటున్నాయి. భక్తి మాట పక్కనుంచితే ఈ గాజుల నయాలుక్‌... కొత్తదనం కోరేవారి మనసునూ దోచేస్తుందనడంలో మాత్రం సందేహం లేదు. కాదంటారా?!


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న