సంగమేశ్వరం... ఇక్కడ స్వామి స్వయంభువు! - Sunday Magazine
close

సంగమేశ్వరం... ఇక్కడ స్వామి స్వయంభువు!

పరమేశ్వరుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రాలలో ఒకటి సంగమేశ్వర ఆలయం. సాగర తీర ప్రాంతంలో కొలువై గంగా-పార్వతీ సమేతంగా దర్శనమిచ్చే సంగమేశ్వరుడిపైన మహాశివరాత్రి సమయంలో సూర్యకిరణాలు పడతాయని అంటారు. కోరిన కోర్కెలు తీరుస్తూ, సకల శుభాలనూ కలిగించే ఈ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. ఈ మహిమాన్వితమైన క్షేత్రానికి కొన్ని శతాబ్దాల చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయి.
విశాలమైన ప్రాంగణంలో అత్యంత శోభాయమానంగా కనిపిస్తుంది సంగమేశ్వర ఆలయం. స్వామి సన్నిధిలో ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందనేది భక్తుల నమ్మకం. ఇదే విశ్వాసంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, సంగమేశ్వరం గ్రామంలోని సంగమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అయిదు ఉభయ క్షేత్రాలలో- ఉభయ కాళేశ్వరాలు, ఉభయ నాగేశ్వరాలు, ఉభయ ముక్తేశ్వరాలు, ఉభయ రామేశ్వరాలు, ఉభయ సంగమేశ్వరాలలో నాగాయలంక సంగమేశ్వర స్వామి ఆలయం ఒకటని పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో పుట్టిన కృష్ణ ఇక్కడకు చేరుకునేసరికి రెండు పాయలుగా చీలిందట. అందులో ఒకటి సముద్రంలో కలుస్తుందనీ ఆ పవిత్ర ప్రదేశమే సంగమేశ్వరమనీ చెబుతారు. ఏటా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు ఇక్కడకు చేరుకుని సముద్రంలో స్నానాలు చేసి ఆ తరువాత స్వామిని దర్శించు కోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు.

స్థలపురాణం
కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో దేవతలు స్వయంగా నిర్మించిన శివలింగం ఉండేదట. అయితే ఎవరూ దాన్ని చూడకపోవడంతో ఓ సారి స్వామి కొందరు భక్తులకు కలలో కనిపించి తన ఉనికిని తెలియజేశాడట. ఆ మర్నాడు భక్తులు స్వామి చెప్పిన చోటకు వెళ్లి పలుగుతో తవ్వేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో పలుగు శివలింగానికి తగిలి రక్తం ఓ కాలువలా తూర్పుదిక్కువైపు
ప్రవహించి సముద్రంలో కలిసిందట. ఆ తరువాత స్వామి శివలింగాన్ని వెలికితీసిన భక్తులు ఓ ఆలయం నిర్మించి అందులో లింగాన్ని స్థాపించారట. అయితే క్రీస్తుశకం 1108-1206 మధ్య కాలంలో తీరాంధ్ర దేశాన్ని పాలించిన వెలనాటి దుర్జయల వంశస్థులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని అంటారు. తర్వాత వచ్చిన రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారనీ, ఆ వివరాలన్నీ ఆలయ ప్రాంగణంలోని శిలపైన ఉంటాయనీ అంటారు.
ఇవీ ప్రత్యేకతలు
ఈ ఆలయంలో ఏడాది మొత్తం చేసే పూజలు ఒకెత్తయితే శివరాత్రి రోజున నిర్వహించే కార్యక్రమాలు మరొకెత్తు. ఇక్కడ శివరాత్రి మొదలుకొని కొన్నిరోజులపాటు స్వామిపైన ఉదయం 5.40 నుంచి 6.20 గంటల మధ్యలో సూర్యకిరణాలు పడతాయి. ఆ సమయంలో స్వామికి అభిషేకార్చన చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. అందుకే వివిధప్రాంతాల్లో ఉండేవారు శివరాత్రి సమయంలో ఆలయానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఆలయంలో దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే వినాయకుడిని గరికతో పూజిస్తే మంచిదని చెబుతారు.  అదేవిధంగా ఈ ప్రాంగణంలోని నాగేంద్ర స్వామికి అభిషేకం, పూజలు చేస్తే సంతానం కలుగుతుందనీ అంటారు. బాలాత్రిపురసుందరి, మహిషాసురమర్దని, కాలభైరవుని విగ్రహాలూ ఈ గుడి ప్రాంగణంలో దర్శనమిస్తాయి. మహాశివరాత్రి సమయంలో కల్యాణ ఉత్సవాలూ, మాఘమాసం బహుళ త్రయోదశి నాడు మూడు రోజులపాటు కల్యాణ ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలూ కన్నులపండుగ్గా ఉంటాయి.

ఎలా చేరుకోవచ్చు
విజయవాడ నుంచి కరకట్ట రహదారి మీదుగా అవనిగడ్డ వెళ్లే బస్సుల ద్వారా అవనిగడ్డకూ, అక్కడి నుంచి నాగాయలంకకూ చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సు లేదా ఆటోలూ, ఇతర ప్రయివేటు వాహనాలూ ఉంటాయి. విజయవాడ నుంచి పామర్రు, గుడివాడ, అవనిగడ్డ లేదా మచిలీపట్నం మీదుగా ఇక్కడకు రావొచ్చు. గుంటూరు నుంచి వచ్చే వారు ముందుగా రైలు, బస్సు ద్వారా రేపల్లె పట్టణానికి చేరుకోవాలి. అక్కడి నుంచి నాగాయలంకకు చేరుకొని ఆ తరువాత సంగమేశ్వరానికి వెళ్లొచ్చు.

- ముత్తా నారాయణరావు, ఈనాడు, అమరావతి
ఫొటోలు: పేర్ల వేణు, న్యూస్‌టుడే, నాగాయలంక

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న