సోషల్‌ నెట్‌వర్కే పెట్టుబడి! - Sunday Magazine
close

సోషల్‌ నెట్‌వర్కే పెట్టుబడి!

‘సోషల్‌ కామర్స్‌’ గురించి విన్నారా... ఈ పదాలు కొత్తగా ఉన్నాయి కదూ! మరేం లేదు, సోషల్‌ మీడియా వేదికలమీద జరిగే వ్యాపారానికే ‘సోషల్‌ కామర్స్‌’ అని పేరు. సోషల్‌ మీడియా వినియోగదారులు అక్కడ తమ వ్యక్తిగత ఇష్టాలూ, అభిప్రాయాలతోపాటు వివిధ రకాల వస్తువుల్ని అమ్మకానికి పెడుతూ చిరు వ్యాపారులుగా మారిపోతున్నారు. ఆ విభాగంలోకి ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చేశాయి కూడా. అలాంటివే ఈ సంస్థలు.

ఐఐటీయన్ల షాప్‌ 101

దేశంలో సోషల్‌ కామర్స్‌ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న పెద్ద సంస్థల్లో ముంబయికి చెందిన షాప్‌101 ఒకటి. అభినవ్‌ జైన్‌ తన ఇద్దరు స్నేహితులతో కలిసి 2015లో దీన్ని ప్రారంభించారు. ముగ్గురూ ఐఐటీ పూర్వ విద్యార్థులే. సోషల్‌ మీడియా ద్వారా అమ్మకాలు జరుపుతూ చైనా, బ్రెజిల్‌, ఇండోనేషియా లాంటి దేశాల్లో చాలా కంపెనీలు విజయవంతమవుతుండటాన్ని కొన్నేళ్ల కిందటే గమనించారు. దాంతో తమ కార్పొరేట్‌ ఉద్యోగాల్ని వదిలి ఇటువైపు అడుగులు వేశారు. గృహిణులూ, విద్యార్థులూ సోషల్‌ మీడియా వేదికల్లో వివిధ వస్తువుల్ని అమ్మగలిగేలా షాప్‌101ను రూపొందించారు. తమతో భాగస్వామ్యం ద్వారా రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరైనా వ్యాపారులుగా మారొచ్చనేది వీళ్లు చెప్పేమాట. హస్త కళాఖండాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు, గృహోపకరణాలు... లాంటి వందకుపైగా విభాగాల్లో లక్షకు పైగా వస్తువులు ‘షాప్‌101’లో ఉంటాయి. వీటిని ఎవరైనా తమ సోషల్‌ మీడియా వేదికలద్వారా అమ్మవచ్చు. ఈ సంస్థకు ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల నుంచి రీసెల్లర్స్‌ ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటివరకూ రూ.1000 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని చెబుతారు సంస్థ వ్యవస్థాపకులు.

గ్రామాల్లోనూ ‘సిటీమాల్‌’!

గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే ‘సిటీమాల్‌’- ఆప్‌ ద్వారా కిరాణా సామాన్లను డెలివరీ చేసే సంస్థ. ఇతర ఈ-కామర్స్‌ సంస్థల మాదిరిగానే సిటీమాల్‌ ఆప్‌లో ఎవరైనా పచారీ సామాన్లూ, సబ్బులూ, అత్తర్లలాంటి వాటిని ఆర్డర్‌ ఇవ్వొచ్చు. కాకపోతే ఆ సరుకుల్ని తెచ్చి ఇచ్చేది డెలివరీ బాయ్‌ కాదు, స్థానికంగా ఉండే ఒక వ్యక్తి. వీళ్లకి ‘కమ్యూనిటీ లీడర్లు’గా పేరు పెట్టారు ఆ సంస్థ వ్యవస్థాపకులు అంగద్‌ కిక్లా, నైషీల్‌ వర్ధన్‌. ఇది ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ల ఆధారంగా పనిచేస్తుంది. నగరాలతోపాటు పట్నం, పల్లెల్లోనూ ఉండే కమ్యూనిటీ లీడర్లు తమ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల ఆర్డర్లని నేరుగా లేదంటే వాట్సాప్‌ ద్వారా తీసుకుంటారు. ఆ సరుకుల్ని సదరు లీడర్‌ సిటీమాల్‌ ఆప్‌ద్వారా ఆర్డర్‌ ఇస్తారు. ఆ వస్తువులు మర్నాడు ఆ లీడర్‌ దగ్గరకు చేరతాయి. వారిద్వారా కొనుగోలుదారుకి అందుతాయి. సంస్థ అందించే ఆఫర్ల గురించీ, కొత్త ఉత్పత్తుల గురించీ కంపెనీ ఈ లీడర్లకు వాట్సాప్‌లో లింకులు పంపిస్తే... వాళ్లు వాటిని తమ స్నేహితులూ, బంధువులకు షేర్‌ చేస్తారు. కొనుగోలుదారు ఆ లింకు ద్వారా ఆప్‌లో కొనుగోలు చేయొచ్చు లేదంటే వాట్సాప్‌లోనే ఆర్డర్లు ఇవ్వొచ్చు. ఎలా కొన్నా కమ్యూనిటీ లీడర్‌కి కొంత కమిషన్‌ అందుతుంది. ప్రస్తుతం హరియాణాలోని రేవారీ, సోనిపట్‌, పటౌడీ, రోహ్‌తక్‌, పానిపట్‌ లాంటి ఎనిమిది ప్రాంతాల్లో సిటీమాల్‌ పనిచేస్తోంది. వీటి చుట్టుపక్కల సంస్థకు 20 వేల కమ్యూనిటీ లీడర్లు ఉన్నారు. వచ్చే రెండేళ్లలో 200 నగరాలకు విస్తరించాలనేది వీరి ప్రణాళిక.

ఎక్కడనుంచైనా పని!

ర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌... అనగానే ఐటీ, కార్పొరేట్‌ ఉద్యోగాలే గుర్తొస్తాయి. కానీ తమ వ్యాపారంలో భాగస్వాములైతే ఎవరైనా ఎక్కడినుంచైనా పని చేయొచ్చని చెబుతోంది సోషల్‌ కామర్స్‌ సంస్థ గ్లోరోడ్‌. ఆన్‌లైన్లో దుస్తులూ, జ్యువెలరీ, కాస్మెటిక్స్‌ అమ్మే సంస్థ ఇది. వీరి ఉత్పత్తుల్ని రీసెల్లర్స్‌ ద్వారా అమ్ముతారు. ఎవరైనా ఈ వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే అక్కడ కనిపించే ఉత్పత్తుల లింకుల్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయొచ్చు. అవి ఎవరికైనా నచ్చి కొంటే బదులుగా గ్లోరోడ్‌ నుంచి రీసెల్లర్‌కు కొంత మొత్తం అందుతుంది. ఈ రీసెల్లర్స్‌నే మైక్రో ఇన్‌ఫ్లుయన్సర్స్‌ అని చెబుతారు. ఉత్పత్తుల్ని ఎవరిచేతైనా కొనిపించడం వరకే ఈ మైక్రో ఇన్‌ఫ్లుయన్సర్ల పని... వాటికి డబ్బు చెల్లింపు, సరఫరా, రిటర్న్‌ చేయడంలాంటి పనులన్నీ గ్లోరోడ్‌ చూసుకుంటుంది. ఒక ఉత్పత్తి ధర ఎంతన్నది గ్లోరోడ్‌ నిర్ణయిస్తుంది. దానిపైన ఎంత లాభం పొందాలనుకుంటున్నారో ఆ మొత్తం జోడించి రీసెల్లర్స్‌ అమ్మకానికి పెట్టొచ్చు. తమకు దాదాపు కోటిమంది రీసెల్లర్స్‌ ఉన్నారనీ వీరిలో అధిక శాతం మహిళలేననీ చెబుతోంది గ్లోరోడ్‌. ప్రఖ్యాత ఈ కామర్స్‌ సంస్థల మాదిరిగా తాము ఎక్కువ మార్జిన్లు తీసుకోకపోవడంవల్ల గ్లోరోడ్‌ ద్వారా అమ్మకందారూ, కొనుగోలుదారూ ఇద్దరికీ లాభమని చెబుతారు సంస్థ సహ వ్యవస్థాపకుడు కునాల్‌ సిన్హా. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ వీరి ఉత్పత్తులు వెళ్తున్నాయి.


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న