ఆయన చేతులు... లక్ష సర్జరీలు చేశాయి! - Sunday Magazine
close

ఆయన చేతులు... లక్ష సర్జరీలు చేశాయి!

నాలుగు దశాబ్దాలుగా వైద్యవృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌... చలనంలేని కాళ్లకు చైతన్యం తెప్పించారు. వంగిన వెన్నులకు దన్నందించారు. విరిగిన చేతుల్ని తిరిగి బాగుచేశారు. తిరుపతి బర్డ్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గానూ సేవలందించిన డాక్టర్‌ గుడారు జగదీష్‌ది లక్షకుపైగా శస్త్రచికిత్సలు చేసిన అనుభవం... రిటైర్మెంట్‌ తర్వాతా సేవల్ని కొనసాగిస్తున్నారాయన.

తిరుపతిలోని ‘బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సర్జరీ, రిసర్చ్‌ అండ్‌ రీహేబిలిటేషన్‌’ దక్షిణాసియాలోనే అతి పెద్ద ఎముకల ఆసుపత్రి. 37 ఏళ్లపాటు వైద్యుడిగా, బోధకుడిగా, డైరెక్టర్‌గా ఆ వైద్యాలయంలో సేవలు అందించారు డాక్టర్‌ గుడారు జగదీష్‌. ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ వ్యాఘ్రేశ్వరుడి శిష్యుడిగా కెరీర్‌ని ఆరంభించిన జగదీష్‌... వందలమంది యువ వైద్యులకు మార్గనిర్దేశం చేశారు. అంగవైకల్యంతో పుట్టినవారికీ, దివ్యాంగులకూ, ప్రమాదాలబారిన పడ్డవారికీ తన శస్త్రచికిత్సలతో పునర్జన్మనిచ్చారు.  ఫ్లోరైడ్‌ బాధితుల కాళ్ల వంకర్లు సరిచేయడం, మోకాళ్ల, వెన్నెముక శస్త్రచికిత్సలూ ఇలా ఇప్పటివరకూ 1.28 లక్షల శస్త్రచికిత్సలు నిర్వహించారు. దేశవ్యాప్తంగానూ అనేక వైద్య శిబిరాల్లో పాల్గొని పోలియోకి ఉచిత స్క్రీనింగ్‌, శస్త్రచికిత్సలు చేశారు.

రోగుల దగ్గరకే వైద్యం...

2019లో బర్డ్‌ ఆసుపత్రి డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన డాక్టర్‌ జగదీష్‌... తన సేవల్ని మాత్రం కొనసాగిస్తున్నారు. నిరక్షరాస్యులూ, నిరుపేదలూ అవగాహన లేక ఎముకల సమస్యలతో దీర్ఘకాలం ఇబ్బందులు పడుతున్నారని తన అనుభవంలో గుర్తించారు. అందుకే రిటైరయ్యాక తానే రోగుల దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే మత్య్స్యకారుల్లో ఎముకల సమస్యలు అధికంగా ఉండటాన్ని గుర్తించి వారుండే ప్రాంతాలకు వెళ్తున్నారు. మత్స్యకారులు ఎక్కువగా ఉండే ప్రకాశం జిల్లాలోని కరేడు గ్రామాన్ని ఏడాదిన్నర కిందట దత్తత తీసుకున్నారు. గ్రామంలో ఆర్థోపెడిక్‌ సమస్యలతో బాధపడేవారందరికీ చికిత్స చేసి నయంచేయడమే లక్ష్యంగా లింగారెడ్డి అన్నపూర్ణమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వైద్యసేవల్ని ఉచితంగా అందిస్తున్నారు. నెలలో నాలుగు రోజులు ఈ గ్రామానికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడకు ఈ జిల్లాతోపాటు ఇరుగుపొరుగు జిల్లాల నుంచీ చికిత్సకోసం రోగులు వస్తుంటారు. రోజుకు దాదాపు 60-70 మందికి వైద్యసేవలతోపాటు మందులనూ, వారికి అవసరమయ్యే పరికరాలనూ ఉచితంగా అందజేస్తుంటారు. ఫ్లోరైడ్‌ సమస్య అధికంగా ఉండే ప్రకాశంతోపాటు చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు ప్రతినెలా వెళ్తుంటారు. ఈయన దత్తత గ్రామాల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి కూడా ఉంది. అక్కడ జీఎన్‌ఆర్‌ ట్రస్టుద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఒంగోలులోని రమేష్‌ సంఘమిత్ర హాస్పిటల్స్‌, గుంటూరు వడ్లమూడిలోని డీవీసీ ట్రస్టు హాస్పిటల్‌తోపాటు తాను సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ద్వారకా తిరుమలలోని విర్డ్‌ ట్రస్టు హాస్పిటల్‌... ఇలా పలుచోట్లకు తరచూ వెళ్తూ శస్త్రచికిత్సలు చేస్తున్నారు. రాయలసీమతో ఈయనది సుదీర్ఘ అనుబంధం. దాన్ని కొనసాగించాలని తిరుపతిలోని రాష్ట్రీయ సేవా సమితి కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి కర్ణాటక, తమిళనాడుల నుంచి కూడా రోగులు వస్తుంటారు.

డాక్టర్‌... తండ్రి కోరిక!

కడప జిల్లా పుల్లంపేట మండలంలోని టి.కమ్మపల్లికి చెందిన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు జగదీష్‌. తల్లిదండ్రులు లీలావతమ్మ, లక్ష్మయ్యనాయుడు. డాక్టర్‌ కావాలన్న తన లక్ష్యం నెరవేరకపోవడంతో పిల్లల చదువుల కోసం కుటుంబాన్ని తిరుపతికి మార్చారు లక్ష్మయ్య. తండ్రి కోరికనే తన లక్ష్యంగా మార్చుకున్న జగదీష్‌ ఇంటర్మీడియెట్‌ వరకూ తిరుపతిలో చదివారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, మణిపాల్‌ మెడికల్‌ కాలేజీ నుంచి ఆర్థోపెడిక్స్‌లో ఎం.ఎస్‌. పూర్తిచేశారు. ఆయన శ్రీమతి నిర్మలాదేవి గైనకాలజిస్టు. వీరికి కవల పిల్లలు కల్యాణ్‌, కార్తిక్‌. కల్యాణ్‌ లండన్‌లో యూరాలజిస్టుగా స్థిరపడ్డారు. కార్తిక్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌. హైదరాబాద్‌లో ‘మా ఆర్థోపెడిక్‌ హాస్పిటల్‌’ను నిర్వహిస్తున్నారు. జగదీష్‌ ఇక్కడా తన సేవల్ని అందిస్తారు. వేంకటేశ్వరస్వామి అంటే డాక్టర్‌ జగదీష్‌కు అమిత భక్తి. తన సేవలన్నీ ఆ స్వామి అనుగ్రహంగా భావిస్తారు. తుదిశ్వాస వీడేవరకూ వైద్య సేవలు అందిస్తూ రోగుల ముఖాల్లో చిరునవ్వు, వారి కుటుంబాల్లో ఆనందం నింపడంద్వారా జీవన సాఫల్యం పొందాలన్నదే తన లక్ష్యమని చెబుతారు. (వైద్యసేవల కోసం 9948428189లో సంప్రదించవచ్చు.)

- టి.ప్రభాకర్‌, ఈనాడు డిజిటల్‌,  ఒంగోలు


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న