ఉప్మా.. కొత్తగా చేద్దామా..! - Sunday Magazine
close

ఉప్మా.. కొత్తగా చేద్దామా..!

ఉప్మా అనగానే బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ లేదా సేమియాతో చకచకా కలిపేస్తుంటాం. తరచూ అలాగే చేస్తుంటే ఎప్పుడూ ఇదే ఉప్మానా... కాస్త కొత్తగా ట్రై చేయొచ్చు కదా అంటూ ఇంటిల్లిపాదీ అనడం ఖాయం కాబట్టి ఈసారి ఆ రవ్వలను పక్కన పెట్టేసి ఇలాంటి ఉప్మా రుచుల్ని వండితే సరి. బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదు... సాయంత్రం పూట స్నాక్స్‌ రూపంలోనూ తినొచ్చు.
 

బ్రెడ్‌ పనీర్‌తో...

కావలసినవి: బ్రెడ్‌స్లైసులు: నాలుగు, పనీర్‌ ముక్కలు: అరకప్పు, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, పసుపు: పావుచెంచా, కారం: చెంచా, దనియాలపొడి: అరచెంచా, ఉప్పు: తగినంత, జీలకర్ర: అరచెంచా, సెనగపప్పు: అరచెంచా, ఆవాలు: అరచెంచా, నూనె: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు.

తయారీ విధానం: ముందుగా పనీర్‌ ముక్కల్ని నాన్‌స్టిక్‌ పాన్‌లో దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయిపెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు వేయించుకుని పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తరుగు, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు... పసుపు, దనియాలపొడి, కారం వేసి కలపాలి. ఆ తరువాత బ్రెడ్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా వేయించి పనీర్‌ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దింపేయాలి.


కొర్రలతో..

కావలసినవి: కొర్రలు: కప్పు, నీళ్లు: రెండున్నర కప్పులు, ఆవాలు: అరచెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లం తరుగు: చెంచా, క్యారెట్‌: ఒకటి, బీన్స్‌: అయిదు, పచ్చిబఠాణీ: పావుకప్పు, పసుపు: పావుచెంచా, నూనె: మూడు పెద్ద చెంచాలు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, కొబ్బరి తురుము: పావుకప్పు.

తయారీ విధానం: కొర్రల్ని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి. కుక్కర్‌లో నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరుగు, టొమాటో ముక్కలు, క్యారెట్‌ తురుము, బీన్స్‌ ముక్కలు, పచ్చిబఠాణీ వేసి బాగా వేయించి పసుపు, కొర్రలు, తగినంత ఉప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి. రెండు కూతలు వచ్చాక స్టౌ కట్టేసి ఆ తరువాత కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపితే సరి.


ఓట్స్‌తో..

కావలసినవి: ఓట్స్‌: కప్పు, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూను, ఉల్లిపాయ: ఒకటి, బీన్స్‌, క్యారెట్‌, టొమాటో ముక్కలు: అన్నీ కలిపి పావుకప్పు, పచ్చిమిర్చి: మూడు, నిమ్మరసం: రెండు టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, కొబ్బరి తురుము: రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు రెబ్బలు: రెండు, అల్లం తరుగు: అరచెంచా, ఆవాలు: అరచెంచా, జీలకర్ర: అరచెంచా, సెనగపప్పు: చెంచా, పల్లీలు: రెండుటేబుల్‌ స్పూన్లు, పసుపు: పావుచెంచా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి ఓట్స్‌ను నూనె లేకుండా దోరగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, పల్లీలు వేయించుకుని కరివేపాకు, ఉల్లిపాయ తరుగు, కూరగాయల ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేయించుకుని ఓట్స్‌ వేసి ఓసారి కలపాలి. తరువాత పసుపు, తగినంత ఉప్పు, నిమ్మరసం, కొబ్బరితురుము, కొత్తిమీర తరుగు వేసి కొద్దికొద్దిగా నీళ్లు చల్లుతూ కలుపుతూ ఉండాలి. ఓట్స్‌ మెత్తగా అయ్యాయనుకున్నాక స్టౌ కట్టేయాలి.


ఇడ్లీ మసాలా ఉప్మా

కావలసినవి: ఇడ్లీలు: ఎనిమిది, ఉల్లిపాయలు: రెండు, టొమాటోలు: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంతరుగు: అరచెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, కొత్తిమీర: కట్ట, కారం: చెంచా, క్యారెట్‌: ఒకటి, క్యాప్సికం: ఒకటి, సాంబార్‌ పొడి: టేబుల్‌స్పూను, ఆవాలు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: టేబుల్‌స్పూను.  
తయారీ విధానం: ఓ గిన్నెలో ఇడ్లీలను తీసుకుని చేత్తో పొడిలా మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, సెనగపప్పు వేయించుకుని కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. నిమిషమయ్యాక క్యారెట్‌ తురుము, క్యాప్సికం, ఉల్లిపాయ, టొమాటో ముక్కలు వేయించి తగినంత ఉప్పు, కారం, సాంబార్‌పొడి వేసి వేయించి ఇడ్లీల మిశ్రమం వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టాలి. రెండుమూడు నిమిషాలయ్యాక కొత్తిమీర వేసి దింపేయాలి.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న