ఆద్యంతం ఉత్కంఠ - Sunday Magazine
close

ఆద్యంతం ఉత్కంఠ

తెలుగునాట పఠనాభిలాషను పెంచి, జనరంజకమైన డిటెక్టివ్‌ సాహిత్యాన్ని సృష్టించిన విశ్వప్రసాద్‌ ప్రసిద్ధ నవల ‘మాయలాడి’ ఆరు దశాబ్దాల తర్వాత పునర్ముద్రణగా వెలువడింది. 100 అధ్యాయాలతో అడుగడుగునా విభ్రాంతి కలిగించే సంఘటనలతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. గాలిలో ఎగిరే మనుషులు, మనుషుల్లాంటి రోబోలు, మీటలతో తెరుచుకునే భూగృహాలు, చండీరాణి ఎత్తులు, డిటెక్టివ్‌ భగవాన్‌ పైఎత్తులు, అసిస్టెంట్‌ రాంబాబు సాహసాలు ఆసక్తిని కలిగిస్తాయి. బిగువైన కథనం, మనసుకు హత్తుకునే భాషాశైలి, శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణల మేళవింపు దీని ప్రత్యేకతలు. ‘రహస్యాల్ని ఛేదించడమే కాదు- కొన్ని రహస్యాలను దాచడం కూడా మా వృత్తిలోని రహస్యం’ అన్న డిటెక్టివ్‌ భగవాన్‌ మాటలు నవల అల్లిక తీరుకు అద్దంపడతాయి.

- సీహెచ్‌.వేణు
 

మాయలాడి(నవల)
రచన: విశ్వప్రసాద్‌
పేజీలు: 318; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655


ఊరి జ్ఞాపకాలు

నిషికి పుట్టిపెరిగిన గడ్డపై ఉండే మమకారానికీ అక్కడి వారితో అనుబంధాలకీ అద్దంపట్టే కథలివి. పార్వతీపురంలోని ఈ బెలగాం కథల్ని చదువుతున్నంత సేపూ పాఠకులకు ఆ పరిసరాల్లోనే ఉన్న అనుభూతిని కలిగిస్తుంది కథనం. చదువు రాకపోయినా పక్కా బిజినెస్‌ బ్రెయిన్‌ ఉన్న ‘జిల్‌ జిల్‌ కిష్టప్ప’ తండ్రి ఉద్యోగాన్ని పొంది సుఖంగా జీవితాన్ని గడిపేస్తాడు. తన ఆకలి తెలుసుకోలేకపోయినా చుట్టూ ఉన్న పశుపక్ష్యాదుల కడుపు నింపడానికే బతికిన ‘ఈశ్వరుడు’ తల్లిని శోకసముద్రంలో ముంచి మాయమైతే, జట్కాబండి తోలే ‘బాలరాజు’ ఫొటో రామ్మందిరంలో గోడమీదికి ఎక్కి ఊరి ఆవేదనను పాఠకులకు పంచుతుంది. బెలగాం సెంటర్లో అలా ఒకసారి తిరిగొస్తే
కనిపించే బతుకు కథలకు మచ్చుతునకలివి.

- పద్మ
 

బెలగాం కథలు
రచన: ఓలేటి శ్రీనివాసభాను
పేజీలు: 164; వెల: రూ. 200/-
ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు


విచిత్రవ్యక్తి

రాబర్ట్‌ లూయిస్‌ స్టీవెన్సన్‌ రాసిన ఈ నవల ఆంగ్ల సాహిత్యంలో విశిష్ట రచన. అట్టర్సన్‌ మిత్రుడైన డాక్టర్‌ జెకిల్‌ తన ఆస్తి యావత్తు మిస్టర్‌ హైడ్‌కి చెందాలని రాస్తాడు. ఆ హైడ్‌ని కనిపెట్టే పనిలో ఉన్న అట్టర్సన్‌కి సన్నిహితుడైన రిచర్డ్‌ ద్వారా నమ్మలేని విషయాలు తెలిశాయి. పాడుబడినట్లున్న ఇంట్లో ఉండే ఒక వ్యక్తి దుర్మార్గపు పని చేయడం చూశాననీ, బాధితురాలికి పరిహారం ఇప్పించేందుకు అతని ఇంటికి వెళ్తే నగరంలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిపేరున చెక్‌ ఇచ్చాడనీ రిచర్డ్‌ చెబుతాడు. మంచివాడైన జెకిల్‌కీ క్రూరుడైన హైడ్‌కీ సంబంధమేమిటో తెలియాలంటే ఉత్కంఠ భరితంగా సాగే  నవల చదవాల్సిందే. పొగగూడు(చిమ్నీ), దర్శనహుండీ (బ్యాంక్‌ చెక్కు) లాంటి పదాలతో అచ్చతెలుగు అనువాదం ఆసక్తికరం.

- శ్రీ
 

మనిషిలో మనిషి(నవల)
అనువాదం: దాసు వామనరావు
పేజీలు: 96; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9866115655


పెరటితోటల పెంపకం

ప్రజలకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తను పెంచింది కరోనా. క్రిమిసంహారకాలూ రసాయన ఎరువులూ వాడని కూరగాయలూ పండ్ల కోసం అన్వేషణ చాలామందిని పెరటితోటలవైపు మళ్లిస్తోంది. సొంతిల్లూ పెరట్లో చోటూ లేనివాళ్లు డాబాలమీదా బాల్కనీల్లోనూ పండించడానికి సిద్ధ మవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన శాస్త్రవేత్త అయిన రచయిత రాసిన ఈ పుస్తకం సాగుకు సంబంధించిన ఎంతో సమాచారాన్ని అందజేస్తుంది. పెరటి తోట, మిద్దెతోట, చిన్న బాల్కనీ... స్థలాన్ని బట్టి ఏమేం పండించుకోవచ్చు, వర్టికల్‌ తరహాలో ఎలా పండించుకోవచ్చు. కాస్తో కూస్తో స్థలం ఉన్నవారు సేంద్రియ సాగు ఎలా చేయొచ్చు, ఆ పంటలకు చీడపీడలు సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలీ- లాంటి విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇళ్లలో పెంచుకోదగ్గ అలంకరణ మొక్కలు, ఆక్సిజన్‌ని అందించే మొక్కలు, పూల మొక్కల విశేషాలూ ఉన్నాయి. కొత్తవారికి స్ఫూర్తినిచ్చేందుకు కొందరు మిద్దెతోటల పెంపకందారుల వివరాలూ ఉన్నాయి.

- సుశీల
 

పొదరిల్లు (మిద్దెతోటల పెంపకం)
రచన: రావి చంద్రశేఖర్‌, ఎడ్ల శ్రీకీర్తన
పేజీలు: 155; వెల: రూ. 250/-
ప్రతులకు: ఫోన్‌- 9676797777


 


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న