బహుమతి కథలు - Sunday Magazine
close

బహుమతి కథలు

వివిధ పోటీల్లో బహుమతి వచ్చిన కథలన్నిటినీ కలిపి ఈ కథా సంపుటిని ప్రచురించారు రచయిత. అతిథిని దేవుడిలా చూడాలన్న మన సంప్రదాయమే అతిథి పాలిట దేవుడిగా మారడం ‘అతిథి(కి)దేవుడు’ కథలో కన్పిస్తుంది. మంచుకొండల్లో షూటింగ్‌ చేసిన చిత్రబృందానికి చివరి నిమిషంలో ముంచుకొచ్చిన ప్రమాదం కథలో ఉత్కంఠని రేకెత్తిస్తుంది. చుట్టూ మొక్కలతో పొదరిల్లులా ఇంటిని తీర్చిదిద్దుకున్న ఆనందరావుకి మున్సిపాలిటీ ఇచ్చిన బంపర్‌ ఆఫర్‌ ఏంటో దాన్ని అతడెలా వదిలించుకున్నాడో సరదాగా చెప్పే కథ ‘నీదే కానీ- నీదే కాదు’. ఊహించని ప్రమాదంతో మంచానపడ్డ కొడుక్కి తాను చెప్పాల్సిన ధైర్యవచనాలు కొడుకే చెబుతుంటే తల్లి ఆశ్చర్యపోయింది. ఆ కొడుకు కథ ‘కవచం’ ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. పుస్తకంలోని 14 కథలూ ఇలాగే విభిన్న అంశాలతో ఆకట్టుకుంటాయి. 

- సుశీల

అతిథి(కి) దేవుడు
రచన: పి.వి.ఆర్‌.శివకుమార్‌
పేజీలు: 135; వెల: రూ. 150/-

ప్రతులకు: ఫోన్‌- 9848787284


వైవిధ్యభరితం

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగే ప్రవర్తించాలని సామెత. మరి పలుదేశాల్లో స్థిరపడిన తెలుగువారు అక్కడి సమాజాలతో మమేకమవుతున్నారా, సంస్కృతీ సంప్రదాయాలను అర్థం చేసుకుంటున్నారా... అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ కథా సంకలనం. విదేశీయురాలితో కాపురం చేస్తూ తల్లిదండ్రుల కోసం స్వదేశంలో మరో పెళ్లి చేసుకున్న రమణ, బంధువుల మోసం తట్టుకోలేక భర్త ప్రాణాలు కోల్పోతే ఆ షాక్‌కి అల్జీమర్స్‌కి గురైన రేణు, మొదటిసారి కొడుకు పిలవగానే ఉత్సాహంగా అమెరికా వెళ్లిన జంట రెండోసారికే నీరసపడిపోయే పరిస్థితి రావడం... లాంటి కథావస్తువులు ఆలోచింపజేస్తాయి. విదేశీ జీవితాన్ని స్వదేశీ చింతనలోనే గడిపేయకూడదన్న సందేశాన్ని అందిస్తాయి కొన్ని కథలు.   

 - పద్మ

డయాస్పోరా తెలుగు కథానిక-2021
సంపాదకులు: వంగూరి చిట్టెన్‌ రాజు,
కె,గీత, శాయి రాచకొండ
పేజీలు:272; వెల: రూ. 150/-
ప్రతులకు: ఫోన్‌- 80963 10140


ప్రపంచ కథలు

వివిధ దేశాలకు చెందిన 14 అనువాద కథల సంపుటి ఇది. చాలా కథలు పాఠకుడి ఊహకు అందని విధంగా కొసమెరుపుతో ముగుస్తాయి. క్రూరుడైన ఒక దొంగ రెండుసార్లు దొంగతనం చేస్తూ ఒక ముసలమ్మ కంటబడతాడు. సాక్ష్యాన్ని రూపుమాపడానికి ఆమెను చంపేద్దామని వెళ్లిన అతను చప్పుడు చేయకుండా ఎందుకు తిరిగొచ్చాడో తెలియాలంటే ‘సాక్షి’ కథ చదవాల్సిందే. తమ హోటల్‌కి రోజూ వచ్చే వృద్ధురాలిని మొదట సహజమైన మానవత్వంతో ప్రేమగా చూసుకున్న యువతి ఆమె వీలునామాలో తనపేరు రాసిందని తెలిశాక త్వరగా చనిపోవాలని విషం కలిపే దుర్మార్గానికి ఒడికట్టడం ‘దయాహృదయ’లో కనిపిస్తుంది. నేటి సోషల్‌మీడియా పిచ్చిని గుర్తుచేస్తుంది ‘కళాకారుడు’. ఆయా కథకుల శైలి అనువాదంలో అందంగా ఒదిగింది.

- శ్రీ

దయాహృదయ(అనువాద కథలు)
అనువాదం: అమ్జద్‌
పేజీలు: 136; వెల: రూ. 100/-
ప్రతులకు: ఫోన్‌- 9849787284


ప్రేమ ప్రబంధం

కథకుడిగా పేరు తెచ్చుకున్న గోపిని కరణ్‌ రాసిన ఈ తొలి నవల ఆహ్లాదంతోపాటు ఉత్కంఠను కలిగించే ప్రేమ ప్రబంధం. సినిమాలూ, థియేటర్లూ తెలుగు ప్రజల సాంస్కృతిక జీవితాల్లో విడదీయరాని భాగం.అలాంటి ‘శ్రీ బాలాజీ టాకీస్‌’ కేంద్రంగా సాగే ఈ నవల కరోనా పరిణామాల నేపథ్యంతో రాసినది. యువతీయువకుల మధ్య అంకురించే ప్రేమ సఫలమయ్యే క్రమంలో సామాజిక అవరోధాలు, సంక్లిష్టతలు, వాటిని అధిగమించే ప్రేమికుల తెగువ... ఇవన్నీ చక్కటి కథాకథనంలో చిత్రితమయ్యాయి. జికె.నాయుడు, స్నేహలతారెడ్డిల ప్రేమకథ ఉద్విగ్నంగా సాగుతుంది. పాత్రచిత్రణలోని నేర్పు మూలంగా ఇందులోని వ్యక్తులందరూ వాస్తవికమైనవారుగా కళ్ళముందు కదలాడతారు. రచయితకు సినీ దర్శకశాఖలో అనుభవం ఉన్నందున సంఘటనలను మనసుకు హత్తుకునేలా దృశ్యాత్మకంగా రూపుకట్టించారు. సహజసిద్ధమైన సంభాషణలు ఆకట్టుకుంటాయి.

- సీహెచ్‌. వేణు

శ్రీబాలాజీ టాకీస్‌ ప్రేమప్రబంధం

రచన: కరణ్‌ గోపిని
పేజీలు: 344; వెల: రూ. 250/-  
ప్రతులకు: ఫోన్‌- 98487 87284


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న