మాట ఖరీదు - Sunday Magazine
close

మాట ఖరీదు

బి.నర్సన్‌

‘‘అమ్మాయికి ఫోన్‌ చేశారా’’ అంది ప్రమీల వంటగదిలోంచి.టిఫిన్లు కాగానే ఆమెకు రోజూ గుర్తొచ్చే పని ఇదొకటి. ఇలా ఆమె ఆర్డరేయగానే అమ్మాయికి ఫోను కలిపి ‘ఏంటి విశేషాలు’ అని ఓ మాటడిగి స్పీకర్‌ ఆన్‌చేసి కూరగాయలు తరుగుతున్న భార్య చెవి దగ్గర ఫోను పట్టుకోవడం ఆయనకో డ్యూటీ అయిపోయింది. ‘ఆ... ఏంటే ఉషా... పిల్లాడు రాత్రి బాగా నిద్రపోయాడా, మొన్నటిలాగే నడిరాత్రి లేచి ట్యాబ్‌ కావాలని ఏడ్చాడా, ఇడ్లీలు మెత్తగా వచ్చాయా, పచ్చడి రెండ్రోజుల కోసం ఒకేసారి పట్టేయ్‌...’ ఇలా సాగుతుంది ముచ్చట నిత్యనూతనంగా.
దామోదరం చదువుతున్న పేపర్‌ పక్కన పెట్టి మెల్లగా లేచి టేబుల్‌ పైనున్న మొబైల్‌ ఫోను అందుకుని కూతురు నంబర్‌కు కాల్‌ కలిపాడు. రింగయి ఆగిపోయింది. స్పీకర్‌ పెట్టినందువల్ల ఆ శబ్దం వంటగదిలోకి కూడా వినిపించింది.
‘‘పది నిమిషాలాగి మళ్లీ ఓసారి చేయండి...’’ అంటుండగా ఫోను రింగయింది.
‘‘మాట్లాడు’’ అన్నాడు ఫోను ఆమె చేతికి ఇస్తూ.
‘‘ఇప్పుడే హాస్పిటల్‌ నుంచి వచ్చానమ్మా, ఓపిక లేదు’’ అంది ఉష.
‘‘హాస్పిటలా... ఎవరికి ఏమైందే ఉషా’’ అనడిగింది ప్రమీల ఆదుర్దాగా.
‘‘అంత కంగారేమీ లేదు. అందరం బాగానే ఉన్నాం.’’
‘‘మరి...’’
‘‘టింకూగాడికి వచ్చే నెల ఐదుకి మూడేళ్లు నిండుతాయి కదా. మమ్మీ డాడీ అని కూడా అనటం లేదు. ఏబీసీడీ వన్‌ టూ త్రీ అంటాడు కానీ మరో మాట అనడు.’’
‘‘తాతా అమ్మమ్మా అని ఎప్పుడో ఏడాది క్రితం తెలిసీ తెలియనప్పుడు అన్నాడు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అదీ లేదు’’ అంది ప్రమీల.
‘‘అదే కదా... ఇక్కడ రెయిన్‌బోలో స్పీచ్‌ థెరపిస్ట్‌ను కలిసి వచ్చాం.’’
‘‘ఏమన్నారు!’’
‘‘ఇప్పటికే ఎన్నో మాట్లాడాల్సింది. అందరి పిల్లలతో పోలిస్తే ఏడాది వెనకబడ్డాడు. ఇలాగే వదిలేస్తే ఇబ్బందే. ఎక్కువసేపు స్క్రీన్స్‌- అంటే టీవీ, మొబైల్‌, ట్యాబ్‌ వంటివి చూస్తే నార్మల్‌ వర్డ్స్‌ రావు. పక్కన కూర్చుని ప్రాక్టీస్‌ చేయించాలి. నలుగురిలో తిప్పాలి అన్నారు.’’
‘‘సరే, మేం వాడి బర్త్‌డేకి వస్తాం కదా... అప్పుడు నాల్రోజులు ఎక్కువుండి అన్నీ వాడితో పలికిస్తాం’’ అని తన ధోరణిలో చెప్పింది ప్రమీల.
వీళ్లిద్దరూ వరంగల్‌లో ఉంటారు. కూతురు వాళ్లు ఉండేది హైదరాబాదులో. అల్లుడు భరత్‌ కొత్త కంపెనీలో చేరడంతో బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి మూడు నెలలైంది. వాళ్లు ఊరు మారాక చూడ్డానికి ఓసారి వెళ్లొచ్చారు. ‘అప్పుడే మేం హైదరాబాదు వచ్చిన సంగతి మన వాళ్లెవరికీ చెప్పకండి’ అని మాట తీసుకుంది కూతురు.
అల్లుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కానీ హోదా పెద్దదట. భారీ జీతమట. ఎప్పుడూ కంప్యూటర్‌ మెడలో వేసుకున్నట్లే ఉంటాడు. మనిషి ఇంట్లో ఉన్నా మనసు అమెరికాలో ఉంటుంది. అత్తా మామలు వచ్చినప్పుడు ‘బాగున్నారా’ అనీ వెళ్లేటప్పుడు ‘జాగ్రత్త’ అనీ తప్ప మరో మాటకు అతనికి వీలు చిక్కదు.
విశాలమైన మూడు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌లో ఉంటున్న ఉష ఇంటికి పనిమనిషీ, వంట మనిషీ, పిల్లాడిని చూసేందుకు నానీ టైం ప్రకారం వచ్చి వెళ్తుంటారు. ఎప్పుడూ మొబైల్‌ పట్టుకుని ఫ్రెండ్స్‌కి ఫోన్‌ చేయడమో, ఆన్‌లైన్‌లో బట్టలూ, చెప్పులూ, బ్యాగులూ వెదుకుతూ నచ్చితే ఆర్డర్‌ చేస్తూ ఆమె పొద్దు గడుపుతుంది. పిల్లాడికి కావలసినన్ని ఆట వస్తువులు కొనిపెట్టారు. వాటితో విసుగొచ్చినప్పుడు వాడు ఇల్లంతా తిరుగుతూ కిచెన్‌లోకి వెళ్లి డబ్బాలు పడేయడం, ఫ్రిజ్‌లోంచి ప్యాకెట్లు తీయడం, కుర్చీలెక్కి కప్‌ బోర్డుల్లోంచి చేతికందినవి పడేయడం చేస్తే ఉష వాడికోసం టీవీలో యూట్యూబ్‌లో పాటలు పెట్టడమో, వాడి చేతికి ట్యాబ్‌ ఇవ్వడమో చేస్తుంది. టింకూ ట్యాబ్‌ ఆపరేషన్‌లో దిట్ట. క్షణాల్లో తాను కోరుకున్న ప్రోగ్రాం పెట్టుకోగలడు.
ప్రమీల- దామోదరంల వైపు బంధువులు హైదరాబాదులో ఎందరో ఉన్నారు. కరీంనగర్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో పుట్టి పెరిగినా పిల్లల చదువులకూ, ఉద్యోగాల కోసమూ చాలామంది సిటీకి మారారు. ఎవరికీ ఉషావాళ్లు హైదరాబాదులో ఉన్న సంగతి తెలియదు. ఎవరికీ చెప్పొద్దన్నందుకు గత మూడు నెలలుగా వీళ్లు కూడా హైదరాబాదులో ఎవరింట్లో ఏ ఫంక్షన్‌ ఉన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. వెళితే ‘ఉష ఎలా ఉంది’ అని అడిగేవాళ్లకు ‘ఇక్కడే ఉంది’ అని ఒక్కమాటైనా చెప్పాలి కదా అని వారి బాధ.
‘అరె, ఇదేంటి... మీరు రాకుండా ఏ బారసాల, సీమంతంగానీ జరిగాయా. పెద్దవారి దీవెనలు మాకు కావాలి కదా. పిల్లల బర్త్‌డేకు పిలిచినా వచ్చేవాళ్లు. ఇలా మారిపోయారేం’ అని బంధువులు అలకబూనుతున్నారు.
టింకూ బెంగళూరులో పుట్టాడు. వాడి రెండు బర్త్‌డేలు అక్కడే కొలీగ్స్‌తో హోటల్లో గ్రాండ్‌గా జరిగాయి. దానికి బయటివాళ్లు ఈ పెద్ద మనుషులిద్దరే. పది రోజుల్లో వాడి మూడో పుట్టినరోజు ఉంది. బెంగళూరులోలాగే ఇక్కడ కూడా గ్రాండ్‌గా కొలీగ్స్‌ మధ్యన హోటల్‌లో జరపాలని ప్లాన్‌.

మధ్యాహ్నం భోజనాలయ్యాక మనవడి మాటల పరిస్థితిపై ఇద్దరి మధ్య ముచ్చట మొదలైంది.
‘‘మా వైపు పిల్లలెవరైనా ఏడాది దాటిందో లేదో అమ్మా అమ్మా అని అనేవాళ్లు’’ అంది ప్రమీల.
‘‘ఇప్పుడు మావైపు మీవైపు ప్రధానం కాదు. వాడికి మాటలు రాకపోవడానికి మన అమ్మాయీ అల్లుడే కారణం’’ అన్నాడు దామోదరం.
‘‘భలేవారు... వాళ్లముందు అనేరు... మళ్లీ ముఖం చూడరు.’’
‘‘అందరి ముందూ అంటాను. మనుషుల మధ్య ఉంటేనే పిల్లలకు మాటలు తొందరగా వస్తాయి. ఇంటికెవరూ రాకూడదంటారు. బంధువులని పలకరిస్తే బాధలే చెప్పుకుంటారో, డబ్బులే అడుగుతారో అనే భయం. చుట్టాలూ వారి పిల్లలూ ఇంటికి వస్తే అల్లరల్లరి చేస్తారు, ఇంట్లో వస్తువులు చిందరవందర చేస్తారు, పిల్లాడి బొమ్మలని పాడు చేస్తారు, మనశ్శాంతి లేకుండా పోతుంది అని ముడుచుకు కూర్చున్నారు. మనుషులతో మాకేంపని, కొండమీది కోతినైనా ఆన్‌లైన్‌లో కొనేయగలం అనే ధీమా వారిది. అదే కొంప ముంచుతోంది. ఈ విషయం ముందు వాళ్లిద్దరికీ అర్థం కావాలి’’ అన్నాడు దామోదరం.
ఈ మాటలు వినగానే ప్రమీల ఆలోచనలో పడింది.
భర్త చదువుకున్నవాడు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడిగా పేరు, గౌరవం పొందిన మనిషి. అవసరమైతే తప్ప కుటుంబ వ్యవహారాల్లో తల దూర్చడు. ఈయన ఇంత గట్టిగా చెబుతున్నాడంటే అందులో నిజం లేకపోలేదు అనిపించిందామెకు.
‘మరెలా’ అన్నట్లు భర్త ముఖం చూసింది.
‘ఏదో ఆలోచిస్తాలే’ అన్నట్లు ఆయన తల ఆడించాడు.
ఓరోజు ఉష ఫోన్లో మాట్లాడుతూ ‘‘మనవడి పుట్టినరోజు దగ్గరపడుతోంది, ఎప్పుడొస్తున్నారు’’ అంది.
ప్రమీల చేతిలోంచి ఫోన్‌ తీసుకున్న దామోదరం ‘‘ఉషా, మనవాళ్లు ఎవరు ఫోన్‌ చేసినా... ‘మనవడికి మూడేళ్లు నిండుతాయేమో... ఎప్పుడూ బర్త్‌డే... బెంగళూరు వెళ్తున్నారా’ అని అడుగుతున్నారు. ఇప్పుడు మేము బర్త్‌డేకి వచ్చి, వాళ్లకు ఏమని చెప్పాలి. అబద్ధం మావల్ల కాదు. ఈసారి బర్త్‌డే మీరే కానీయండి. ఏమనుకోవద్దు’’ అన్నాడు.
వెంటనే ఉష ‘‘ఫోను మమ్మీకి ఇవ్వు’’ అంది.
అంతా వింటున్న ప్రమీల ఫోను తీసుకుని ‘‘ఆఁ చెప్పవే’’ అంది.
‘‘ఏంటమ్మా ఇది... డాడీ ఏదేదో అంటున్నాడు. మీ కూతురు దగ్గరికి మీరు వస్తున్నారు. మధ్య వాళ్లకేంటి బాధ...’’ అంది విసురుగా.
‘‘మా పరిస్థితి చెప్పాడాయన’’ అంది ప్రమీల భర్త పక్షం వహిస్తూ.
‘‘నాకు సమాధానం చెప్పమంటే మీ ఆయనకు వంత పాడుతున్నావేంటి’’ అని విసురుగా ఫోన్‌ పెట్టేసింది.
గాబరాగా తిరిగి ప్రమీల మళ్లీ కూతురికి ఫోను చేసినా ఆమె ఎత్తలేదు. భర్తవైపు చూసింది. ‘ఏంకాదు’ అని ఆయన కళ్లతో చెప్పాడు.
మర్నాడు పొద్దున్నే టిఫిన్‌ చేస్తుండగానే ఉష నుంచి ఫోన్‌ వచ్చింది.
‘‘చెప్పు తల్లీ... మనవడు లేచాడా’’ అంది ప్రమీల.
‘‘మీకోసం బర్త్‌డేకి ఒకరిద్దరిని పిలుద్దాం... మీరు మాత్రం రావాలి’’ అంది ఉష.
భర్త సరే అన్నట్లు తలూపగానే ‘‘అలాగయితే సరే’’ అంది.
‘‘మధు మామయ్యా వాళ్లనూ, సుజాత పిన్ని వాళ్లనూ పిలుద్దామా’’ అంది.
‘‘నీ ఇష్టమమ్మా’’
‘‘చేసేది చేసి నీ ఇష్టమంటావేంటి’’ అంది ఉష.
‘‘అయ్యో నిన్నేమన్నామే. మా ఇబ్బంది చెప్పుకున్నాం కానీ మేం పిలవమన్నామా’’ అంది ప్రమీల.
‘‘సరే...సరే...’’ అని ఫోన్‌ పెట్టేసింది ఉష.
మధ్యాహ్నం ఉష మళ్లీ ఫోన్‌ చేసి ‘‘ఇంకో ఇద్దరిని పిలుద్దామా’’ అంది.
నీ ఇష్టమంటే ఫోన్‌ పెట్టేస్తుందేమోనని ‘‘బాగుంటుంది’’ అంది ప్రమీల.
‘‘ఎవరైతే బాగుంటుంది’’ అంది ఉష తల్లిపై భారమేస్తూ.
అమ్మాయి పిలుద్దామన్న ఇద్దరూ తనవైపు వాళ్లే కాబట్టి భర్త తరఫువాళ్ల పేర్లు చెప్పింది... ‘‘శ్రీను బాబాయ్‌, సరోజా ఆంటీ వాళ్లను పిలువు’’ అని ఫోన్‌ పెట్టేసింది.
మళ్లీ కొద్దిసేపటికి కూతురు నుంచి
మళ్లీ ఫోను వచ్చింది. ‘‘శ్రావణితో రజనీతో నేను చిన్నప్పుడు ఎంతో ఆడుకునేదాన్ని. ఇప్పుడెక్కడున్నారో...’’
‘‘సిటీలోనే లింగంపల్లిలో ఉన్నారు. పిలిస్తే సంతోషిస్తారు’’ అంది ప్రమీల.
‘‘ఈ ఆరుగురి నంబర్లయితే ఇవ్వు. నేను మాట్లాడతాను.’’
‘‘సరే...’’ అని ఫోను దామోదరానికి ఇస్తే నంబర్లు మెసేజ్‌ చేశాడు.
మనవడి బర్త్‌డేకు మూడురోజుల ముందు వెళ్లారిద్దరూ. వీళ్లు వచ్చింది తెలిసి మర్నాడే ఆరు కుటుంబాల వాళ్లూ దిగారు. ఇల్లంతా ఊహించని సందడి. ఉష వారికి ఓ బెడ్‌రూమ్‌ చూపిస్తే లగేజ్‌ పెట్టుకున్నారు.
‘‘మీ పనిమనుషులకు ఈ రెండ్రోజులు సెలవు ఇవ్వవే ఉషా... ఫంక్షన్‌ టైమ్‌కి రమ్మని చెప్పు. అంతా మేం చూసుకుంటాం’’ అంది సరోజా ఆంటీ. అందరూ ఆమెకు వంత పాడారు. సుజాత పిన్ని ఈలోగా టీ పెట్టి అందరికీ ఇచ్చింది. ఉష కోసమని చేసుకొచ్చిన లడ్లూ, అరిసెలూ, చెక్కలూ, కారప్పూసా ఆమె చేతిలో పెట్టారు. హాల్లో కూర్చుని ముచ్చట్లాడుతూ వంటల కోసం కూరగాయలు ముందేసుకున్నారు. మాటల్లోనే వంటలయ్యాయి. ఇల్లంతా మాటల, వంటల ఘుమఘుమలతో నిండిపోవడం ఉషకు వింతగా సంతోషంగా ఉంది. భోజనాలయ్యాక హాల్లోనే నడుం వాల్చారు. ముచ్చట్లూ, నవ్వులూ, గుసగుసలు ఓవైపు సాగుతూనే ఉన్నాయి. పిల్లలు ఇల్లంతా తిరుగుతూ దాగుడుమూతలూ ఇంకేవో ఆటలూ ఆడుతున్నారు. వారివెంటే టింకూ నవ్వుతూ కేరింతలు కొడుతూ
పరిగెడుతున్నాడు. వాళ్లంతా గట్టిగా పేర్లతో పిలుచుకుంటుంటే వచ్చీ రానీ పదాలు తానూ అంటున్నాడు. ‘‘అరె టింకూ రారా...’’ అంటే గంతులేస్తూ దగ్గరకు వెళ్తున్నాడు. అంత ఆనందం వాడిలో ఉష ఎన్నడూ చూడలేదు. పిల్లలంతా కలిసి భోంచేస్తుంటే టింకూ వాళ్ల పక్కన కూర్చుని వాళ్లను అనుకరిస్తూ తానూ తిన్నాడు.
రాత్రి డ్యూటీ నుంచి వచ్చిన భరత్‌ వీళ్లందరినీ చూసి ముందు కొంత తత్తరపడి అందరినీ పలకరించి బెడ్‌రూమ్‌లోకి వెళ్లాడు.
కొద్దిసేపయ్యాక భారతత్తమ్మ ఉషను పిలిచి ‘‘మీ ఆయన్ని ఓసారి ఇలా రమ్మనవే’’ అంది.
ఆమాట విన్న భరత్‌ బయటికొచ్చాడు.
‘‘బాబూ, బర్త్‌డే వంటలకు బయట ఆర్డర్‌ చేయకు. ఏమేమి ఐటమ్స్‌ కావాలో  ఎంతమందికి కావాలో చెప్పండి, అన్నీ రెడీ అవుతాయి. సరేనా’’ అందామె.
అతనేదో సర్ది చెప్పబోగా అందరూ ఒక్కసారిగా నో...నో... అంటూ అతన్ని మాట్లాడనీయలేదు.
పెద్దలంతా కలిసి వంటల ఏర్పాట్లు చూసుకున్నట్లే పిల్లలంతా కలిసి చక్కగా డెకరేషన్‌ చేశారు.
ఎంతో సంబరంగా బర్త్‌డే జరిగింది. ఎలా వచ్చారో అలానే వెళ్లిపోయారందరూ. ఇల్లంతా బోసిపోయినట్లయింది. ఇంట్లో రెండ్రోజులు వారి ముచ్చట్లే.
‘‘రేపు వెళ్దురులే అని అంటే ఎవరూ ఆగలేదు’’ అని తల్లితో పదే పదే అంది ఉష.
టింకూ గాలి తీసిన బంతిలా అయ్యాడు.
రెండ్రోజులకు బర్త్‌డే ఫోటో ఆల్బమ్‌ వచ్చింది. టింకూ ఎగబడి పిల్లల ఫొటోలను వేలితో చూపిస్తూ ‘‘అన్న, బాబీ, రాణీ, చిన్న...’’ అని వారిని గుర్తుపడుతూ పేర్లు చెబుతున్నాడు.
ఇన్నాళ్లు అమ్మా, నాన్నా, తాతా, అమ్మమ్మా అననివాడు రెండ్రోజుల్లో ఇన్ని పేర్లు ఎలా నేర్చాడబ్బా అని నలుగురూ ఆశ్చర్యపోయారు.
దామోదరం తీరిగ్గా కూర్చుని టింకూకి ఆల్బమ్‌లో తమ ఫొటోలు కూడా చూపిస్తూ పిలవడం ప్రాక్టీసు చేయిస్తున్నాడు.
ఉష- భరత్‌ల వాలకం చూస్తుంటే వారికి విషయం కొంతైనా అర్థమైనట్లుంది.
ఉష శుక్రవారం సాయంత్రం రజనీకి ఫోన్‌ చేసి ‘‘రేపొద్దున్న పిల్లలతో కలిసి మళ్లీ రండే... అసలు కలిసున్నట్లే లేదు’’ అంది.
‘‘మేం తర్వాత వస్తాం కానీ... ఈసారికి మీరే మా ఇంటికి రండి’’ అంది రజని.
తల్లితో ఆ మాట చెబితే ‘‘వాళ్లది డబుల్‌ బెడ్‌రూమ్‌ పోర్షన్‌ మరి’’ అంది.
‘‘అయినా పర్వాలేదు. టింకూ పిల్లలతో హాయిగా ఆడుకుంటాడు. మాటలూ నేర్చుకుంటాడు. రజనీ కూడా అబ్బో ఎన్ని ముచ్చట్లు చెబుతుందో అసలు టైమే తెలియదు’’ అంది ఉష.
భర్త కూడా సరే అనడంతో కారు రజని ఇంటివైపు కదిలింది. వెనుక సీట్‌లో కూర్చున్న ప్రమీలా దామోదరం ముసిముసి నవ్వులతో చేతులు కలుపుకున్నారు.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న