ఐటీలో మన అంకురాలు మేటి! - Sunday Magazine
close

ఐటీలో మన అంకురాలు మేటి!

సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌... ఈ పదాలకు సంక్షిప్త రూపమే సాస్‌. ఈమధ్య మనదేశంలో ఈ-కామర్స్‌, ఎడ్‌టెక్‌ కంపెనీలకు దీటుగా ఈ సాస్‌ విభాగంలోని అంకుర సంస్థలూ యూనికార్న్‌ స్థాయిని అందుకుంటున్నాయి. గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ లాంటి కంపెనీల్ని తమ ఖాతాదారుల్లో చేర్చుకుని భారతీయుల సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాల్ని ప్రపంచం మెచ్చుకునేలా చేస్తున్నాయి.


సాఫ్ట్‌వేర్‌ పోస్ట్‌మేన్‌!

పోస్ట్‌మేన్‌... ఈ పదానికి కొత్త అర్థాన్ని చెబుతున్నారు సంస్థ వ్యవస్థాపకుడు అభినవ్‌ ఆస్థానా. అభినవ్‌కు కోడింగ్‌ అంటే ఇష్టం. ప్రోగ్రామింగ్‌ చేశాక వాటిని పరీక్షించే సాంకేతికత అవసరం ఉందని గ్రహించి పోస్ట్‌మేన్‌కు శ్రీకారం చుట్టాడు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు తెచ్చే ఉత్పత్తులు పనిచేయడానికి అనేక రకాలైన సాఫ్ట్‌వేర్‌లు అనుసంధానమవ్వాలి. పోస్ట్‌మేన్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తే సాఫ్ట్‌వేర్‌ల మధ్య అనుసంధానం ఎలా ఉందో, ఎక్కడ సమస్య ఎదురవుతుందో తెలుసుకోవడం సులభమవుతుంది. ఒకసారి ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చాక కూడా బగ్స్‌ లాంటివాటిని ప్రాథమిక దశలోనే గుర్తించడంలో ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుంది. బిట్స్‌ పిలానీ పూర్వ విద్యార్థి అయిన అభినవ్‌ తన స్నేహితులు అంకిత్‌ సోబ్తీ, అభిజిత్‌ కానేలతో కలసి దీన్ని 2016లో ప్రారంభించాడు. బెంగళూరు కేంద్రంగా మొదలైన ఈ కంపెనీకి ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ కార్యాలయం ఉంది. గతేడాది జూన్‌ నాటికే ఈ సంస్థ విలువ రూ.15వేల కోట్లు. పోస్ట్‌మేన్‌ సేవల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించినపుడే దీని పనితీరు నచ్చి సేవల వినయోగానికి ముందుకు వచ్చింది గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌. పోస్ట్‌మేన్‌ మొదటి ఖాతాదారు ఆ సంస్థే అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోటికిపైగా డెవలపర్స్‌, అయిదు లక్షల సంస్థలూ పోస్ట్‌మేన్‌ను ఉపయోగిస్తున్నాయి.


ఉత్పత్తుల పరీక్ష కోసం!

బ్రౌజర్‌స్టాక్‌... పేరు సామాన్యులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఈ సాస్‌ కంపెనీ విలువ అక్షరాలా రూ.30వేల కోట్లు. ఐఐటీ బోంబే పూర్వ విద్యార్థులు నకుల్‌ అగర్వాల్‌, రితేష్‌ అరోరా 2011లో స్థాపించిన ఈ సంస్థ ఈ మధ్యనే సిరీస్‌-బి రౌండ్‌లో 30వేల కోట్ల విలువతో రూ.1500 కోట్లు పెట్టుబడిగా పొందింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ పద్ధతిలో టెస్టింగ్‌ సేవల్ని ఈ కంపెనీ అందిస్తోంది. వీరి ఖాతాదారుల్లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ట్విటర్‌, స్పోటిఫై... లాంటి కంపెనీలున్నాయి. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఏదైనా సంస్థ కొత్తగా వెబ్‌సైట్‌, ఆప్‌, డిజిటల్‌ పరికరాల్ని తెచ్చినపుడు వివిధ స్థాయుల్లో, వివిధ వేదికలమీద తమ ఉత్పత్తుల పనితీరుని పరీక్షిస్తుంది. బ్రౌజర్‌స్టాక్‌ అలాంటి సంస్థలకు 2000 రకాలైన వేదికలమీద పరీక్షించుకునే అవకాశం ఇస్తోంది. వీరికి చెందిన భిన్నమైన టీవీలూ, మొబైల్‌ సెట్లూ, ల్యాప్‌టాప్‌లూ, ట్యాబ్‌లూ, ఆడియో పరికరాలూ మొదలైన వాటిమీద 50 వేల కంపెనీలు తమ ఉత్పత్తుల్ని పరీక్షించుకోవడం విశేషం. దృశ్యసంబంధ ఆవిష్కరణల్ని పరీక్షించే ‘పెర్సీ’ అనే అంకుర సంస్థను ఇటీవలే చేజిక్కించుకున్న బ్రౌజర్‌స్టాక్‌... తాజాగా వచ్చిన పెట్టుబడితో ఇలాంటి మరి కొన్ని సంస్థల్ని కొనుగోలు చేయాలని చూస్తోంది. ముంబయితోపాటు డబ్లిన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లలో కార్యాలయాలున్న ఈ సంస్థ ఉద్యోగుల సంఖ్య కేవలం 750. ‘ఏ రంగంలోని ఇంజినీర్లయినా అద్భుతమైన ఉత్పత్తులు ఆవిష్కరించేటపుడు వాటిని పరీక్షించడానికి అనువైన, సమర్థమైన వేదికగా బ్రౌజర్‌స్టాక్‌ని అభివృద్ధి చేస్తున్నాం’ అంటారు వ్యవస్థాపకులు.


వినియోగదారులతో అనుబంధానికి!

విభిన్నమైన రంగాల్లో పనిచేసే కంపెనీలు తమ వినియోగదారులతో, ఉద్యోగులతో సంప్రదింపులు జరపడానికి అత్యుత్తమమైన మార్గాల్ని చూపిస్తుంది ఫ్రెష్‌ వర్క్స్‌. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, జోహో కంపెనీల్లో పనిచేసిన గిరీష్‌ మాతృభూతమ్‌ 2010లో దీన్ని చెన్నై కేంద్రంగా ప్రారంభించారు. రూ.26వేల కోట్ల విలువైన ఈ సంస్థ సేవల్ని 125 దేశాల్లో ఉపయోగిస్తున్నారు. వీరికి అమెరికా అతిపెద్ద మార్కెట్‌. సగం ఆదాయం అక్కణ్నుంచే వస్తోంది. ఐటీ హెల్ప్‌డెస్క్‌(ఫ్రెష్‌ సర్వీస్‌), సేల్స్‌ఫోర్స్‌ ఆటోమేషన్‌(ఫ్రెష్‌ సీఆర్‌ఎమ్‌), హెచ్‌ఆర్‌(ఫ్రెష్‌టీమ్‌)... ఇలా ఎనిమిది రకాలైన విభాగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. కంపెనీలు వినియోగదారులతో, ఉద్యోగులతో సంప్రదించుకునేందుకు వీలుపడే ఏఐ చాట్‌బోట్స్‌ లాంటివి అందిస్తోంది. వీరి ఖాతాదారుల్లో అంకుర సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకూ ఎన్నో ఉన్నాయి. దాదాపు పదేళ్లపాటు చెన్నైలో ఉంటూనే  ఈ కంపెనీని నడిపిన గిరీష్‌... మార్కెట్‌ విస్తరణ కోసం రెండేళ్లుగా అమెరికా నుంచి పనిచేస్తున్నారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇక్కణ్నుంచే పనిచేస్తుంటారు. చిన్నా, పెద్ద కంపెనీలు సొంతంగా సంప్రదింపుల కోసం సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసుకునే పనిలేకుండా వీటిని రూపొందిస్తున్నారు. వ్యాపారాలు వినియోగదారుడు కేంద్రంగా మారుతున్నాయి. ఆన్‌లైన్లో సేవలు అందించడం మొదలయ్యాక అది మరీ ఎక్కువైంది. చాలావరకూ చర్చలూ, సంప్రదింపులూ, కొనుగోళ్లూ ఆన్‌లైన్లోనే జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్‌, సేల్స్‌ డేటాను కంపెనీలు మరింత సమర్థంగా ఉపయోగించుకునే విధంగా ఫ్రెష్‌వర్క్స్‌ సాయపడుతుంది.


మీకు తెలుసా!

దేశం పేరు లేకుండా పోస్టల్‌ స్టాంపులను విడుదల చేసే దేశం బ్రిటన్‌ ఒక్కటే. దేశం పేరు బదులుగా రాణి లేక రాజు బొమ్మ ఉంటుంది.ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న