మీ కవల సోదరిని చూశారా? - Sunday Magazine
close

మీ కవల సోదరిని చూశారా?

ఈ ఫొటోలు ఎవరివో తెలుసా? ‘అదేమో తెలియదు కానీ కవలలు అనైతే తెలుస్తోంది’ అని చెప్పేస్తారు ఎవరైనా సరే. కానీ గమ్మత్తు ఏమిటంటే వాళ్లు అసలు ట్విన్సే కాదు. ‘ఆఁ, చూస్తేనేమో అచ్చుగుద్దినట్టు ఉన్నారు. కవలలు కాదంటున్నారు. మరేదైనా సినిమా ఎఫెక్టా ఏంటీ’ అనుకుంటున్నారా... అదేం కాదండీ, ఒకే పోలికలతో ఉన్నా ఒకరికొకరు అపరిచితులు వీళ్లు.

‘మొన్న పెళ్లిలో అచ్చం నీలా ఉండే అమ్మాయిని చూశానే. పక్క నుంచి ముక్కూమొహమూ చూసి నువ్వేనేమో అనుకుని గబగబా దగ్గరికి వెళితే... నువ్వు కాదు. కానీ సేమ్‌ నీలాగే ఉందంటే నమ్మూ’... ఇలా మనకు బాగా తెలిసినవాళ్ల పోలికలతో ఉన్న వ్యక్తులు కనిపించిన సంఘటనలు ఎప్పుడో ఒకప్పుడు తారసపడే ఉంటాయి కదూ. ఇలాంటప్పుడే ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారనేది నిజమే కాబోలు అనిపిస్తుంటుంది. ఇంచుమించు ఒకలా ఉంటేనే అంత ఆశ్చర్యపోతుంటాం. మరి అచ్చుగుద్దినట్టు మనలా ఉంటే ఇంకెంత థ్రిల్‌ అవ్వాలి! ఇదిగో ఇక్కడున్న వాళ్లంతా అదే ఫీలైవుంటారు. ఎందుకంటే అసలు ఒకరికొకరికి సంబంధమే లేకపోయినా ప్రింట్‌ దిగిపోయారంతే.

ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ వీళ్లంతా ఎలా కలిశారంటే ‘ట్విన్‌స్ట్రేంజర్స్‌.నెట్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా!

2015లో ఐర్లాండ్‌కు చెందిన నియఫ్‌ గీనీకి తనలా ఉండే వాళ్లు ప్రపంచంలో మరెక్కడైనా ఉన్నారేమో తెలుసుకుందామనే ఆలోచన వచ్చిందట. దీంతో ఇద్దరు స్నేహితులతో కలిసి ట్విన్‌స్ట్రేంజర్స్‌ పేరుతో ఈ వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే, దీంట్లో రిజిస్టర్‌ అవ్వొచ్చు. సరిగ్గా కనిపించే మన ఫొటోని అప్‌లోడ్‌ చేస్తే చాలు. ముఖాల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ ద్వారా వెంటనే అందులో ఉన్న ఫొటోలతో మన ముఖానికి దగ్గర పోలికలున్న ఫొటో తెరమీదకు వచ్చేస్తుంది. మనలాంటి వ్యక్తిని మ్యాచ్‌ చేసేస్తుంది. ఇందులో ప్రస్తుతం దాదాపు 90 లక్షల మంది వరకూ రిజిస్టర్‌ అయ్యారు. చాలామంది ఎక్కడెక్కడో ఉన్న తమలాంటి వ్యక్తుల గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్‌ అయ్యారు.

ఆస్ట్రేలియాకు చెందిన అంబెర్‌ అనే అమ్మాయి ఈ సైట్‌లో తన ఫొటో పెట్టింది. ఇంకేముంది, ఆమె పోలికలున్న అమెరికాకు చెందిన మ్యాడీ అనే అమ్మాయి ట్విన్‌స్ట్రేంజర్‌గా తెరపైకి వచ్చేసింది. ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటంతో ఎంతగానో అబ్బురపడిపోయి ఓ దగ్గర కలుసుకున్నారు. సరదాగా ఒకేలా తయారై బయటకొచ్చిన వారిద్దరినీ చూసి కుటుంబ సభ్యులూ తికమక పడ్డారట. వీళ్లే కాదూ... ఇలా ఎందరో తమ ట్విన్‌స్ట్రేంజర్లతో కలుస్తూ ఆ ఫొటోల్నీ, వీడియోల్నీ సోషల్‌మీడియాలో పంచుకుంటే ‘నిజంగా ట్విన్స్‌ కాదా’ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారట. ట్విన్‌స్ట్రేంజర్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లతోపాటు ఆప్‌ కూడా ఉంది. ఆలస్యమెందుకు, సరదాగా మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి- మీలా ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో!

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న