పుస్తకమే బొమ్మరిల్లు! - Sunday Magazine
close

పుస్తకమే బొమ్మరిల్లు!

పిల్లలకు డాల్‌ హౌస్‌లు అంటే బోలెడంత ఇష్టం ఉంటుంది. వాటిని ముందుపెట్టుకుని ఏదేదో ఊహించుకుంటూ ఆడుకుంటుంటారు. అయితే, పేరుకి బొమ్మరిళ్లే కానీ పెద్ద పెట్టెలా ఉండే వీటిని పెట్టేందుకు ఎక్కువ స్థలమే కావాలి. పైగా చిన్నారులు ఏదైనా కొన్న వెంటనే కొద్దిరోజులు బాగా ఆడతారు. తర్వాత దాన్ని పట్టించుకోరు. అప్పుడు ఈ బొమ్మ ఇళ్లు అడ్డంగా అనిపిస్తాయి. అలా కాకుండా అవసరం లేనప్పుడు డాల్‌హౌస్‌లను పుస్తకంలా మడిచి పెట్టేస్తే బాగుంటుంది కదా... ఈ ‘పాప్‌ అప్‌ త్రీడీ  డాల్‌హౌస్‌ బుక్‌’లు అలాంటివే. మూసి ఉన్నప్పుడు ఇవి మామూలు పుస్తకంలా ఉంటాయి. కానీ పుస్తకాన్ని పూర్తిగా తెరిచి తాడుతో వెనకవైపు కట్టేస్తే రెండంతస్తుల భవనం కనిపిస్తుంది. అందులో వంటగదీ, హాలూ, పడకగదీ, మెట్లూ, కుర్చీలూ, సోఫాలూ... ఇలా అన్నీ ఉంటాయి. బాగుంది కదూ..!


వాచీనే రోబో అయితే!

ఇక్కడున్న బొమ్మల్ని చూసి ‘అరె పిల్లల వాచీకి సరిపోయే మ్యాచింగ్‌ రోబో వస్తున్నట్టుందే’ అనుకుంటే మీరు పొరబడినట్టే. ఎందుకంటే ఇవి వేరు వేరు కాదు. ఒకే బొమ్మ రోబో అవుతుంది, వాచీగానూ మారుతుంది. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఈ ‘రోబో టాయ్‌ కన్వర్టబుల్‌ డిజిటల్‌ వాచీ’ని కావాలనుకున్నప్పుడు చేతికి గడియారంలా పెట్టుకుని సమయం చూసుకోవచ్చు. సరదాగా ఆడుకోవాలనుకుంటే దాన్నే బొమ్మలా మార్చేసుకోవచ్చు. రకరకాల రంగుల్లో దొరుకుతున్న ఈ రోబో వాచీని పిల్లలకు బహుమతిగా ఇచ్చారంటే ఆశ్చర్యపోకుండా ఉంటారా!


డ్యాన్స్‌ చేద్దాం రండి...

ఏదైనా ఆట ఆడుకోవాలంటే కనీసం ఒక్కరో ఇద్దరో అయినా ఉంటే బాగుంటుంది కదూ! కానీ ఈ ‘డ్యాన్సింగ్‌ ఛాలెంజ్‌ ప్లే మ్యాట్‌’తో మనకు మనమే పోటీ పెట్టుకుని ఆడేసుకోవచ్చు. చూడ్డానికి యోగా మ్యాట్‌లా పెద్దగా ఉంటుంది. బ్యాటరీలతో నడిచే ఈ మ్యాట్‌మీద తొమ్మిది రకాల బొమ్మలుంటాయి. పైన స్కోర్‌ బోర్డ్‌ కూడా ఉంటుంది. స్టార్ట్‌ బటన్‌ నొక్కి మ్యాట్‌ మీద అడుగుపెట్టగానే మ్యూజిక్‌ మొదలవుతూ మ్యాట్‌మీదున్న కొన్ని బొమ్మలు వెలుగుతూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఆ వెలిగే బొమ్మలపైన మ్యూజిక్‌కు అనుగుణంగా వెంటవెంటనే అడుగులేస్తూ ఉండాలి. మిస్‌ అవ్వకుండా సరిగ్గా వేస్తుంటే అది స్కోర్‌ బోర్డ్‌లో పడుతుంటుంది. అంతేకాదూ మీరు డ్యాన్స్‌ చేస్తున్నట్టుగానూ ఉంటుంది.


పెయింటింగ్‌ నేర్పే టేబుల్‌!

స్వీటీ ఓ చిలుక బొమ్మ అందంగా గీసి తన స్నేహితులకు చూపించింది. ‘అబ్బ భలే వేశావే. ఇంత చక్కగా ఎలా నేర్చుకున్నావు’ అని అడిగారు స్నేహితులందరూ. దానికి స్వీటీ ‘మా మామయ్య తెచ్చిన పెయింటింగ్‌ టేబుల్‌’తో అంటూ బదులిచ్చింది. ఇంతకీ ఏంటా టేబుల్‌ అంటే... పిల్లలకోసం ప్రత్యేకంగా వస్తున్న ‘కిడ్స్‌ ప్రొజెక్టర్‌ డ్రాయింగ్‌ టాయ్‌ సెట్‌’ అది. దీంతో పిల్లలు ఎవరి సాయం లేకుండానే సులువుగా బొమ్మలు వేసేయొచ్చు. చిన్న టేబుల్‌కే ఓ ప్రొజెక్టరూ అందులో పెట్టడానికి రకరకాల బొమ్మల డిస్కులొస్తాయి. కావాల్సిన బొమ్మ డిస్కును అమర్చి ప్రొజెక్టర్‌ని సెట్‌ చేయగానే ఆ బొమ్మ దృశ్యం టేబుల్‌ మీద పడుతుంది. దాని మీద పేపర్‌ని ఉంచగానే బొమ్మ ఆకారం కనిపిస్తుంటుంది. ఇంకేముంది, ఎంచక్కా రంగు పెన్సిళ్లతో ఆ బొమ్మను గీసేయడమే!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న